పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంపకకుసుమంలా వెలిగిపోతూ, తన లీలోద్యానవనంలో పుష్పాచయం చేస్తున్న సమయంలో చెల్లెలితో మాట్లాడడానికి యువరాజు స్కందసాగర ప్రభువు అక్కడకు వేంచేసినారు.

“అన్నయ్యగారూ! ఇంత ప్రొద్దున్నే వచ్చినారు?” అని ఆ బాలిక యువరాజు కడకు పరుగిడి వచ్చి ప్రశ్నించింది.

“బ్రహ్మదత్త ప్రభువు నన్ను కలుసుకొని ఎన్నో విషయాలు చెప్పినారు.”

“చెప్పరా మరి! మామయ్యగారి రాజకీయాలు మామయ్యగారివి. ఆ రాజకీయాలలో భాగం బ్రహ్మదత్తప్రభువు?”

“అంత సంతోషంగా ఉన్నావు! పారిజాతపుష్పాల ప్రోవులా ఉన్నావు, అదేమి తల్లీ, అలా మాట్లాడుతావు.”

“ఎట్లా మాట్లాడాను? నాకా సంతోషం? నేను రూపెత్తిన దుఃఖవతను.”

“రాజధర్మము చేయకలిగే విపర్యాయాలు రాచపుట్టువులకు తప్పదమ్మా చెల్లీ.”

“మీ కేమి నాన్నగారూ, మీరు మగవారు, అదృష్టవంతులు. మగవారి ధర్మాలులేరు, స్త్రీల ధర్మాలు వేరు. మగవారు ఏమిచేసినా చెల్లుతుంది.”

“ఎందుకంత ఉద్వేగం చెల్లీ!”

“బ్రహ్మదత్త ప్రభువు రాయబారం నా కర్థం కావటంలేదనా? ఆ నిష్ఠుర రాజధర్మానికి నేను బలికావాలనేకదా వారి రాయబారం.”

“చెల్లీ! బావగారు అస్వతంత్రులు.”

“బావగారికేం? పాపం అధికస్య అధికం ఫలం. వెనక శ్రీకృష్ణుడు లేడా? ఆ తర్వాత ఉదయనుడు, ఆ తర్వాత అగ్నిమిత్రుడూ, మామయ్యగారూ!'

“అయితే బావగారు అందరితోపాటే.”

"అవునండీ మీరు మగవారు. చెల్లెలినయితేనేమి నేను ఆడదానినిగా! అందుకని మీకు చీమయినా కుట్టదు.”

“నాకు మతిపోతున్నదమ్మా!”

“నా విషయంలో మీకు మతిపోవడం మంచిదికాదు. నేను బౌద్ధ భిక్కుని కాదలచుకొన్నాను. ఇక్ష్వాకు యువరాజుగారు వారి రాజనీతినీ, ధర్మాన్ని అడ్డంలేకుండా ఉపయోగించుకోనియ్యండి.”

“నిన్ను బావగారు హృదయమార ప్రేమిస్తున్నారని నేను అభిప్రాయం పడ్డానే?”

“హృదయమార ప్రేమిస్తున్నారా? పాపం! నాకు చాలా విచారంగా ఉంది. వారు ఆత్మారగా భట్టిదేవిగారిని, మనస్సారగా ఉజ్జయినీ రాజకుమారిని, ప్రియమారగా బాపిశ్రీ కుమారిని ప్రేమిస్తున్నారు.”

“ఆయాస పడకు చెల్లీ. మనం రాచబిడ్డలం కావడంవల్ల మన సౌఖ్యంకంటె దేశసౌఖ్యం ప్రధానం మనకు. ఇంతకంటె ఏమి చెప్పగలను?”

“అన్నగారూ! మీరు కలతపడకండి. ఏదో మతిలేనిదాన్ని. మీరందరూ విజయపురం వసంతోత్సవాలకు వెళ్ళుదామంటే నా అభ్యంతరం లేదు. నాయనగారు ఆనతిస్తే ఏపని అయినా సంతోషంగా చేస్తాను.”

అడివి బాపిరాజు రచనలు - 6

96

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)