పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాసేనా:ప్రభు! ఎన్నడు జరుగని వింతయే మన నాగోవు స్వయముగ వచ్చి ధర్మరజ్జువును లాగినది.

రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను. “నేనెట్టి దండమునకైనను బాత్రుడను. నన్ను మహారాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది.

మహదండ:ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. తమకు.....

రాజకు:ఆ! జరిగినదా! శుభము. శిక్షనందుకొనుటకు త్వరపడుచున్నాను.

రాజవై:శాంతింపుడు ప్రభూ! తమకు నిర్ణయింపబడిన శిక్ష యుదయమే నిర్వహింపబడును. సర్వప్రజాసమక్షమున, తన సుతుని గోల్పోయిన యా గోవే తమకు శిక్ష విధించును.

మహాదం: గోసమక్షమున దాము నేర మొనరించుటచే మహారాజు, మహారాణులవారి సమక్షమున, నాగోవు తమకు దండన నిర్వహించును.

రాజకు:అయ్యయ్యో! నే జేసిన తప్పునకు నాయన గారును, నమ్మగారును గూడ బాధ నొందవలసి వచ్చినదే! దీనికి నివృత్తిలేదు. ఈ పాపమునకు మరణమే దండనము.

మహాసే:మహాప్రభూ! తమకు... తమకు... ఆ..., ఆ దండనమే విధించినారు.

రాజకు:ధన్యోస్మి! ధన్యోస్మి!

ఆ మఱునా డుదయము నగర బాహ్యస్థలమున నగర వాసులును పరిసర గ్రామవాసులును వేన - వేలు చేరిరి. అనేకులు రాజభటులు విచ్చుగత్తులతో గావలి కాయుచుండిరి. ఇంతలో రాజకుమారుని దోడ్కొని రథముపై మహాసేనాపతియు, మహా దండనాయకుడును, ధర్మాధికారులును వచ్చినారు. ఒకవైపున గోవును, యజమానియు, సాక్ష్యములిచ్చిన వారును గలరు. కింకరులు గొందఱు గోవు డెక్కలకు బదునుగల యంచులున్న యుక్కుడెక్కల దొడుగుచుండిరి. మహారాజు విష్ణుకుండిన మాధవవర్మయు, మహారాణియు రథ మెక్కివచ్చిరి.

మహారాణి వదనమున నెత్తురుచుక్కలేదు. ఆమె కన్నుల నీరు కారిపోవుచుండెను. చక్రవర్తి తన దేవేరిని జేయిపట్టి నడిపించుకొనుచు వధ్యస్థలమునకు జేరినాడు. మహారాణిని జూచి ప్రజల కనుల శోకాశ్రువులు వరదలు కట్టసాగెను. రాజకుమారుడు కనకదుర్గాంబ గుడి మొగమై చేతులు జోడించి “సర్వమంగళ మాంగళ్యే! శివే! సర్వార్థ సాధకే! శరణ్యే! త్య్రంబకే! దేవీ! నారాయణి! నమోస్తుతే!” అని ప్రార్థించుకొన్నాడు.

ఆ గోమాత బెదురుచూపులు చూచుచు దన డెక్కలకు నుక్కుడెక్కల దొడిగించు కొనినది. వేలకొలది జనులక్కడ జేరినను, గాఢనిశబ్దత యా జన సమూహము నావరించినది. రాజకుమారుడు వధ్యస్థలమున బండుకొనినాడు. తలవరులు మహారాజ కుమారుని ద్రాళ్ళతో గట్టిగ గట్టి పెట్టిరి. మాధవవర్మ విష్ణుకుండిన మహారాజు మోముగైలాస శిఖరమువలె స్వచ్చమై, ధర్మకాంతులు ప్రసరించుచుండెను. ఒక్కసారి మహారాజు చేయి నెత్తగానే కొమ్ము లూది, వీరాంగములు మ్రోగించినారు. భటులా ధేనువును రాజకుమారుని

పైకి దోలినారు.

అడవి బాపిరాజు రచనలు - 6

241

అంశుమతి (చారిత్రాత్మక నవల)