పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దలు ప్రేమలూ గీమలూ నమ్మరు. నాగరికులయిన చిన్నలు ప్రేమే వివాహానికి గట్టిపునాది అంటారు. నాగదత్తుడు ఈ విషయం పెద్దలతో అంతగా వాదించ దలచుకోలేదుగాని చెల్లెలినీ వినయనాగునీ యాదాలాభంగా కలుసుకొనేటట్లు చేసి చెల్లెలి హృదయం ఏలా ఉంటుందో కనుక్కోదలచు కొన్నాడు. నాగదత్తుడూ, వినయనాగుడూ రెండెడ్లబండి ఎక్కి సాలగ్రామం వచ్చినారు. వినయనాగుడు సంక్రాంతి పండుగకు సాలగ్రామంలో నాగదత్తుని ఇంటనే విందులు ఆరగించుటకు వచ్చాడు. వినయనాగుణ్ణి చూచినకొద్దీ నాగదత్తునికి ఆనందము ఇనుమడిస్తూ ఉంది. ఆంధ్ర ప్రాకృతంలో బాగా చదువుకున్న ఆ బాలునికి ప్రకృతే గురుపీఠం వహించింది. తెలుసుకోవాలని ఉండాలి గాని, లేకపోతే బృహస్పతి పూనుకున్నా చదువు గోరుతం దూరంలోనే ఉండి పోతుంది జిజ్ఞాసకలవానికి ప్రతిరాయీ, ప్రతి ముళ్ళపొద చదువు చెప్పే గ్రంథంగా ప్రత్యక్షమవుతుంది.

వినయనాగుడు ఆలోచనాపరుడు. ఎప్పుడూ ప్రతి విషయాన్నిగూర్చి ఏదో తర్కించు కొంటూనే ఉంటాడు. కనుకనే గురువులయిన భిక్కులు అతని విద్యాపారంగతునిగా ఒనర్చి వదిలారు. ఈ విషయాలన్నీ నాగదత్తుడు గ్రహించాడు. తాను నాగరుడూ, గడుసరీ అయినా వినయనాగునితో జ్ఞానం విషయంలో వెనుకంజే!

వినయనాగుడు కొంచెం సిగ్గుపడ్డాడు మొదట. మౌనంగా కూర్చుండేవాడు. సంక్రాంతి పండుగనాడు భోజనాలయి కూర్చున్నారు. తాంబూలాలు వేసుకుంటున్నారు మగవాళ్ళంతా. సావడిలో దక్షిణభాగం కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఆ భాగం అంతా చక్కని రత్నకంబళ్లు పరిచి ఉన్నాయి. గోడల పొడుగునా కృష్ణాముఖద్వార బృహత్పలాయన రాష్ట్రపు రంగులబొమ్మల దుప్పట్లు వేసి కుట్టినవి ఉన్నాయి. మధ్య, తాంబూలరజిత కరండాలు, లక్కపళ్ళేలు ఉన్నవి. పల్లవభోగాన్నుంచి వచ్చిన వెన్నలాంటి రాతిసున్నపు డబ్బీలు ఉన్నవి.

అందరు తాంబూలాలు వేసుకున్నారు. ఇంకా ఆకులు కావాలేమోనని నాగదత్తుడు చెల్లెలు యశోదను ఇంకా మరి రెండు నాగులేటి తమలపాకు బొత్తులు తెమ్మని పిలిచాడు. యశోదా తారానికలు భోజనానికి పోబోతున్నారు. అన్నగారి మాటలు విని, యశోద ఏమీ ఆలోచించుకోకుండానే తమలపాకుల కట్టలు రెండు పట్టుకువచ్చి అక్కడ పళ్ళెంలో పెట్టింది. ఆమె వినయనాగుని, వినయనాగుడు ఆమెను ఒక్క క్షణికం చూచుకున్నారు. యశోదకు మోము లజ్జారుణితమైపోయింది. వినయనాగుని మోము ఎరుపెక్కింది మొదటిచూపులోనే వారిరువురకూ ప్రణయజ్వరం ఆవహించలేదు. కాని వారిరువురూ ఒకరినొకరు ఏదో గౌరవంతో చూచుకొన్నారు.

యశోదతో నాగదత్తుడు వినయనాగుణ్ణి పొగడుతూ మాట్లాడాడు. అది యశోదకు ఓ విధంగా నచ్చినది. ఎంత రాచనగళ్ళలో నివసించనా హృదయంలో యశోద పల్లెటూరి పిల్ల! సంక్రాంతి రోజులలో బంతిపూలు పొలం నుండి పుణుకుకొని వచ్చి తలలో తురుముకొనుట ఆ బాలికకు ఇష్టము. చెరువులలో నీలి కలవలంటే ప్రాణం యశోదకు. అడవి మొల్లలు, తంగేటిపూవులు, జపాకుసుమాలు, మొగలిపూలు తానూ పొదలలోనికి ఎగబడి తీసుకొని అలంకరించుకొనేది చిన్నతనంలో. ఆ నీలికలువలు గుబాళించినవి

అడివి బాపిరాజు రచనలు - 6

195

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)