పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాక్షసి కూడా 'ఆ స్త్రీలలో వస్తున్నది. తానేదయినా తెలివితక్కువ పనిచేసి ఓడిపోతే ఇంక' ఆడవాళ్ళతో ఓడిపోయాడు కుమార భోజు'డని లోకం అంతా అవహేళన చేస్తుంది. ఒకవేళ నెగ్గినా ఏమివుట్టి మునుగుతుందో? ఏమీచేయకుండా ఊరుకొంటే ఎందుకు ఊరకొన్నావు అని అడగవచ్చు.

పూంగీయ మహారాణి శాంతిశ్రీ కుమారభోజుని గడబిడ నిమిషంలో గ్రహించుకుంది. తన సైన్యాలముందు సప్తవాద్యాలు భోరుకొల్పించి తిన్నగా రాజనగరుకు నడిచింది. పట్టణంలో ఉన్న సైనికులు ప్రజలు ఈ వీరాంగనా సైన్యాన్ని ఆశ్చర్యపూరిత హృదయులయి చూస్తున్నారు. శాంతిశ్రీదేవి, శాంతశ్రీ, ఇక్ష్వాకు శాంతిశ్రీ, బాపిశ్రీ, షష్టిశ్రీ రాజకుమారికలు కూడరా కోటలోనికి ప్రవేశించింది. ఆమెకు కుమారభోజు డెదురయి మోకరించి నమస్కరించినాడు. అక్కడే మదగజాలు దిగి ఆమె ఆ బాలికలతో అంగరక్షణీ జనంతో కుమారభోజుని చూచి “కుమారభోజ సేనాపతీ! మీరు ఇంత వరకు శాతవాహన చక్రవర్తులకు రాజభక్తితో సేవ చేసినారు. ఇప్పుడు వారిని కాదని ఈ మహా దక్షిణాపథాన్ని ముక్కలు ముక్కలు చేసిన వారితో చేరి రాజద్రోహమూ, దేశద్రోహమూ చేస్తారా?” అని ప్రశ్నించింది. కుమార భోజుడు ఆశ్చర్యం పొందినాడు. అతడు ఏమి ప్రత్యుత్తరం ఈయాలో ఆలోచించుకోలేక పోయినాడు.

“కుమారభోజ సేనాపతీ! మాకు భోజులెప్పుడూ స్నేహితులు. వారు ఈ దేశ గౌరవమూ, ధర్మరక్షణా అనేవి మరచిపోయి, ఈ మహారాజ్యాన్ని విచ్ఛిన్నం చేయదలచుకోరు. మీరు మాపక్షం చేరండి. పులమావి ఇచ్చే గౌరవం కన్న మేము ఎక్కువగా మిమ్ము గౌరవిస్తాము. ఇక్ష్వాకుల బాలికలు సౌందర్యవతులు. మా అన్నయ్యగారి నాల్గవదేవి కొమరిత విజ్ఞాశ్రీ రాకుమారిని మీరు వివాహంకండి. మీరు మాలో చేరండి. ఇది నా కోరిక!” అని శాంతిశ్రీదేవి తెలిపినది. కుమారభోజ సేనాపతి యౌవనం మళ్ళీ కౌమారదశ అందుకోబోయే ఇరువది అయిదేళ్ళ ఈడునాడు. యుద్ధజీవనంగా పెట్టుకొని, వివాహం చేసుకోకుండా జీవిస్తున్నాడు. అతని మందిరాలలో విలాసినులు ఇరువురు మువ్వురు ఉన్నారని అందరు ఎరుగరు.

“కుమారభోజ సేనాపతీ! నాకు మీ భావం రెండు ఘడియలలో తెలుపండి. కాదని మాపై కత్తికడతానంటారా మిమ్ము ఇప్పుడే బందీచేస్తాము. ఎదిరిస్తే మీ సైన్యాన్ని నాశనం చేస్తాము” అని గంభీరంగా శాంతిశ్రీ మహారాణి వ్రాక్కుచ్చినది. అ మాటలనడంతోటే ఇరువురు రక్కసులవంటి స్త్రీలు వచ్చి కుమారభోజుని రెండు రెక్కలు పట్టుకున్నారు. మూడవస్తీ వచ్చి ఆయన కత్తిని ఒరనుండి పెరికి శాంతిశ్రీదేవి పాదాలముందు పెట్టింది. సేనాపతి అంగరక్షకులు కన్ను తెరిచి మూసేలోపల ఇరువదిమంది కఱకు స్త్రీలు వారినందరినీ బంధించారు.

పూంగీయ శాంతశ్రీ కత్తిపై నెత్తి నిలిచిన వెంటనే వందిమాగధురాండ్రు తమ కత్తులెత్తి “జయజయ సకల దక్షిణాపథపతీ! శ్రీశ్రీ శాంతిమూల సార్వభౌమా జయజయ” అని అరచినారు. ఆ అరపు గుర్తుగా రెండు విఘడియలలో కోటలో ఉన్న సైనికులందరినీ

అడివి బాపిరాజు రచనలు - 6

• 210 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)