పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“విద్యలు పూర్తిచేయాలని ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో కొంతవరకయినా వెళ్లగలం.... ఆ తర్వాతి విద్య ఆపైజీవితంలో, ఈలా విద్య పూర్తి అయ్యేవరకూ జన్మలు ఎత్తుతూ ఉంటాము.”

“మనకు క్రిందటి జన్మము జ్ఞాపకం ఉండదే. ఇంక ఏ విద్య క్రిందటి జన్మలో ఎంతవరకూ వదిలివేశామో ఎలా జ్ఞాపకం ఉంటుంది స్వామీ ?”

“ఒక నెలదినాల క్రిందట తాము జేసిన పనులు తాము అనుభవించిన అనుభవాలు మనకు జ్ఞాపకం ఉంటాయా మహాప్రభూ!”

“ఆ! నేనో క్రొత్తమధువు త్రాగితేచాలు, అన్నీ జ్ఞాపకమే!”

“తక్కిన వేళల్లో?”

“ససేమిరా, మా మెదడుకు ఏవీ అంటవు; మా మెదడు అటువంటిది. ఒక్కముకైనా జ్ఞాపకం ఉండదు.”

“కొందరు పూర్వజ్ఞానపరులకు క్రిందటి జన్మ బాగా జ్ఞాపకం ఉంటుంది. మనకు జ్ఞప్తి ఉన్నా లేకపోయినా వెనుకటి కర్మ సంబంధం దానిపని అదే చూచుకుంటుంది. నిన్నటి భోజనంలో ఎక్కువతక్కువలు మనకు జ్ఞప్తి లేకున్నా దాని ఫలితం అనుభవానికి వస్తూనే ఉంటుంది.”

“నిన్న మంచి మధుసేవించకపోతే ఈ దినం గొంతుకంతా ఎండి పోయినట్లు ఉంటుంది, ఆమోస్తరంటారు.”

“చిత్తం.”

“అయితే బ్రహ్మదత్తప్రభూ! మేము వెళ్ళి మహాఋషీ నాగార్జునాచార్యులవారిని దర్శనం చేసుకురావాలని ఉంది.”

“చిత్తం! నేను ఏర్పాటు చేస్తాను.”

“ఆయన మూడువందల సంవత్సరాలనుంచీ బ్రతికి ఉన్నాడంటారు నిజమా ప్రభూ?”

“చిత్తం! మాతాతగారెరుగుదురు వారిని. మా ముత్తాతగారు వారూ కలిసి చదువుకున్నారట.”

“ఎవరు చెప్పారు ఆ విషయం?”

“మా తాతగారే!

“మీ తాతగారు ఇప్పుడు బ్రతికి ఉన్నారా?”

“పోయి అయిదేళ్ళు మాత్రం అయింది ప్రభూ!”

“అయితే మీ నాయనగారు వెళ్ళి శ్రీశైలంలో తపస్సు చేస్తున్నారట, ఎందుకని?”

“తపస్సు ఆత్మజ్ఞానంకొరకే”

“అదిగో మళ్ళీ ఆత్మజ్ఞానమని కొత్తగా అంటున్నారు. మీ బోటి వాండ్ల దగ్గర నేర్చుకోవడం ఎందుకొరకయ్యా?”

“జ్ఞానం రెండువిధాలు - ఒకటి లౌకికం, రెండోది పారలౌకికం.”

“మీకీ రెండూ తెలుసునా?”

అడివి బాపిరాజు రచనలు - 6

182

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)