పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేడు.... వినయనాగుని చూపులలో అతని స్నిగ్ధసౌందర్యంలో కృష్ణా జలాలలోతు యశోద హృదయంలో ప్రతిఫలించింది.

(6)

వినయనాగుడు పండుగ అనంతరం తాను వెళ్ళిపోవ సంసిద్ధుడైనాడు. కాని నాగదత్తుడూ, అతని తండ్రీ కదలడానికి వీలులేదని పట్టుబట్టారు. తారానిక వినయనాగుని “అన్నగారూ! మీరు ఇంకా నాలుగు రోజులపాటు ఇక్కడ ఉండండి. నా ఉద్యోగం ఇక్ష్వాకు రాజకుమారికడ. వారంతా ధాన్యకటకంలో ఉన్నారు. అయినా వారి అనుమతిమీద మేము ఇంతదూరం వచ్చాము, అని ప్రార్ధించింది” వినయనాగుడు మెత్తబడినాడు.

ఆమె హృదయాంతరంలో ఒక ఆలోచన ఉంది. ఇంతవరకూ యశోదా వినయులు విడిగా కలుసుకోలేదు. వారిని మాయచేసి ఒకచోట కలపాలి. అప్పుడు ఇద్దరూ. ఒకరిమీద ఒకరికి ఉద్భవించి పెరుగుతూన్న ప్రేమను వ్యక్తం చేసుకునేటట్లు చేయాలని నిశ్చయించు కొన్నది. తనకూ నాగదత్తునికీ వివాహం కావడానికి ఎన్ని ప్రతిబంధకాలు వచ్చాయి? ముఖ్యమైంది రాజకుమారీ బ్రహ్మదత్తుల అనుజ్ఞ కావలసి ఉన్నది. ఉన్న పరిస్థితులపై తానుగాని, తన ప్రియుడుగాని రాజకుమారినీ, ధనకప్రభువునూ అనుజ్ఞలు వేయడానికి వీలులేకపోతున్నది. తారానిక రాజకుమారికడ ఉన్నప్పుడు నాగదత్తుడు ఆమెను కలుసుకొన కూడదు. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ నాగదత్తుడు కలుసుకొనవచ్చును.

విజయపురంలో ఉన్నప్పుడు నెలకు ఒకసారి మాత్రము తండ్రిగారి ఇంటికిపోయి చూడవచ్చును. కృష్ణచతుర్దశి, అమావాస్య, శుక్లపాడ్యమి, శుక్ల చతుర్దశి, పూర్ణిమ, కృష్ణపాడ్యమి-ఈ దినములు వారికి పని విడుపు. తారానికా యశోదలు పూర్ణిమ దినాలు మూడూ ఉపయోగించు కొనేవారు. ఆ మూడు దినాలు నాగదత్తుడు తారానిక యింటివద్దకు వచ్చేవాడు. ఆ మూడుదినాలు వారు మువ్వురు తోటలలోనికిపోయి వంటలు చేసుకొని, భుజించి, కృష్ణానదిలో విహారానికిపోయి, వర్షం కురుస్తూ ఉంటే ఇంటికడనే కూర్చుండి చదరంగమాడుకొని, పాటలు పాడుకొని ఉప్పొంగిపోయేవారు. నాగదత్తుడు రసికుడు, తారానిక ఆనందపూర్ణ, వారిరువురకు ప్రణయశ్రుతి యశోద, నాగదత్తుడు -

“వన్నె చిన్నె పిన్నదాన చిన్నారి వయసుదాన

నన్ను చూచినవ్వవే పొన్నపూల సొబగుదాన

మల్లె మొగ్గ పన్ను దాన

నల్లకల్వ కనులదాన

మేలమాడి పోవకేవన్నె చిన్నె

చుక్కమినుకు ఒడలిదాన

అక్కున ఒదుగురూపుదాన

మక్కువలనుచూపవే జిక్కవలజంటదాన”వన్నె చిన్నె

అని పాడినాడు. ఆమె తిప్పుకుంటూ నడచి వచ్చి,

అడివి బాపిరాజు రచనలు - 6

196

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)