పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొకదాని కొకటి కాపుగాయు చుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలుబది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవనలును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతికుడ్యోపరిదేశమున నేనుగులు, రథములు గూడ బోగల మార్గములున్నవి. గవనులలో గోటగోడలపైన బృహత్పాషాణ పాతన యరత్రములు, (పెద్ద రాతిబండలను విసరు యంత్రములు) ప్రచండాగ్ని బాణముల విసరు యంత్రములునున్నవి.

కుబ్జ విష్ణువర్ధన మహారాజు సైన్యములతో బిష్టపురమును ముట్టడించునప్పటికి గోటగోడలపై లక్షలకొలది ధనుర్ధారులైన వీరులు కిటకిటలాడుచుండిరి. మొదటిగోడపై విలు కాండ్రును, కాగిన నూనె పోయువారును, సూరేకారము గంధకముతో సిద్ధముచేసిన యగ్ని బాణముల నుపయోగించు వారును అప్రమత్తులై యుండిరి. రెండవ గోడపైన శతఘ్నులును, నూరు వాడిగల కత్తులు పొదిగిన పెద్దదూలము నుపయోగించు సైనికులు, సేనాధిపతి యాజ్ఞకై వేచియుండిరి. మూడవదియగు లోనిగోడపైన భయంకరమైన పాషాణ పాతనయంత్రములు, చిన్న చిన్న కొండలంత రాళ్ళనైనను క్రోశము రెండు క్రోశముల దూరము విసరివైచుటకు నాయత్తముగ నున్నవి.

విష్ణువర్ధనుడు తన రెండులక్షల పదాతులను, పదివేల యాశ్వికులను, రెండువేల రథికులను అయిదువందల యేనుగులను గోటకు యోజన దూరమున జుట్టును వ్యూహము లేర్పరచి, యింత దుర్భేద్యమగు కోటను సులభముగబట్టు మార్గ మాలోచించుచు, నెక్కిన గుఱ్ఱమును దిగక, కాలకంపన మహారాజుతోడను, ఆయన కొమరుడగు జయనంది తోడను, పిట్టపిడుగగు బుద్దవర్మతోడను పిష్టపురదుర్గమునకు చక్రబంధమల్లి నస్కంథా వారముచుట్టును తిరుగుచుండెను.

ఎట్టి దుర్గమదుర్గమునైనను విష్ణువర్ధను డవలీలగ బట్టగలుగువాడు. నున్న విప్రపాతములు గలిగి, యనేక కుడ్య సంరక్షితములై మహోన్నతములైన పర్వతము లందలి కోటలనైన నా చాళుక్యుడు సుఖముగ బట్టుకొన గలుగుటచే 'విషమసిద్ది'యను బిరుదమును సముపార్జించెను. విషమ సిద్ది చాళుక్యు నెరిగిన వారెవ్వరును దిట్టములైన కోటలు తమ కున్నవనియు నా కోటలలో దలదాచుకొని, తమ్మురక్షించుకొనవచ్చుననియు విసుమంతయేని ధైర్యము వహించియుండెడివారు కారు.

పులకేశివల్లభు డెబ్బదివేల యేనుగులను నిరువదివేల శతఘ్నియంత్రములను, నొక లక్ష యగ్ని బాణ యంత్రములను బ్రయోగించి పిష్టపుర దుర్గమును బట్టుకొనఁ గలిగెనట. ఆ పులకేశి వాతాపినగరము చేరినప్పటి నుండియు దానార్ణవ గాంగ యువరాజు, చాళుక్య సైన్యములు దక్షిణమునకు బోవగనే, పిష్టపురము తిరిగి పట్టుకొనెను. కోటి కర్షక పణములు వెచ్చించి మరల నాకోటను బాగుచేయించెను. పృధ్వీ మహారాజునకు “భట్టారక నామము సమర్పించి, తన తోటి మహారాజని యాతని వేయి విధముల బొగడి, కళింగరాజ్యములోని కొన్ని విషయములను (భూభాగములు) గూడ నాతనికి ధారాదత్త మొనర్చి పృధ్వీమహారాజు కొమరునకు దన చెల్లెలు జాహ్నవీకుమారి నిచ్చి, వివాహముచేసి రామకాశ్యపులకును గాంగులకును గల సంబంధముల నెక్కువ చేసెను.

అడివి బాపిరాజు రచనలు - 6

249

అంశుమతి (చారిత్రాత్మక నవల)