పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మదత్తప్రభువు వేడుకలు చూస్తూ సువర్ణద్వీపంనుంచి తాను కొని తెచ్చిన లక్కవస్తువులు, పచ్చలూ, కెంపులూకూర్చిన హారాలూ, చిత్రచిత్ర వస్తువులు బాలికలకు బహుమతులిచ్చినాడు. వీరపురుషదత్తునికి కెంపులు పొదిగిన ఒరతోడి మణులు పొదిగిన సువర్ణద్వీప ఖడ్గమిచ్చినాడు. సువర్ణ ద్వీప మహారాజు ఆంధ్రచక్రవర్తికీ, ఇక్ష్వాకు మహారాజుకూ అనేక బహుమతులు పంపినాడు. శాంతిమూల మహారాజుకు పంపిన బహుమతులు వారి కిచ్చినాడు. ఇతరులకు ఖడ్గములు మొదలయిన ఆయుధములు బహుమతులిచ్చినాడు.

సువర్ణ ద్వీపంలో పనితనం అంతా గాంధర్వ శిల్పమూ, విధ్యాధరశిల్పము, ఆంధ్రశిల్పము విశ్వబ్రహ్మ శిల్పసమ్మిశ్రితము. ఆంధ్రశిల్పము సువర్ణద్వీప గాంధర్వశిల్పంలో రంగరింపయి ఒక నూత్న సౌందర్యం చేకూర్చుకున్న నూత్న సంప్రదాయం ఉద్భవించింది. ఆ శిల్పవస్తువులు వెలకు తెచ్చి పంచినాడు బ్రహ్మదత్తుడు. ఒక పెద్ద గార్ముత్మతోపలం చెక్కి విన్యసించిన పరమసుందరమూర్తి మంతమయిన ధ్యానిబుద్ధ విగ్రహమొకటి ఎనిమిది అంగుష్టముల ఎత్తున్న దానిని బ్రహ్మదత్తుడు ఇక్ష్వాకు రాకుమారి శాంతిశ్రీకి బహుమతి ఇచ్చినాడు. ఆ విగ్రహము చూడడముతోనే శాంతిశ్రీ చైతన్యరహిత అయినది. ఆమె ఆనందం ఆకాశగంగవరకు ఉబికి పోయింది.

“గురువుగారూ! ఈ పవిత్ర విగ్రహాన్ని నాకోసమే సంపాదించినారా?” ఆ బాలిక మాటలు శిశువు మాటలవలె ఉన్నవి.

“అవును రాజకుమారీ! ఈ విగ్రహమును సువర్ణద్వీపవాసియైన సామంతప్రభువు ఒకపెద్ద గారుత్మకం చెక్కించి చేయించినాడు. నేను “పాగాను” మహానగరం వెళ్ళినప్పుడు, ఆ సామంతుని ఇంట అతిథిని. మేము మూడుదినాలు తత్త్వవిచారణ చేశాము. నా మాటలు అతనికి పరమ శ్రమణకుని బోదలా ఉందని ఆయన నా కవిగ్రహం బహుమతి ఇచ్చాడు. ఈ వవిత్రమూర్తిని చూడగానే ఇది భర్భదారికకు అని నేను మనస్సులో నిశ్చయించుకొన్నాను.” బ్రహ్మదత్తుని మాటలలో చిరునవ్వు సౌరభంలా వెల్లివిరిసింది.

“ఓహో! ఈ పరమశిల్పం నాదగ్గర ఉండడానికి నేను తగుదునా గురుదేవా?” ఆమె మాటలు చిన్న మల్లి మొగ్గలులా వికసించాయి.

“నీకన్న దీనికింకెవరు తగుదురు రాజకుమారీ?” బ్రహ్మదత్తుడు గంభీరంగా అన్నాడు.

“అది మీ హృదయంలోని అనుగ్రహం! సువర్ణ ద్వీపంలోని విశేషాలు నాకు తెల్పండి.”

“నీకు జ్ఞానతృష్ణ ఎక్కువ శాంతిశ్రీ కుమారీ!”

“కాని ఆ తృష్ణకు తగిన మెదడు లేదుకాదా అండి” అవనత వదనయై ఆమె పలికింది.

“నీకు మెదడులేదని ఎవరనగలరు రాజకుమారీ! గురువు నైన నేనెరు గనా?” -బ్రహ్మదత్తుడు విషాదపూర్ణమైన చిరునవ్వు నవ్వాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

127

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)