పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాంతిశ్రీకి ఏదో ఆనందం వచ్చింది. “యశోదా! ఏమిటీ వార్తలు? తారా! మీ నాయనగారు క్షేమమా?” అని వారిరువురను ప్రశ్నించింది. తారానికా, యశోదా మంచి అందాలు సేకరించుకొన్నారు. వారి మోములలో ప్రజ్ఞాకాంతులు ద్విగుణీకృతం పొందినాయి. ఆ యిరువురతో ముచ్చటలాడుచు కాలక్షేపంచేయడం శాంతిశ్రీకి అలవాటయిపోయింది.

(5)

విజయనాగుడు సార్థకనాముడు. బుద్ధదేవ సంతతారాధన తత్పరుడు. ప్రతిసంవత్సరమూ నాగార్జున సంఘారామము, విజయపుర సంఘారామాలు, ధాన్యకటక, ప్రతీపాలపుర, ఘంటకాశాల సంఘారామాలు, నాగశైల, శైలారామ సంఘారామాలు వెళ్ళి వస్తూంటాడు. తండ్రితో తల్లితో కలసి వారణాశి మృగవన సంఘారామాలు బోధిగయ మొదలయిన క్షేత్రాలు ఒక సంవత్సరము సందర్శించి వచ్చినాడు. జీమూతవాహననాగుడు ధాన్యకటక మహాచైత్యానికొక బుద్ధదేవ విగ్రహం చేయించి అర్పించినాడు.

అతని చుట్టు ఎందరో బౌద్ధులు. ఏధర్శం ఏచ్చినా మొదట పెద్దలలో వస్తుంది. వారిని అనుకరించేవారు సాధారణప్రజలు. ప్రజలు అనుసరించి భక్తితో ఆధర్మంలో పూర్తిగా స్నాతులయ్యేసరికి, పెద్దలలో కొత్తధర్మాలు వస్తూ ఉంటాయి. ఆంధ్రదేశంలో ఉన్నతవంశాల వారిలో మార్పులు వస్తున్నాయి. బౌద్దారాధన తత్పరతపోయి మళ్ళీ ఆర్షధర్మంలేచి హృదయ పీఠాలు అలంకరించింది. కాని ప్రజలలో బుద్ధారాధన ఇంకా చలింపలేదు. ప్రతిగ్రామం మధ్యా చిన్న చిన్న బుద్ధచైత్యాలున్నాయి. పెద్దగ్రామాలలో పెద్ద చైత్యాలు చిన్న సంఘారామాలు ఏర్పాటై ఉన్నాయి.

శాంతిమూలుని కాలంనాటికి ధాన్యకటకంలో మహాసంఘారామంలో ఇతర సంఘారామాలలో పదివేలకుపైన భిక్కులున్నారు. ఈ భిక్కులు దేశాలు తిరుగుతూంటారు. ఎందరో భిక్కువేషం మాత్రంవేసి సంసార సుఖాలు అనుభవిస్తున్నారు పతితులైన ఈలాంటి భిక్కుల జీవితాలవల్ల బౌద్ధధర్మం అంటే యువకులలో నిరసన బయలుదేరి వారు పెద్దలను ఆక్షేపింప నారంభించారు. నాగదత్తు డాలాంటి యువకులలో ఒకడు. అతడు పట్టణవాసి, చదువుకున్నాడు. “ఏమిటీ భిక్కుధర్మం! కాషాయవస్త్రాలు కట్టితే కామం పోతుందటయ్యా బావగారూ?” అని సంక్రాంతి పండుగకు ఇంటికి చెల్లెలితో చేరిన నాగదత్తుడు కృష్ణాతీరమైన వినయనాగుని రాళ్ళరేవుగ్రామం వెళ్ళినప్పుడన్నాడు. వినయనాగుని తన ఇంటికి తీసుకొని పోయి తన అందాల చెల్లెలిని చూపించాలని అతని తలపు. వినయనాగుడు అందమయినవాడే. అతని చదువు పల్లెటూరి చదువు; ఛాందసుడు, బౌద్ధధర్మం అంటే ప్రాణం ఇస్తాడు. ఇవన్నీ చూచి యశోద ఏమనుకుంటుందో అని అతని భయం. అయినా యశోద చిన్నతనాన్నుంచీ బందుగులయిన ఈ రెండు కుటుంబాలూ వియ్యమొంద పెద్దలు జీమూతవాహన నాగుడూ నాగదత్తుని తండ్రి నిశ్చయించుకొన్నారు. అయినా నాగదత్తుని వల్లనే వివాహమహోత్సవం ఆగింది. యశోద విజయపురం రాజకుమారి చెలికత్తెగా వెళ్ళింది.

అడివి బాపిరాజు రచనలు - 6

194

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)