పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ వీరనారీమణులు బంధించారు. కోట బయటనున్న గజ తురగ పదాతిదళాలు నగరంలో గోదావరితీరంనుండి మెట్టవరకూ సంచరించుచు, అక్కడక్కడ ఉన్న సైన్యాలను బందీచేసి నగరం అంతా ఆక్రమించినవి. శాంతిశ్రీ మహారాణి వెంటనే మహాసభకుపోయి రాజప్రతినిధి సింహాసనం అధివసించింది.

(6)

పూంగీయ మహారాణి శాంతిశ్రీదేవి ప్రతిష్ఠానంలో స్థిరనివాసం పెట్టుకుంది. అక్కడనుండి ఇక్ష్వాకు శాంతిమాలుని పేర రాజ్యపాలన ప్రారంభించింది. ఆ చుట్టుప్రక్కలనున్న పర్వత నగరాలు అనేకం ఆమె పట్టుకొని లోబరచుకొన్నది. కొన్ని సైన్యాలతో ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారి నాసిక మహానగరం ఆక్రమించుకొన్నది. ఆమెతో తారానిక యశోదలున్నారు. మరికొన్ని సైన్యాలతో పూంగీయరాకుమారి శాంతిశ్రీయు, బాపిశ్రీయు వాతాపి నగరం పట్టుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు.

ఈ వార్తలు పులమావి వినగానే నిరుత్తరుడయిపోయినాడు. ఇక్ష్వాకు స్త్రీలు మగవీరులా! వీళ్లకు బుద్ది చెప్పకపోతే నగరం తర్వాత నగరం లోబడిపోతున్నది. శాంతిమూలుడు దద్దమ్మయి ఆడవాళ్ళను పంపిస్తున్నాడా? అందుకే కాబోలు వెనక తనమీదకు ఆ పిచ్చిది శాంతిశ్రీ రాకుమారి ఎత్తి వచ్చింది. ఈ ఆలోచనలు మతి పోగొట్టినవి పులమావికి. అతనికి వెఱ్ఱికోపం వచ్చింది. మళ్ళీ జాగ్రత్తగా సిద్ధంచేసిన సైన్యం అంతటిని వెంటనే కదిలించాడు. జయభేరి వేయించి అతివేగంగా వెళ్ళదలచినాడు. ఈ యువతుల నందరిని కలిపి మానభంగం చేయాలనుకున్నాడు. కళ్ళలో ఎరుపుకాంతులు వేసవి సూర్యమండలాలులా వెలుగుతున్నవి. మహాఝరులవల్ల సముద్రకల్లోలాలులా కనుబొమలు ముడులు పడిపోయినాయి.

నూతనాయుధాలు, నూతనయుద్ధవిధానాలు సమకూర్చుకున్నాడు. తానే సర్వసేనాధ్యక్షుడు. మహావేగంతో పులమావి కొండలుగడచి, నదులుదాటి, అడవులు సమంచేసి, మూడులక్షల మహాసైన్యంతో ఉప్పెన పొంగినట్లు, దావానలం విజృంభించినట్లు నాసికపై విరుచుకు పడినాడు. నాసిక వింధ్యపర్వత బాహువైన సహ్యపర్వతాలలో ఉంది. ఆ కొండలోయలన్నిటికడ దిట్టరులైన సైనికుల నుంచాడు. ఆ సైన్యాలన్నీ ఒకలక్ష బలగం, తాను నాసికను ముట్టడించింది ఒకలక్ష సైన్యంతో.

శాంతిశ్రీరాకుమారి పులమావి వస్తున్నాడని వినగానే చిరునవ్వు నవ్వుకొన్నది. ఆమెకు భయం కలుగులేదు. ఆమెలోని శిశుత్వం మాయమయింది. ఏదో ఆనందం పొడమినది. ఒక పౌరుని పిలిచి "స్వామీ! మీరు మా రాయబారిగా పులమావి దగ్గరకు పొండి. అహింస పరమవ్రతం మా కని అతనికి నా మాటగా తెల్పండి. 'హింసనే ఆరాధిస్తూ రాక్షసుడు కాదలచుకున్న తన్ను మా ధర్మమే నాశనం చేస్తుంది అని చెప్పండి” అని పంపినది.

అతడు “ఇదేమి రాయబారమురా' అనుకొనుచు తిన్నగా పులమావి దగ్గరకుపోయి రాయబారమంతా విన్నవించాడు. వెనుక పులమావి ఓడినపుడు ఇటువంటి రాయబారమే.

అడివి బాపిరాజు రచనలు - 6

• 211 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)