పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



8

“నీవు దక్కమాతృభూమియైన యాంధ్రదేశమున శాంతిని నెలకొల్పు వారింకొకరు లేరు తమ్ముడా!” యని విష్ణువర్ధనుని భుజముపై తన దక్షిణహస్తమునుంచి పులకేశి బల్కినాడు. తమ్ముని చూడగనే చక్రవర్తికి గన్ను లానందమున జిగురించును. తన పుత్రులకన్న జిన్న తమ్ముని నెక్కువ ప్రేమతో బెంచుకొన్నాడు చాళుక్య సమ్రాట్టు. అన్నగారి యడుగు జాడలనే పూజించు విష్ణువర్ధనుడు తన కిరువదివేల బలగముండిన జాలునని కాలకంపనుని వెంటబెట్టుకొని విజయయాత్రకై వెడలుచుండును.

“విష్ణువర్ధనా! పిష్టపురదుర్గము కొండపై నిర్మింపబడకపోయినను నభేద్యమగుగోట కావున నానగరమునే నీవు రాజధానీనగరము సేసికోని యాంధ్ర సామ్రాజ్య మొకటి పునర్నిర్మాణము సేయుమని నిన్నాశీర్వదించుచున్నాను.”

“మహాప్రభూ! పరమమాహేశ్వరులైన మీ ఆజ్ఞయే నాకు శ్రీరామరక్షయు, మంత్రప్రసాదమును.”

“తమ్ముడా! నీవు రూపమున జిన్నవాడవయినను విక్రమమున, విజ్ఞానమున బెద్దవాడవు. నాయనా! నీ వేల నింతవఱకు వివాహము చేసికొన నిరాకరించినాడవో నా కేమాత్రమును రహస్యము గోచరింపలేదు. రాజన్యులు సురూపలై యుత్తమగుణాన్వితలైన తమ బాలికల నీకర్పింప నాకు బంపు రాయబారములు లెక్కింప నలవిగాదు గదా! నీ వన్నింటికి బెడమొగము బెట్టితివి. నీ యిష్టానిష్టము లన్నియు హృదయమునకు సంబంధించినవి. అందు నేనేమి జోక్యము గలుగ జేసికొనగలను!”

“అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్చను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృదయమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీలులేకపోయినది. హృదయగతమగు ఆ వ్రత మేనాటికి సఫలమగునో ఆనాడు నా పాణిగ్రహణ మహోత్సవము తామే పెద్దలై జరిపింప సంభవింప గలదు. అంతవఱకును నన్ను క్షమింపుడని మాత్రము వేడుకొనుచున్నాను.”

పాదముల కెఱగిన తమ్ముని సార్వభౌముఁడు భుజముల బట్టి లేవనెత్తి గాటముగ గవుగలించుకొనెను.

“సత్వరమున విజయుడవై నాకు వార్త పంపుము విష్ణువర్థనా!” అని పులకేశి తమ్ముని కన్నులలోనికి దీక్ష్ణమైన చూపులు బరపి, మందహాసవదనుఁడై యాశీర్వదించెను.

విష్ణువర్ధనుడు సైన్యముల నడుపుకొనుచు బూర్వదిశాభిముఖుడై యాత్ర సాగించినాడు.

మధ్యదుర్గ గ్రామము నీడి, యాంధ్రమహాదేశము పలు తావులనుండి వేగుల రప్పించుకొనుచు, నచ్చటచ్చట స్కంధావారముల నిర్మింపించి, సైన్యముల నిలుపుచు బ్రయాణమున వేగము తగ్గింపకయు, సైన్యముల నలసట నొందింపకయు, నాతడు జైత్రయాత్ర సాగించుచుండెను.

అడివి బాపిరాజు రచనలు - 6

247

అంశుమతి (చారిత్రాత్మక నవల)'