పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మ: ప్రభూ! దినానికో భూపతి వస్తూంటే భూమిలో శాంతి ఏలా ఉంటుంది?

స్కంద: నిజమే.

బ్రహ్మ: రాజు నీరసిస్తే, పరరాజుకు బలం ఎక్కువౌతుంది.

స్కంద: చిత్తం!

“అప్పుడు పరరాజు ఎత్తివస్తాడుకదా?”

“అవును ప్రభూ!"

“అయితే రాజుకు బలమిచ్చే గొప్ప ఓషధి రాజ బంధుత్వాలు!”

“అవును.”

“ఈ బంధుత్వాలు ఎక్కువ చేసుకోవాలంటే నలుగురయిదుగురు రాజులతో వియ్యమందాలి. అప్పుడు ఆ రాజుకు ఎంతో బలం! పాండవులు ద్రుపదునితో, మాత్స్యునితో వియ్యమందారు కాదా?”

“చిత్తం నా కర్థమయింది.”

“వీరపురుషదత్తప్రభువు పూంగీయ రాజకుమారి శాంతశ్రీని తమ ఆత్మేశ్వరిగా ప్రేమిస్తున్నారు. మనకు వాసిష్టుల సహాయం కూడా అవసరం, మాళవుల సహాయమూ అవసరమే.”

“చిత్తం. బ్రహ్మదత్తప్రభూ! తమ మాటలు మా చెల్లెలితో చెప్పి ఆమెను విజయపురోత్సవాలకు వచ్చేటట్లు చేయ ప్రయత్నిస్తాను.”

బ్రహ్మదత్త ప్రభువు యువరాజు సెలవుపొంది తమ విడిదికి వెడలి పోయినారు.

స్త్రీల హృదయం పురుషునికి తెలుస్తుందా అని బ్రహ్మదత్తు డనుకొన్నాడు. మనుష్యులలోని సర్వశక్తులూ స్త్రీలే అయితే, పురుషునికి స్త్రీ హృదయం ఏలా తెలుస్తుంది! స్త్రీకి పురుషుని హృదయం మాత్రం అర్థం అవుతుందా ఏమి! శ్రీరామచంద్రుడు ఎందుకు సీతను అడవులకు పంపినాడు? ప్రజారాధనంకోసమే కదా! సీతామహాసాధ్వి నెంత ప్రేమించినా ఆ ప్రేమ రాజధర్మాన్ని త్రోసివేయలేదు. కాని శ్రీరామచంద్రుడే వీరపురుష దత్తుడై ఉద్భవిస్తే బహుభార్యాత్వం అంగీకరించునా? తనకీ రాజధర్మ నిర్వహణ తప్పదు. హృదయం విరక్తమైనా రాజులకు ధర్మానురక్తి తప్పనిదే. తన వైరాగ్యానికి కళంకం ఉద్భవించింది ఇది కళంకమా?

3

పూంగీయ రాజకుమారి భవనంలో స్కందసాగర నాగప్రభువు ఆమెను కలుసుకొన్నాడు. జగత్ప్రసిద్ధినందిన వాసిష్టీపుత్రి ఇక్ష్వాకుశాంతశ్రీ సౌందర్వానికి ముగ్ధులై ఎంతమంది రాజపుత్రులు ఆమె చిన్నతనంలో ఆమె నుద్వాహంకావాలని స్వప్నాలు కనలేదు. కాని అన్నగారైన శాంతిమూల మహాసామంతుని స్నేహితుడు, వీరుడు ఆయిన పూంగీరాష్ట్ర సామంతునే ఆమె వరించింది.

పూంగీయ స్కందశ్రీ శాంతశ్రీల ప్రేమ కవిలోక ప్రశంస లందుకొన్నది. వారికడుపున యువరాజు స్కందసాగర ప్రభువు, శాంతశ్రీదేవి ఉద్భవించారు. పూంగీయ రాజకుమారి శాంతశ్రీ అపురూప సౌందర్యవతి, శాంతశ్రీ రాకుమారి ప్రత్యూష హిమబిందు స్నాతయైన

అడివి బాపిరాజు రచనలు - 6

95

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)