పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుడిచేత పొడుగాటి భల్లం తీసి, రథముకడకు వచ్చే విరోధినెల్ల ఒక్కొక్కపోటుకు కూలుస్తున్నాడు. తోటి అంగరక్షకులు రథంమీదికురికి చక్రవర్తిని రక్షించుకొంటున్నారు.

కాని శత్రువుల దండు దొంగచాటుగా మీదపడి తాకిందిగనుక మహారాజ రక్షకులు కొంతదారి ఈయవలసి వచ్చింది. అందుకనే ముప్పదిమంది శత్రువీరులు రథంమీదకు రాగలిగారు. అంగరక్షకులు నూరుగురే ఉన్నారు. అయినా వారిలో ఒక్కొక్కడు పదిమంది మహావీరులను హతమార్చగల మేటి. కాబట్టి నాగదత్తుడు, అతనితోబాటు ఇంకో అయిదుగురూ శుత్రువులలో పదిమందిని హతమార్చారు. రథంమీద ఉన్న ఈ అయిదుగురు అంగరక్షకులకు చంద్రశ్రీ శాతవాహన చక్రవర్తి కత్తితీసి తోడయినాడు. అన్ని వైపులా జాగ్రత్తగా చూస్తూలోనికి ఎక్కబోయే వీరుణ్ణి తల నరుకు తున్నాడు. లోపలికి వేగంతో వచ్చే బాణాలకు ఫలకం అడ్డుపెట్టుతున్నాడు. గుఱ్ఱాలను పేరుపెట్టి పిలుస్తూ అదలిస్తున్నాడు. ఇంతలో బ్రహ్మదత్తుని సైన్యం శంఖాలు పూరిస్తూ ఆ సంకుల సమరభూమికి నలుముఖాల నుండీ వచ్చి క్రమ్మినది.

యుద్ధం చటుక్కున ఆగిపోయింది. కాని ఎక్కడనుండి వచ్చినదో ఒకబాణం చక్రవర్తి కంఠత్రాణమును చీల్చి కంఠములోకి దూసుకుపోయింది. చక్రవర్తి “అయిపోయినది మాపని” అని కేకవేస్తూ నిలువునా ఆ రథం మీదనే కూలిపడిపోయినాడు. ఆ వెంటనే బ్రహ్మదత్తుడు గుఱ్ఱముమీద నుంచి రణరంగాన ఉరికినాడు. యుద్ధం గడబిడలో కాగడాలన్నీ ఆరిపోయినవి. ఉన్న పదికాగడాలూ రథం దగ్గరకు వచ్చాయి. చక్రవర్తి నిర్జీవియై రథంమీద పడిపోయి ఉన్నాడు.

విరోధులలో మూడువందలు మృతినందినారు. ఏబదిమందికి దిట్టంగా గాయాయి తగిలినవి. చక్రవర్తి అంగరక్షకులలో ఎనుబదిమంది ప్రాణాలు కోల్పోయినారు. తక్కిన వారిలో పదిమందికి గట్టిగాయాలు తగిలినాయి నాగదత్తుడు రక్తసిక్తాంగుడై ఉన్నాడు. అతడు ఒక్కడూ ఏబదిమందిని హతమార్చినాడు. అతనితో పాటు ఇరువురుమాత్రం సజీవులై ఉన్నారు.

బ్రహ్మదత్తుని సైన్యాలు ఎన్నో దివిటీలను వెలిగించెను. బ్రహ్మదత్తుని వైద్యులు ఆ యజ్ఞనగర మధ్యంలో పడిపోయిన శత్రుపక్షం వీరులకు తమ వారికీ గూడ వైద్యం చేయసాగించిరి.

(11)

చక్రవర్తి మరణించాడని తెలియగానే శాంతిమూలుడు విహ్వల చిత్తంతో పామరునివలె నచ్చటికి పరుగిడినాడు. వైద్యశాలలో తల్పగతమై యున్న చక్రవర్తి శరీరాన్ని తన హృదయానికి పొదివికొని కన్నుల నీరు కారిపోవగా శాంతమూలుడు "మహాప్రభూ! సకలభారతానికీ చక్రవర్తి! ఆస్తమించినావా?” అంటూ వాపోయినాడు. ఆ దుఃఖము శాంతిమూలుని నిలువున కదల్చివేసింది. బ్రహ్మదత్తుడు ఆ తల్పందాపునే మోకరించి ఉన్నాడు. శాంతమూలుని దుఃఖం గమనించి బ్రహ్మదత్తుడు లేచినాడు. “మహప్రభూ! అవబృధస్నాతులై పవిత్రులైన మీరు పామరునిలా దుఃఖించడం ఉచితం కాదు.”

అడివి బాపిరాజు రచనలు - 6

184

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)