పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేయకండయ్యా అని శాంతిమూల మహారాజును ఒప్పించి ఉందును” అని ప్రాధేయ పూర్వకంగా అన్నాడు. “అయినా నేను సార్వభౌమ సింహాసనం ఎక్కడానికి ముఖ్యకారణం నువ్వు!” అని తలవాల్చుకున్నాడు. మాళవిక భర్త రెండు చేతులు పుచ్చుకుని లేవదీసి, “క్షమించండి మహాప్రభూ! మనం ఇద్దరం భగవంతుని చేతిలో ఆటబొమ్మలు” అన్నది.

మాళవికకు ఏదో భయం ఎక్కువైనది. చక్రవర్తి భోజనమును పరీక్షకుడు పరీక్షించిన వెనుక తానుగూడ పరీక్షించడం సాగించింది. రాత్రిళ్ళు కోడికునుకుపోతూ భర్తను పదిసార్లు కనిపెడుతూ ఉంది. ఆంతఃపురందాటి భర్తను ఎక్కడికీ వెళ్ళవద్దంటుంది. సాయుధుడైన బ్రహ్మదత్తునితో తక్క చక్రవర్తిని ఎక్కడికీ వెళ్ళనీయదు. ఇతర రాణులెవరన్నా అనుమానమే. తారానిక యశోదనాగనికలు ఆమెకు కుడిచేయి, ఎడమచేయి అయినారు. నాగదత్తుడు, అతని మిత్రులు నలుగురు ఆ మందిరములకు దారి ఇచ్చే బాహ్యమందిరములో ఇరువురి తరువాత ఇరువురుగా సర్వకాలముల కావలికాస్తూ ఉండవలసిందే. శాతవాహ నాంతఃపురాలలో ఇటువంటి జాగ్రత్త లెప్పుడూ ఎవరూ పడవలసిన అవసరం లేకపోయింది. మహాపద్మనంద, మౌర్యకాణ్వాయనాదుల అంతఃపురాలలో ఇంతకు పదిరెట్లు జాగ్రత్తలు పడేవారట. రాణులందరకు మాళవిక మీద కోపం ఎక్కువై పోయింది. వాసిష్టియను పెద్దరాణి, తక్కిన రాణులు శాంతిమూలమహారాజుకడకు తమ ఆంతరంగిక పరిచారికలను రాయబారం పంపారు.

“చక్రవర్తి కడకు ఏ రాణి వేళ్ళడానికి వీల్లేకుండా ఉన్నది. ప్రాణనాథుని ప్రాణాలు కాపాడే బాధ్యత ఒక్క మాళవికదేనా? మాకులేదా? ఈ దుర్భర స్థితి ఎంతకాలం భరిస్తాము? మహారాజా! మీరు మాకు ఏడుగడ. చక్రవర్తికి హానిచేసి మా ఒడిలో ఐశ్వర్యాలు మూటకట్టుకోము. తమకు మేమంతా విశ్వాస్యలము తమ నిర్ణయానికి మేమంతా బద్దురాండ్రము” అని రాయబారం శాంతిమూల మహారాజు కడకు చేరింది.

శాంతిమూల మహారాజు ఆ వృద్దపరిచారికలను చూచి “చవ్రర్తికి తక్కిన మహారాణులతో అవసరంలేదట, మాళవికాదేవి తమకు సన్నిహితయట. ఈ విషయం అంతా చక్రవర్తితో మాట్లాడి మాహారాణులకు మళ్ళీవార్త పంపుతానని మనవి చేయండి. ఇంక వెళ్లవచ్చును” అని తెలిపినారు. అంతఃపురంలోనే చక్రవర్తి కత్తిసాము మున్నగునవి నేర్చుకుంటున్నారు బ్రహ్మదత్తునితో.

ఒకదినం చక్రవర్తి తన మందిరాలకడనున్న వనంలో బ్రహ్మదత్తుని శుశ్రూషలో విలువిద్య నేర్చుకుంటున్నారు.

చక్రవర్తి: ప్రభూ! మీకు రాని విద్య ఉన్నదా?

బ్రహ్మ: నిజానికి నాకే విద్య రాదు మహాప్రభూ!

“అన్ని విద్యలూ మీకు అద్భుతంగా వచ్చును.”

“విద్యయొక్క అవధి భగవంతుడు. మనశక్తి ఈలోకాన్ని దాటి వెళ్ళలేదు. అలాంటిది విద్యలు వచ్చినవి అనుకోవడం వట్టి మూర్ఖత మహాప్రభూ!”

“అయితే విద్య నేర్చుకోవడమే మానెయ్యాలి. ఏ విద్యా పూర్తి కాకపోతే ఎందుకు చెప్పండి?”

అడివి బాపిరాజు రచనలు - 6

181

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)