పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజకుమారుడు విడిదిచేసిన హర్మ్యము మ్రోల నా రథమాగగానె సర్వసేనాధిపతియు, మహాదండనాయకుడును ఇరువురు రక్షక భటులతో వచ్చి, రాజకుమారుని రథము నుండి దింపి లోనికి గొనిపోయిరి. మహా దండనాయకుడు, మహా సేనాపతియు గత్తులు దూసియే యుండిరి.

ఆ రాత్రి వారిరువురు యువరాజును ఆయన భవనముననే బంధించి రాజాజ్ఞను బరిపాలించువారై యప్రమత్తత గావలి కాచిరి.

రాజవైద్యుడు వచ్చి యువరాజునకు వైద్యోపచారయులు చేసినాడు. ఆ యుపచారములచే యువరాజునకు మత్తువీడి పూర్తిగ మెలకువ వచ్చినది. తాను బరుండిన పల్యంకముపై లేచి, కూర్చుండి, ఆ దాపున గత్తులు దూసి నిలుచుండిన మహాదండ నాయకుని మహాసేనాధిపతిని నాశ్చర్యమున దిలకించుచు “ఏ, ఏ, ఏమి జరిగినది... జరిగినది... జరిగినది! మహాసేనాధిపతీ! వైద్యులవారు వచ్చిరెందుకు?” అని చేతులును, బెదవులును వడంక ప్రశ్నించినాడు.

రాజకుమారునికి మత్తు వదలిపోయినను, మధుపాన జనిత నిస్సారము వీడలేదు. మరల వైద్యుడు నీరసము వదలుటకు దోనెలో నొక కుప్పె నరగదీసి అది తమలపాకున కెత్తి మహారాజ కుమారునకు సేవింపనిచ్చెను. మందు కంఠము దిగిన రాజకుమారునకు గొంచెము సత్తువ వచ్చినట్లయినది. తాను దన యభ్యంతర పానశాలయందు మధువు సేవించిన విషయము స్ఫుటాస్ఫుటముగ గోచరించినది.

రాజకుమారుడు:ఏమి జరిగినది మహాసేనాపతీ!

మహాసేనా:తాము రథము నెక్కి వీధుల వెంట స్వారీచేయ నారంభించినారు.

రాజవైద్యుడు:తామే స్వయముగ గుఱ్ఱముల దోలినారు.

రాజకుమారుడు:అది నా కేమియును దెలియదు.

మహాసేనా:గుఱ్ఱము లవశములై పరుగిడసాగెను.

రాజకుమారుడు:అయ్యయ్యో! ఎంత తెలివితక్కువ పని! మహారాజు పరమ శివారాధన సేయుచుండ నాబుద్ధి పెడదారినిబట్టి మధువు సేవించితిని. జైత్రోత్సవముల దప్ప నెన్నడును నట్టిపని చేసి యెరుగను. మహాసేనాపతీ! నా మూర్ఖత వలన నెవరికయిన బ్రమాదము వాటిల్లలేదుగదా?

మహాసేనా: ప్రమాదమే సంభవించినది ప్రభూ!

రాజకు: ఆ! ఏమిటా ప్రమాదము|| ఎలాటిదా ప్రమాదము!

మహాదండ:ఒక యావుదూడ తమ రథము క్రిందబడి మరణించినది.

రాజకు:అయ్యయ్యో! ఎంతదోష మెంతదోషము!

రాజవై:ప్రభువులు కొంచెము శాంతింతురు గాక. తాము ధర్మనిర్వహణము సేయు సమయ మాసన్నమైనది.

రాజకు:నేనేమి ప్రాయశ్చిత్తము చేసికొన్న, ఆ దోషము శాంతించును? నేను పశువుకన్న నీచుడనైతిని. క్రూరమృగము లాహారమునకై ఇతర జంతువుల దినును. నేను రాక్షసుడనై నిష్కారణముగ గోవధ చేసినాను.

అడవి బాపిరాజు రచనలు - 6

240

అంశుమతి (చారిత్రాత్మక నవల)