పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“గురుదేవా! ధర్మనిర్ణయం ఎట్లా?” అని యవనికాభ్యంతరం నుండి మధురమైన వాక్కులతో ఒక ప్రశ్న వినబడింది. శిష్యులందరూ చకితులయి ఆ తెరవైపు చూచారు. బ్రహ్మదత్తుడు చిరునవ్వు నవ్వుతూ ముఖం వికసించి కాంతులీనగా “రాకుమారీ! నీ ప్రశ్న ఉత్తమమయినది” అని ప్రతివచనమిచ్చి శిష్యులవైపు తిరిగి “ఏమయ్యా! ఒక నూతన స్వరం వినేసరికి మీరంతా ఆశ్చర్యంతో చూసినారు. అది మీ కర్మయోగంలో లోటు తెలియజేస్తుంది” అని రాకుమారివైపు తిరిగి....

“ధర్మం అంతే స్వధర్మం. పరధర్మం భయావహమయినది. స్వభావ విలసితమైన స్వధర్మం నిర్ణయించేది తాను. దేశకాల పాత్రముల కనుగుణంగా ధర్మాన్ని మలచికొని, నిష్కామంగా ధర్మాచరణం చేయాలి” అని తెలిపినాడు.

“సత్యమనగా ఏది ప్రభూ!”

“సత్యం ఏది అని నిర్ణయించే ముందు, సత్యం అనేది ఏలా మనుష్యులలో ప్రతిఫలించిందో, ఆ ప్రతిఫలం ఏ కార్యరూపంగా పరిణమించిందో గ్రహించి ఆ విధంగా కర్మ ఆచరించవలసి ఉన్నది.”

“ఆ కర్మలు ఏవి గురువుగారూ?”

బ్రహ్మదత్తప్రభువు చిరునవ్వుతో “రాజకుమారీ! అహింసావ్రతము సత్యకర్మ. మాటలలో అసత్యము చెప్పకుండుట, మానవ సేవ సత్యకర్మ!”

“ప్రభూ! యుద్ధము అహింస అవుతుందా ?”

“కాదు.”

“కాకపోతే అర్జునునికి శ్రీకృష్ణభగవానుడు యుద్ధం చేయవలసింది అని ఏలా బోధించారు?”

“చక్కని ప్రశ్న రాకుమారీ! యుద్ధము అహింసకాదు. హింస కాబట్టి అది అసత్యం. కాని ఎవరయితే స్థితప్రజ్ఞుడయి తాను యుద్ధం చేయడం సంపూర్ణంగా స్వధర్మ నిర్వహణం అని యెంచి చేస్తాడో ఆనాడతను అహింసావ్రతం ఆచరిస్తున్నాడన్నమాటే!”

"స్థితప్రజ్ఞత్వం ఏలాగు, అది ఏమిటి?”

"స్థితప్రజ్ఞునికి అరిషడ్వర్గములు నాశనమయి పోవాలి. దేహము వేరు, తాను వేరు అన్న సంపూర్ణజ్ఞానం రావాలి.”

“అంటే భగవంతుడూ తానూ ఒకటే అని తెలిసినవాడన్న మాట?”

“అవునమ్మా. అంటే యుద్ధం అహింసాబుద్ధిచే ఆవరించేవాడు స్థితప్రజ్ఞుడు. శ్రీకృష్ణభగవానులు తదితరులకు యుద్ధం నిషిద్ధమన్నారు. స్వధర్మ నిర్వహణార్థంకాని హింసాస్వరూపమయిన యుద్ధం మనుష్యుని పతితుణ్ణి చేస్తుంది. ఆహారనిద్రాదులలో మనుష్యుడు పశుసమానుడు.... ఆహారనిద్ర భయములలో భయమే యుద్ధస్వరూపము పొందుతుంది” అని బ్రహ్మదత్తుడు కన్నులరమూసినాడు. శాంతిశ్రీ ప్రశ్నకు అతడు పొందిన సంతోషం శారదా పూర్ణిమలా విరిసిపోయినది.

“రాజకుమారీ! శ్రీకృష్ణభగవానుని గీతోపదేశమందలి అహింసా పరమార్థం బుద్ధభగవానుడు బాగా అర్థం చేసుకొన్నాడు కాని ప్రతి మనుష్యుడూ ప్రతిస్త్రీ సన్యాసం పుచ్చుకోవాలనడమే ఆ తథాగతుడు చేసిన తప్పు.”

అడివి బాపిరాజు రచనలు - 6

171

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)