పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాళవికను మహారాజులు, సామంతులు ఉంపుడుకత్తెగా, ఏ ఖడ్గ వివాహానికో కోరినారు. కాని ఆంధ్రవర్తకుడు సముద్రశ్రీ కోటి పణాలిచ్చి ఆ బాలికను కొనివచ్చి చక్రవర్తికి రెండవ భార్యగా పెండ్లి చేసినాడు. మాళవిక అందం నడివేసవికాలంనాటి మల్లెపువ్వుల అందం. మేఘాలలో మెరుపు అందం. సముద్రగర్భంలో పగడాల అందం. ఆ బాలిక వచ్చినప్పటి నుంచీ ఆరునెలలపాటు చంద్రశ్రీ తక్కిన అన్ని విషయాలూ మరచిపోయినాడు. మాళవిక అందాన్ని చక్రవర్తి అనేక విధాలుగా వర్ణించాడు.

“మల్లె పువ్వులప్రోవు మందారములప్రోవు
 మావి ఫలముల రసము పైడి గిన్నెలపోత
 మాళవిక నారాణి మాదేశ సామ్రాజ్జి
 మాళవిక నాదేవి భువనైక సుందరీ!"

అని చంద్రశ్రీ చక్రవర్తి పాడినాడు.

ఆ బాలిక ఉప్పొంగిపోయి చక్రవర్తి ఒళ్ళోవాలి “నేను సామ్రాజ్ఞినా?” అని దీనంగా అడిగింది.

“అవును నువ్వు సామ్రాజ్జివి. రేపు చక్రవర్తి సింహాసనం అధివసించేటప్పుడు నువ్వు పట్టమహిషిగా కాకపోయినా రెండవరాణిగా నా సింహాసనం మీద కూర్చుండ వలసిందే! లేకపోతే నేను సింహాసనం ఎక్కనే ఎక్కను.”

మాళవిక చక్రవర్తి ఒడిలో ఒదిగిపోయింది. ఇంతలో ఆ బాలిక లేచి దాపున బంగారుపళ్ళెంలో ఉన్న చేమంతిపూలు దోయిలించి,

“జయము జయము చక్రవర్తి
 జయము ఆంధ్ర సామ్రాట్టుకు
 జయము జయము వీరమూర్తి
 జయము దేవ జయము జయము"

అని పాడుతూ ఆ పూవు లా ఆంధ్రసార్వభౌమునిపై చల్లింది.

5

బ్రహ్మదత్తప్రభువు ఉదయం తన నగరిలో స్నానసంధ్యానుష్ఠానాలు తీర్చి భగవద్గీత శిష్యులకు బోధించే సమయంలో, ఇక్ష్వాకు శాంతిశ్రీరాకుమారి అక్కడకు విచ్చేసి, ఆ మందిరంలో ఒక యవనికాభ్యంతరాన అధివసించి దేశికుడుపదేశించు పాఠం వింటూ కూర్చుంది.

బ్రహ్మదత్తు డావిషయం గ్రహించనేలేదు. విద్యార్థులకు కర్మయోగ ముపదేశిస్తూ “మనుష్యుడు తానే పరమేశ్వరుడు అన్న విషయం గ్రహించాలి. గ్రహించడం అంటే ఆ మాటల అర్థం తెలుసుకోవడం కాదు, చేతలలో, నిద్రలో, మెలకువలో ఆ అనుభవంతో సంచరించినప్పుడే అహం బ్రహ్మజ్ఞానం కలిగిందన్నమాట. ఫలాపేక్షరహితమైన ఆ ధర్మపూర్ణ సంచరణే కర్మయోగం.”

అడివి బాపిరాజు రచనలు - 6

170

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)