పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పులమావి నగలన్నీ తాను తీసుకొని, నాణ్యాల రాసులలో ముప్పాతిక తాను సంగ్రహించి, తక్కినవి రాజ్యావసరంకోసం ధనాగారంలోనే ఉంచినారు. దాసీలలో అందమైనవారిని ఆరువందలమందిని తన అంతఃపురంలోనికి తీసుకున్నాడు. ధైర్యం బలాన్నిస్తుంది. యుద్ధతంత్రం నేర్పుతుంది. బలం ఇంకా బలం చేకూరుస్తుంది.

పులమావి చరిత్ర అంతా వింటున్నకొలదీ విజయశాతకర్ణ చక్రవర్తికి మతిపోయింది. పులమావి తన చుట్టాన్ని ఒకరిని తన రాజప్రతినిధిగా ప్రతిస్థానంలో నిలబెట్టి వెంటనే తన సర్వసైన్యాలు కూర్చుకొని ఆగకుండా అతి వేగంగా మహారాజపథం వెంట ధాన్యకటకాభిముఖుడై బయలుదేరినాడు. పులమావి ఎక్కిన మదపుటేనుగుపై బంగారపు టంబారీ ఒకచిన్నగది అంత ఉన్నది. దాని నిండా హంసతూలికల పరుపులు పరచినారు. మెత్తని ఉపధానాలపై ఆనుకొని, తన వినోదునితో మాటలాడుచు పులమావి ప్రయాణం చేస్తున్నాడు.

“నానాటికి శాంతి పిచ్చి ఎక్కువై పోతున్నది నాకు.”

“దానికి శాంతే విరుగుడు!” వినోదుడు పులమావి చేయి పట్టుకొని నాడి చూసినాడు.

“శాంతి పిచ్చికి శాంతి మందేమిటి నీ మొగం?”

“అలా అనకండి సార్వభౌమా! మీకు వైద్యసూత్రాలు తెలియవు. కామసూత్రాలూ చదువలేదు.”

“వాత్సాయనుడు శాంతి మందు అని తెల్పాడా?”

“ఆ! ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న సూత్ర ప్రకారం శాంత్యున్మాదానికి శాంతే మందు అన్నాడు.”

“ఎవడు వాడు?”

“ఈ మహావైద్యుడు తమ వినోదుడు!”

“ఓరి మూర్ఖుడా!”

“ఉండండి. శాంతిదేవికోసం మీకు పిచ్చి, మరి శాంతిదేవిని తమచే సేవింపచేస్తే, ఆ పిచ్చికుదరదా?"

“ఓహో! అదా?”

“ఏమనుకున్నారు ప్రభూ!”

6

విజయపురంలో వసంతోత్సవాలు అద్భుతంగా జరిగినవి. వీరపురుషదత్తుని ఆనందమూ, పూంగీయ శాంతిశ్రీ బాపిశ్రీల ఆనందం వర్ణనాతీతము, పూంగీయ యువరాజు స్కందసాగరుడు వసంతుడయ్యాడు వీరపురుషదత్తుడు మన్మథుడయ్యాడు. వాసిష్టి శాంతిశ్రీ పుత్రిక శాంతశ్రీ రతీదేవి అయింది. స్కందసాగరుడు ఇక్ష్వాకు రాజవంశపు బాలికను వనదేవతగా ఎన్నుకొన్నాడు. ఈ సంవత్సరం ఉత్సవంలో జరిగిన వేడుకలు ఏనాడూ జరగలేదన్నారు. మాళవరుద్రభట్టారిక పారిజాతమయింది. బాపిశ్రీ మందారమయింది. షష్టిశ్రీ కమలపుష్పమయినది.

అడివి బాపిరాజు రచనలు - 6

126

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)