పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగ: మహారాజా! చక్రవర్తిని రథం దిగవలదని ఎంతో బ్రతిమాలినాను. కాని ఆ మహాప్రభువు డాలూ కత్తీ తీసుకుని సలిపినయద్ధ మప్రతిమానం. వారు ఇరువదిమందిని హతమార్చినారు. ఆ యుద్ధంలో వారు పడిపోలేదు మహాప్రభూ! ఎక్కడనుంచో వచ్చిన దొంగపోటు వారి ప్రాణం చూరకొన్నది.

బ్రహ్మ: ఆ బాణము రాగితో చేయబడింది, చిన్నది. ఒక చిన్న ధనస్సుతో దగ్గిరనుండి అతిజాగ్రత్తగా ఆలోచించి వేసిన బాణమది. ఆ దుర్మార్గుని పట్టుకొన్నాము. కోపవివశుడనై, వాణ్ణి నూరుఖండాలుగా నరికి వేసినాను మహారాజా! ఈ తొందరపాటుకు క్షంతవ్యుడను.

నాగ: మహాప్రభూ! సార్వభౌములు పడిపోగానే నేను వారికడకు ఉరికి వారి తలను నాతొడపై పెట్టుకొన్నాను. వారు కళ్లుతెరిచి చిరునవ్వుతో నన్ను చూచి “ఏమయ్యా నాగదత్తా! ఇప్పటికి నేను మనుష్యుణ్ణి. నాజన్మ తరించింది...... ఈ పుణ్యయజ్ఞవాటిలో నా ప్రాణం ఆహుతియ్యగలుగు తున్నాను. మా వంశం నాతోసరి. పాపం మాళవిక దుఃఖం ఎవ్వరు తీరుస్తారు? మా మామయ్యగారిని ఈ సామ్రాజ్యానికి మేము మా తరువాత చక్రవర్తిగా నిర్ణయిస్తున్నాము. ఇది మా ఆజ్ఞ అని చెప్పినారు మహాప్రభూ! చిరునవ్వు నవ్వుతూనే మామయ్యగారికి నమస్కారాలు, మా గురువులకు నమస్కరాలు అని చెప్పు అని ప్రాణాలు వదిలినారు మహాప్రభూ!” శాంతిమూలునికి మళ్ళీ కళ్ళనీరు తిరిగినది. ఆయన తలవాల్చుకొని తూలుతూ గదివీడి వెళ్ళిపోయినాడు.

(12)

"అస్తమించెను శాతవాహన పవిత్ర
 రాజవంశము, ధాన్యపుర మహదాంధ్ర
 వైభవము కృష్ణవేణ్ణా ప్రవాహమందు
 మునిగిపోయె, భరతలక్ష్మి మోముమాసె

అనే విషాదగీతము ఆ వైద్యశాలా ప్రాంగణంలో భట్టొకడు పాడినాడు.

మాళవికాదేవి చక్రవర్తి కళేబరముచెంత ఒళ్ళు తెలియని మూర్ఛలో పడి ఉంది. లేచినా జ్ఞానములేనిచూపు ఆమె మనస్తూ ఆత్మా ఈ లోకంలో లేవు. భోజనానికి లేవదు. స్నానం చేయదు, మాటలేదు. శాంతిమూల మహారాజు నడుముకట్టుకొని సార్వభౌముని కళేబరమున్న మహాశాలా ద్వారంలో కావలి ఉన్నారు. వారికి మూడుదినాలనుండి భోజనంలేదు. చక్రవర్తి శరీరాన్ని మహావైద్యులు ఓషధీయుక్త తైలాలతో తడిపి సార్వభౌమాలంకారాలతో ఉంచినారు. మూడుదినాలు మహాసామంతుడు, సామంతులు, రాష్ట్రపతులు, మహాసేనాపతులు, సేనాపతులు, మహామంత్రులు, సచివులు, చూట్టాలు, వర్తకచక్రవర్తులు, పండితోత్తములు, అర్హతులు, ఆచార్యులు, భిక్కులు వేలకొలదిమంది వచ్చి చూచిపోతున్నారు. వందులుతలలు వంచి ఆ మహాశాల కెదురుగా ముప్పొద్ధులా విషాదగాధలు పాడుతున్నారు.

అడివి బాపిరాజు రచనలు - 6

186

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)