పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మీరు ఓడమీద విహారంవెళ్ళి మాయిమైపోయారన్నప్పుడు నాకు భయమువేసింది. దినదినమూ నిద్రపట్టేదికాదు” ఆమె అనుద్వేగయై మాట్లాడింది. ఆమెలో శిశుత్వం తొణికిసలాడింది.

బ్రహ్మదత్తు డామెవైపు కొంచెంసేపు తీక్ష్ణపు చూపులు పంపినాడు, “భయం ఎందుకువేయాలి? నిర్వాణాభిముఖులకు భయం కలుగకూడదు” అన్నాడు.

“ఎందుకు భయంకూడదో నాకు తెలియదండి” ఆమె చిరునవ్వు నవ్వింది. చంద్రకాంతోపలంతో విన్యసించిన శిల్పానికి చైతన్యం వచ్చినట్లయింది. ఒకసారి వేయి ఉషస్సులు లోకాలను ఆవరించినట్లయింది. ఎఱ్ఱని ఆమె పెదవులు విడివడిన. స్తనవల్కలావృతాలయి, సుందరశ్రీ విలసితాలయిన వక్షోజఫలాలు ఉబికినవి. ఆమె రూపము జగన్మోహనము. చిరునవ్వు నవ్వినప్పుడామె విశ్వమోహనరూపం వెలిగిపోయింది. ఆమె మూర్తినుండి ఏవోదివ్య సౌరభాలు ప్రసరించినవి. బ్రహ్మదత్తుడు లోలోన వణికిపోయినాడు.

ఈ బాలికలో ఏదో విచిత్ర మహామధుర చైతన్యము ఉదయిస్తున్నది. ఆ బాలిక పర్వతద్వార గోపురప్రాంగణంలో తన పాదాలంటి కళ్ళకద్దుకున్నప్పుడు బ్రహ్మదత్తునకు వివశత్వము కలిగింది. ఆమె స్పర్శ తన్నట్లు వణికించివేయగలదు అనుకోలేదు. ఆమె దివ్యమధుహస్తాలు ఏదో అనన్యానుభూతిలా తన పాదాలను స్పృశించాయి. “ఓ బాలికా! సర్వలోక సౌందర్య మృతకలశీ! నీ స్పర్శే చైతన్యరహితుణ్ణి చేస్తున్నదే, ఇంతకన్న ఇంకను అద్భుతమయిన వరము నాకు సన్నిహితమయితే నా భవిష్యత్తు ఏమయిపో గలదు?” అని అతని ఆత్మ ఎలుగెత్తి విశ్వసించింది. నేడు ఈ బాలిక అప్రతర్కితంగానే తన్ను అమృతకర్తరిలో ఉంచిన పోకను చేస్తున్నదు! బ్రహ్మదత్తునికి భరింపరాని ఆనందం కలిగింది. అతడు వెళ్ళి వచ్చెదనని సెలవు గైకొన్నా డానాడు.

ఆ ఆలోచనలన్నీ తన చిత్తస్థైర్యాన్ని ముక్కలు చేస్తూ ఉండగా బ్రహ్మదత్తుడు వసంతోత్సవాలకు వచ్చినాడు. ఆ ఉత్సవాలలో ఒకనాడు శాంతిశ్రీ రాకుమారి బ్రహ్మదత్తునికడకు చెలికత్తెలు కొలువు విచ్చేసి, “గురుదేవా! నన్ను రతీదేవిగా మీరు క్రిందటి సంవత్సరం ఎన్నుకొన్నారు. నేను ఎందుకో భయపడిపోయినాను. ఆ ఎన్నుకొనడం, భయపడడంలో ఉన్న భావం నాకు తెలియ చెప్పగలరా ప్రభూ?” అని ప్రశ్నించింది.

7

వసంతోత్సవాలు ప్రారంభించిన మూడవదినాన. పులమావి విజయ యాత్ర బయలుదేరిన వార్త విజయపురానికి అందింది. రాచనగళ్ళలో, పట్టణంలో గజిబిజి బయలుదేరినది.

“ఎవరీ పులమావి?”

“తాను వాసిష్టీపుత్ర పులమావిని అనుకున్నాడా?”

“ఏమిటి వీడి ధైర్యం ?”

“ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో?”

“మన చక్రవర్తి అసమర్దుడయితే పులమావి జైత్రయాత్రకు బయలుదేరుతాడు. పుల్లమామిడే గొప్ప పండవుతుంది.”

అడివి బాపిరాజు రచనలు - 6

128

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)