పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహారా జాశ్చర్యమును సంభ్రమమును నందినాడు. ఇంతలో నాతని మోము గంభీరత దాల్చేను. “ఇదియే ధర్మసభ! ఇచ్చట ధర్మము సంస్థాపింపం బడుగాక” యని మహారాజనెను.

“ధర్మమేవ జయతు, ధర్మమేవ జయతు” అని ప్రక్కనున్న పండితులు, దీప్తకంఠములతో పలికినారు. “ధర్మసంస్థాపనాదీక్షిత శ్రీవిష్ణుకుండిన మాధవవర్మ సార్వభౌమా! జయతు జయతు!” అని సభ్యులందరు జయవాక్యములు నినదించిరి. ప్రాడ్వివాకులు ముందునకు వచ్చి సాక్ష్యవిచారణ ప్రారంభించిరి. ఒక యర్థ ఘటికలో విచారణ పూర్తి యయినది.

యువరాజు దేవవర్మ,"దోషి” యని నిర్ధారింపబడినది. మహాప్రభువు ధర్మజ్ఞులయిన పండితులవైవు చూచినాడు.

“యువరాజు దేవవర్మ యొనరించిన యా తప్పిదమునకు మరణమే దండనము. ఈ గోమాత డెక్కలకు వాడి యంచులుగల యుక్కుడెక్కలను తగిలించి శ్రీ యువరాజుల వారిని బరుండబెట్టి, భూమిని బాతిన మేకులకు గట్టి, ఈ గోమాతచే దొక్కించి మరణము నర్పించుటయే వానికి శిక్ష!” యని, పండితులు కరుణముగ మనవి చేసి, 'తాము దయార్ద్రహృదయులు!” యువరాజొనరించిన ఇది మొదటి తప్పిదము. వారికి మహాప్రభువు వేరొకశిక్ష విధించి, ఈ యజమానికి దగు పరిహార మిప్పించుట రాజధర్మమును మించిన పరమధర్మమని మనవి చేయుచున్నాము” అని పండితులు మౌనము వహించిరి.

“మహారాజా! యువ మహారాజును క్షమించుటే పరమ ధర్మమని మేమందరమును దమకు మనవి చేయుచున్నా” మని అక్కడ జేరిన ప్రజ లందరు నేకకంఠమున నరచిరి.

సార్వభౌముడు చలించలేదు. “రేపు ఉదయము విష్ణుకుండిన వంశజుడు, దేవవర్మకు మరణశిక్ష పురబాహ్య స్థలమున విధింపబడును. ఇది మా ఆజ్ఞ! మహాదండ నాయకులు మా విధించిన ఈ శిక్ష దేవవర్మ తల్లిదండ్రుల సమక్షమున నిర్వహింప మేము ఆనతి నిచ్చుచున్నాము” అని గంభీర ధ్వనుల పలికి తలవంచుకొని, వెనుకకు తిరిగి, తిన్నగ నభ్యంతర మందిరములలోనికి వెడలిపోయెను.

విజయవాటికా నగరమంతయు నా వార్త ప్రాకిపోయెను. ప్రజలట్టుడికిపోయిరి.

(5)

దేవవర్మ నడుపుకొని పోయిన యా రథమట్లు వాయువేగమున పరుగిడుచుండ, యువరాజుకు పూర్ణముగ మత్తెక్కి ఆ రథముపైన పడిపోయినాడు. సూతుడశ్వహృదయము నెరిగిన ప్రజ్ఞావంతుడగుటచే, యువరాజొరిగిపోవగనె, ముందున కురికి, యువరాజు చేతులనుండి జారిపోయిన పగ్గముల నందుకొని, తీయని మాటల జెప్పుచు, గుఱ్ఱముల ననునయించుచు, అశ్వశాంతి మంత్రము పఠించి. వాని వీపులపైన దక్షిణ హస్త తలముచే నిమిరినాడు. నురుగులుగ్రక్కుచున్న యాతురగములు రెండును భయముతీరి వేగము తగ్గించి, నెమ్మదించి చివర కాగిపోయినవి.

సూతుడు వానిని పూర్తిగ సేదదీర్చి, వెనుకకు త్రిప్పి రథము కోటలోనికి గొనిపోయెను.

అడవి బాపిరాజు రచనలు - 6

239

అంశుమతి (చారిత్రాత్మక నవల)