పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీముఖ శాతవాహన చక్రవర్తి సకల భారతవర్షానికీ చక్రవర్తి అయిన ఆంధ్ర మహారాజు. అప్పటికి అనేక శతాబ్దాల నాటినుంచీ ఆంధ్రదేశం యావత్తూ పాలిస్తున్న ఈ శాలివాహనమహారాజు వంశపరంపరలో విజయ శాతవాహన మహారాజు తనువు చాలించాడు. విజయం పొందిన్నీ భరింపలేక పోయినాడు మహారాజు.

పులమావిని బందీచేసి ధాన్యకటకానికి కొనివచ్చినారు వీరపురుషదత్తాదులు. శాంతిశ్రీ విజయపురం వెళ్ళిపోయింది. పులమావి సైన్యాలు చెల్లాచెదరై దళాలు దళాలుగా విడిపోయి వెనక్కు వెళ్ళిపోయినాయి. కొన్నిదళాలు ఇక్ష్వాకుసైన్యంలో చేరిపోయినాయి. విజయశాతవాహన చక్రవర్తి నిర్యాణమందినాడు అన్న వార్త చేరగానే ఇక్ష్వాకుశాంతిమూల మహారాజు దేవిరులతో కుమార్తెతో పరివారంతో ధాన్యకటకనగరం హుటాహుటి విచ్చేసినాడు.

విజయశాతవాహన మహారాజు తనయుడు చంద్రశ్రీ పితృయజ్ఞ మొనర్చి సింహాసనం అధివసించాడు. రాజ్యం కొద్దికాలమే ఉన్నా విజయశాతకర్ణి అంతా ఇక్ష్వాకు శాంతిమూలుని సహాయంవల్ల పోయిన సామంత రాజ్యాలన్నీ తిరిగి సముపార్జించు కొన్నాడు. చంద్రశ్రీయే చక్రవర్తి అని శాంతిమూలుడు సర్వరాష్ట్రాలలోనూ ధర్మాజ్ఞప్రచురం చేయించాడు. విజయశాతకర్ణికన్న చంద్రశ్రీ రాజ్యం మరింత క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవలసి ఉన్నది. చంద్రశ్రీ చుట్టూ ఎప్పుడూ శుష్క దేహసౌందర్యాల గాజుపూసలవలె వెలిగే వేయిమంది యువతులుంటారు. ఆంధ్రదేశాల ప్రసిద్ధివహించిన మందిరాలు స్వర్ణ రజత స్ఫటిక శిలాకలశాల ధళధళలాడుతూ ఆ మందిరాలన్నిటిలో ప్రత్యక్షమౌతూ ఉంటవి. రాజ్యపాలనా? అవసరం లేదు. ప్రజాపాలనా అవసరంలేదు. చక్రవర్తిత్వం రావడం తన భోగలాలసత్వానికి మెరుగుపట్టి నట్లవుతుందనే అతని ఉద్దేశం.

చంద్రశ్రీ మూర్తిలో బలంలేదు. అతని పురుషత్వం ఆడవారిని నగ్నంగా చూచి వారినగ్నతను స్పృశించి ఫలసిద్ధి పొందుతూ ఉంటుంది.

వాళ్ళతోపాటు తానూ నగ్నతలో నాట్యం చేస్తాడు. వినరాని ఊహించరాని విధానాల వాళ్ళ నగ్నత్వం దర్శిస్తాడు. మహత్తరమైన శాతవాహన వశాంభోధిలో జన్మించి పూర్ణచంద్రులైన మహారాజుల కాంతుల నీడంతా కూడి ఈ నీచ శాతవాహనునిలో మూర్తించింది అని ప్రజలు చెప్పుకొనేవారు.

2

శాంతిమూల మహారాజు ధనువుపైన నాలుగు అంశాల (ఆరడుగుల నాలుగంగుళాలు) పొడవుగల పురుషుడు. స్ఫురద్రూపి. సాహసంలో శార్దూలం, విక్రమంలో సింహం, వితరణలో గంగిగోవు. జ్ఞానమూర్తీ రాజ్యనీతి విశారదుడూ అయిన ఆ మహాసామంత వృషభుడు, తన ద్వితీయ భార్య మేనల్లుని సుస్థిరంగా సింహాసనారూఢుని చేయ నిశ్చయం చేసుకొన్నాడు. పూంగీప్రోలు ప్రభువొకనాడు శాంతిమూలుని దర్శనానికి వచ్చాడు, “బావగారూ! ఈ మహదాంధ్ర సామ్రాజ్యానికి శిరోభూషణంగా గాజుపూస ఉండాలని మీ ధృఢసంకల్పమా ?” అని గంభీరముద్రవహించి సగౌరవంగా ప్రశ్నించాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

160

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)