పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమ భాగం

అస్తమయం

సూర్యదేవుడు ఎఱ్ఱబారి, వృద్దుడై, నెమ్మదిగా అపరాంబోధిలోనికి జారిపోయినాడు. అతనివెంట అరుణకాంతులు చేరిచేరి ముద్దకట్టి పశ్చిమ సముద్రతరంగాలతో కలిసి క్రిందికి దిగిపోయినవి.

“క్రుంకినది సూర్యకాంతీ
         కోటివెలుగుల దివ్యకాంతీ
 క్రుంకినది సూర్యకాంతీ
         దినమంత వెలిగింది
         జగమంత బ్రతికింది
 నూత్న సృష్టులచేసి
         నూత్న జీవుల నిచ్చి
 క్రుంకినది సూర్యకాంతీ
         కోటివెలుగుల దివ్యశాంతీ
 తూర్పు పడమటి అలల
         తోచినది ఒక వెలుగు
 హిమనగ శ్వేతాగ్ర
         మమృతబిందుల కురిసి
 క్రుంకినది సూర్యకాంతీ కోటివెలుగుల దివ్యకాంతీ”

క్రుంకినది సూర్యకాంతీ అన్నపాట దెసదెసలు ప్రసరించినది. పులమావి పట్టుబడ్డాడు. బందీగా ధాన్యకటకనగరానికి తీసుకువస్తున్నారు. కోల కొలది పణాల బంగారురాసులు చక్రవర్తి కోశాగారానికి వస్తున్నవి అన్న వార్త వినగానే చక్రవర్తి అతి సంతోషాన లేచి అతిత్వరితగమనాన అంతఃపురం వీడి సభాభవనానికి వస్తూ మధ్యమందిరంలో ఒక బౌద్ధధర్మకలశ శిల్పవిన్యాస స్తంభం ఎదుట హృదయస్పందన మాగిపోయి ఇంద్రహస్త వినిర్ముక్త వజ్రాఘాతంవల్ల కూలిన మహాపర్వతంలా కూలిపోయినాడు. సేవకులు, వందులు, పారిపార్శ్వకులు, అంగరక్షకులు హాహాకారాలతో శ్రీశ్రీ విజయ శాతవాహన చక్రవర్తి కడకు ఉరికినారు.

చక్రవర్తి నోటరక్తంనురుగులు వస్తున్నాయి. వైద్యుడు అని కేకవేసినా డొక కంచుకి. సేవకులు పరుగెత్తి ముందుమందిరంలోఉన్న రాజవైద్యుని కొనివచ్చారు. చక్రవర్తి ఈ లోకము వీడిపోయినాడు. దేహాన సమస్త నాడులు ఆగిపోయాయి. రాజవైద్యుడు అమృతాదులు ఉపయోగించినాడు. చక్రవర్తి చనిపోయినది నిశ్చయము. అంతఃపురాన హాహాకారాలు మిన్ను ముట్టినవి. ధాన్యకటకనగరం దుఃఖసముద్రంలో మునిగిపోయినది.

అడివి బాపిరాజు రచనలు - 6

159

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)