పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాంతిమూలుడు కన్నీరు తుడుచుకొని విషాదవదనంతో బ్రహ్మదత్తుని చూచి “దుఃఖంకాక ఏముంది ధనక ప్రభూ! మాతండ్రి తాతలు శాతవాహన వంశాన్ని తరతరాలుగా సేవచేస్తూ ఉండిరి. మా మూల పురుషుడు కోసల దేశం పద్మనందులపాలి బడినప్పుడు దక్షిణకోసలం చేరుకున్నాడు. అక్కడ నుండి శ్రీకాకుళంచేరి అచట శాతవాహనుల కొలువులో చేరాడు. ఆనాటి నుంచి శాతవాహనులు మాకు గురుతుల్యులయ్యారు. వారి కొలువులో రాజ్యాలు స్థాపించాము. ఆంధ్రసామ్రాజ్యం విస్తరింప చేశాము. శ్రీముఖ సార్యభౌముని సైన్యాధ్యక్షుడై మా పూర్వీకుడొకడు నందుల పాటలీపుత్రాన్ని విచ్ఛిన్నంచేసి, శ్రీ ముఖునికి కుడిచేయి అయి ఆయన్ను సకల భారతానికీ చక్రవర్తిని చేసెను. ఈనాటితో ధారావాహికంగా వచ్చిన శాతవాహన మహావంశము అస్తమించి పోయినది. మా చిరబాంధవ్యం నేటితో తీరిపోయింది. ఇందరం ఉండి చక్రవర్తిని రక్షించుకోలేకపోయాము. శాతవాహనులకు వజ్రకవచమైన ఇక్ష్వాకు వంశం నా మూలాన అసమర్ధమై పోయింది” అని అస్పష్టవాక్కులతో అన్నాడు.

ఈ మాటలన్నీ వింటూ ఆ ధనకప్రభువు శాంతిమూలునికి నమస్కరిస్తూ, “మహాప్రభూ! ఈ యపరాధం మా అందరిదీని. విధివిలాసం ఇలా ఉంది. గతాన్ని విస్మరించండి. ముందు చేయవలసినది ఆలోచించండి. ఇది పులమావి పన్నినమాయ. వెంటనే అతనిని శిక్షించవలసి ఉంది” అని తెలిపినాడు.

“శిక్షిస్తే లాభం ఉందా ధనకప్రభూ! అంతరించిన శాతవాహన వంశాన్ని ఏలా పునరుద్దరించగలం..... చివరకు పులమావినే మనం చక్రవర్తిగా అంగీకరించుదామా అని ఊహ కలుగుతూంది.”

“హంతకుడైన పులమావిని చక్రవర్తిగా ఎట్లా చేయగలము?”

“అవును ధనక ప్రభూ! మరి శాతవాహన వంశాన్ని పునరుద్దరించే మార్గమో?”

ఇంతలో ఆస్థానవైద్యుడు అక్కడకు వచ్చి శాంతిమూలునికి నమస్కరించి “మహాప్రభూ! నాగదత్తునికి మెలకువ వచ్చింది మహాప్రభువుల దర్శనము, ధనక ప్రభువుల దర్శనము కోరుతున్నాడు” అని మనవిచేసినాడు. మహారాజును, బ్రహ్మదత్తప్రభువులేచి నాగదత్తుని పరుండబెట్టిన గదిలోనికి పోయినారు. నాగదత్తుడు యుద్ధం ఆగిపోగానే, ఒంటినిండా తగిలిన గాయాలచే, రథంమీదనే విరుచుకుపడిపోయినాడు.

అంధకివైద్యులు జగత్ప్రసిద్ధి నందినవారు. వారి చికిత్సాపద్దతి ఆశ్చర్య కరమైనది. శల్యవైద్యమున వారు సిద్దహస్తులు. శాంతమూలుడు సత్రశాలలో నెలకొల్పిన వైద్యశాలలన్నీ ఈ రాజవైద్యుని అధికారంలో నడచుచుండెను. ఆయన వైద్యమువల్ల నాగదత్తుడు రెండుఘటికలలో తేరుకున్నాడు.

నాగదత్తుడు నీరసంగా ఉన్నాడు. అతని ఒంటినిండా కట్టుకట్టి ఉన్నాయి. శాంతిమూల మహారాజుకూ బ్రహ్మదత్తునికీ నమస్కారం చేసినాడు నాగదత్తుడు.

శాంతి : ఏమి నాగదత్తా! ఏలా ఉన్నది?

నాగ : మహాప్రభూ! చక్రవర్తిని రక్షింపలేని వాని క్షేమంతో ఏమి పని?

శాంతి: ఎవరు ఏమి చేయగలరు? నీవు నీ ధర్మము మహాభక్తితో నిర్వహించావు. నీలోటు ఏమీలేదు.

అడివి బాపిరాజు రచనలు - 6

185

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)