పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రశ్రీకి ఒక్కొక్కప్పుడు కోపం వచ్చేది. ఒకసారి విసుగు జనించేది. అయినా ఓపికతో బ్రహ్మదత్తుని దేశికత్వాన అన్నీ నేర్చుకుంటున్నాడు. రాత్రి ఒంటిగా మాళవికతో కూడి ఉన్నప్పుడు “దేవీ! మమ్ము ఈ శాంతిమూలుడు, బ్రహ్మదత్తుడూ వేపుకొని తింటున్నారు. నాకీ చక్రవర్తిత్వ మెందుకు, సుఖభోగాలు దూరమయినపుడు? శుష్కమైన జ్ఞానం నాకు నూరిపోస్తే ఏమి లాభం?” అని విచారవదనముతో పలికినాడు.

“మహాప్రభూ! మీరు చక్రవర్తులు. మీకు అన్నీ తెలియకపోతే ఏలాగ?”

“తెలియకపోతే ఇబ్బంది ఏమి? మంత్రులు చూసుకోరూ?”

“అందువల్ల మీరు పేరుకు మాత్రమే చక్రవర్తి అనిపించుకొంటారు.”

“కావలసిందే పేరేకదా?”

“బ్రహ్మదత్త ప్రభువు ఈ జాగర్తలన్నీ ఎందుకు పడుతున్నాడను కొన్నారు?”

“ఛాందసుడు!”

“కాదు మహాప్రభూ! ఆయన తమ ప్రాణంకోసం ఈ జాగ్రత్తలన్నీ చేస్తున్నారు.”

“ఏమి జాగ్రత్తలో! మాతండ్రిగారు బతికి ఉన్నప్పుడు మాతాతగారి కాలంలోనూ నేను ధాన్యకటకం అంతా నిర్భయంగా తిరిగేవాడిని.”

“యువమహారాజత్వం వేరు - చక్రవర్తిత్వం వేరు మహాప్రభూ!”

“చక్రవర్తిత్వం అంటే ఈ బాధలేనన్నమాట ?”

“చక్రవర్తిత్వం అంటే మీ ఇష్టం వచ్చిన స్త్రీలతో మీ ఇష్టం వచ్చిన అమృతాలు సేవిస్తూ ఉండడము కాదు.”

“దేవీ! నువ్వు కూడా నీతిబోధ మొదలు పెట్టుచున్నావు”

“మహాప్రభూ! తమ ధర్మం తమకు....”

చంద్రశ్రీకి కోపం మిన్నుముట్టిపోయింది.

(9)

“అవును మహాప్రభూ! ఏకారణంచేత నైతే నేమి నేను తమ జీవితంలో భాగస్వామిని అయ్యాను. జీవితమంటే వివిధరత్నాలంకరణ, అనేకమంది దాసీలచేత సేవచేయించు కోవడమూ అద్భుతమైనందుకూ వస్త్రాలు లిప్తలిప్తకూ మార్చుకోవడమూ, వలచిన పురుషుని చేతుల్లో సవిలాసంగా తేలిపోవడమూ అనుకున్నాను. ఒక చక్రవర్తి పరిపాలనంవల్ల దేశం శాంతితో సుభిక్షమై ఆనందమనుభవిస్తుందని బ్రహ్మదత్తప్రభువు సెలవిచ్చారు. శాంతికీ, ధర్మాచరణకూ చక్రవర్తి భరతవర్షంలో ఏకైక చిహ్నమన్నాడు. బ్రహ్మదత్తప్రభువు ముక్కలు వింటూంటే మనం చేస్తున్న దేమిటి దైవమా అని దిగులు పట్టుకుంది.”

అందమైన మాళవికచేతులు నమస్కారముద్రలో ఉన్నాయి. ఆమె కన్నులనీరు తిరుగుతున్నది. తలవంచుకని ఆ బాలిక నెమ్మదిగా నడుస్తూలోని అంతఃపురంలోకి పెళ్ళిపోతూంటే చంద్రశ్రీ శాతవాహన సార్వభౌముడు రెండంగల్లో ముందుకురికి, ఆ బాలికను తన కౌగిలిలో పొదివిపట్టుకుని, చటుక్కున ఆమె ఎదుట మోకరించి "దేవీ, దేవీ, క్షమించు. చక్రవర్తిత్వ మంటే ఇంత భయంకరమైనదని తెలిస్తే, నన్ను చక్రవర్తిగా

అడివి బాపిరాజు రచనలు - 6

180

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)