పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ మాటలంటూ ఆ బాలిక అక్కడినుండి మెరుములా మాయమైంది. చెల్లెలి మాటలకు ఆశ్చర్యమందుతూ, ఏదో భయం తన్ను అవహింపగా, కనుబొమలు ముడివడగా, ఆలోచిస్తూ స్కందసాగర యువరాజు అక్కడినుండి వెళ్ళిపోయెను. పూంగీయ శాంతశ్రీ రాకుమారి పరుగున మాధవీ నికుంజంలోనికి పోయి, అక్కడ ఒత్తుగా పడియున్న బండిగురువిందపూలపై బోర్లగిలపండుకొని పట్టజాలని దుఃఖంతో కరిగి పోయింది.

4

ఆంధ్రదేశము సస్యశ్యామలము. చంద్రగుప్తుని కాలంనాడున్న ధాన్యకటకము, శ్రీకాకుళము, కంటకశైలం, ప్రతీపాలపురము, ధనదుపురము, మోసలపురము, మహాకాండూరు, కండరపురము, పూంగీప్రోలు, మహానాగపురము, వేంగీపురము, కొలనిపురము, ప్రతిష్టానము, వైజయంతి, సప్తగౌతమీపురము, ముసిక పురము, గృధ్రహారపురము మొదలగు ముప్పది మహాపురములు నానాటికీ పెరిగి శాంతిమూలుని కాలానికి ఏబది మహానగరాలైనవి. ప్రథమ శాతవాహన మహారాజుల కాలంలోలేని ఏన్నో సామంతరాజ్యాలు ప్రబలినాయి. శాతవాహనుల గురించి గాథలు పెరగిపోయినాయి. బృహత్కథ ఎన్నిప్రతులో వ్రాయించుకొంటూ ఆంధ్రులు దేశాలన్నీ ఆ గాథలచే నింపినారు.

దేశం సుభిక్షం అవడంచేతనూ, రాజులు ఎప్పుడూ ధర్మయుద్ధాలే చేస్తూ ఉండడం వల్లనూ పల్లెటూళ్ళకు ఏమీ ఇబ్బందులు కలుగలేదు. ముట్టడులు జరిగినప్పుడు నగరాన్ని చుట్టి ఉన్న కోటదగ్గరే యుద్ధం జరిగేది. ఏపక్షం వారూ సాధారణ ప్రజలను హింసపెట్టేవారు పైగా వర్తకులకూ, యాత్రికులకూ, సాధారణ ప్రజలకు ఏవిధమైన నిర్బంధము కలుగజేయకుండా వారి దైనందిన జీవితాన్ని సుఖంగా సాగనిచ్చేవారు. వర్తకులు ఇరువాగుల వారితో వర్తకం చేసేవారు. యుద్ధం ముగియగానే, వానవచ్చి వెలిసినట్టు ఉండేదికాని, తుఫాను వచ్చి, వెళ్ళిపోయినట్లు ఉండేదికాదు.

ఆంధ్రదేశంలో పది సంవత్సరాలకో, ఆరు సంవత్సరాలకో అప్పుడప్పుడు గాలి వాన వస్తూ ఉండేది. ఆ సమయంలో పంటలు నాశనం అయ్యేవి. తొలకరికాలంలో వడగళ్ళవానవచ్చేది. పైరు పంటలు కోతలకు వచ్చినవి నాశనం అయ్యేవి. పంటలు నాశనం అయినప్పుడు మహదాంధ్రదేశంలో ఈ గాలివానా, ఈ రాళ్ళవానా అంటని ప్రదేశాలు ఎప్పుడూ ఉండేవి. అవీకాక ప్రతిగ్రామానికీ కరువుగాదెలుండేవి. ప్రతి భూపాలుని కోటలోనూ కరువుగాదెలుండేవి. కాబట్టి వెంటనే ప్రజాసహాయకర్మ అమలులోకి వచ్చేది. ఒక్క కుటుంబంగాని ఒక్క ప్రత్యేక వ్యక్తిగాని ఈతిబాధలేమీ పొందకుండా జరిగి పోయేది.

గ్రామం సంపూర్ణ స్వత్వాలు కలిగిన రాజ్యము వంటిది. ఆ దినాలలో ప్రతి మునుషునకూ రాజకీయ పరిజ్ఞానము కొద్దోగొప్పో ఉంది. ధర్మమంత అక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. విదేశాలకు ఎగుమతి అయ్యే వస్తువులు పట్టణాలలోనే నిర్మించేవారు. వస్త్రాలు, వర్ణాలు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, బంగారము, వెండి మొదలగులోహాలు, లోహపు వస్తువులు పనిముట్లు, ఆయుర్వేద ఔషధాలు మొదలయిన వెన్నియో పెద్దనగరాలనుండి ఎగుమతి అయ్యేవి.

అడివి బాపిరాజు రచనలు - 6

97

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)