పుట:Ammanudi july 2018.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోనే వ్యవహరించబడాలి అనేది ఒకటి. మరి ఆ పుట్టింటి ఇంటి పేరు కూడ తండ్రిదే గదా? తండ్రి కూడా పురుషుడే గదా! ఇంటి పేరు మారడం, పురుషాహంకార సమాజానికి నిదర్శనము అన్నపుడు, మరో పద్ధతిలోనైనా దానినే పాటించడం ఎలా సబబు అవుతుందో వివేచనకు అందిరాదు. రెండవ సూచన ఏమంటే, తమ సంతతికి, తమ (వివాహితలు) వివాహత్పూర్వపు ఇంటి పేరు పెట్టాలనడం. ఇందులో గావించిన మరో సూచన ఏమంటే, సంతతిలోని బాలురకు తండ్రి ఇంటి పేరు. బాలికకు తల్లి ఇంటిపేరు ఉండాలనడం. వీటి వలన కాలాంతరంలో ఉత్పన్నమయ్యేది. గందరగోళమే తప్ప, పురుషాహంకారాన్ని తప్పించడమెలా అవుతుందో తెలియరాదు. నిజానికి, ఈ ఎందుకు మారాలి అన్న సమస్య పాశ్చాత్య ప్రపంచం నుండి ముఖ్యంగా అమెరికా నుండి దిగుమతి అయింది. అచ్చటి స్త్రీవాదులు పరిష్కారం కొరకు న్యాయస్థానాలను ఆశ్రయింపగా వచ్చిన తీర్పుల విషయం, ఈ వ్యాస ప్రారంభంలో పేర్కొనడం జరిగింది. అది, మారడం, మార్చుకోకపోవడం, అనేది అలా కోర్టు నాశ్రయించిన వారి ఇష్టాయిష్టాలకు వదిలివేయడం. ఆస్తి సంక్రమణం లాంటి విషయాల్లో మారి వుంటే పరిష్కారం సులభమని చెప్పడం జరిగింది. అంతేగాక అది. విశ్వవ్యాప్తమైన ఆచారమని చెప్పడం జరిగింది. అంతే తప్ప ఆచారానికి మూలమేమిటో చెప్పబడలేదు. ఈ విషయాలన్నీ అమెరికాలోని న్యూయార్కు నుండి వెలువడే 'నేము' అనే పత్రిక నుండి గ్రహించడం జరిగింది. ఇలా వుండగా ఈ మధ్యకాలంలో 'నడుస్తున్న చరిత్ర' అనే పత్రికలో, ఎందుకు మారాలి అనే విషయంపై ఒక వ్యాసం వెలువడగా, దానిపై ఇరువురు పాఠకురాండ్రు, ఇలాంటి సమస్యలను అనవసరంగా రేకెత్తిస్తున్నారని, అలా మార్చుకోకపోవడం ఇష్టంలేని వారు అలాగే కొనసాగవచ్చని, ఇతరులపై వారి అభిప్రాయాలను ప్రసరింప జేయడం అనవసరమని, ఆ వ్యాసకర్త, తమ నిజ జీవితంలో దానిని ఎందుకు ఆచరణలో పెట్టడం లేదని వ్రాశారు (కారణం ఆ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ వివాహిత. వారు తమ భర్త ఇంటి పేరుతోనే కొనసాగుతున్నారు) అంతేగాక ఇది ఒక వికారపు ఆలోచన, వ్యర్థ చర్చ తప్ప మరొకటి కాదని కూడ వ్రాశారు. (చూడు : నడుస్తున్న చరిత్ర, జనవరి, ఫిబ్రవరి 2001) అంతేగాక, ఈ మారడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నపుడు, దాని వలన ఇబ్బంది లేనపుడు, ఆ ఆనవాయితీని కొనసాగిస్తే తప్పు ఏమిటి అని వ్రాశారు. దీనిని బట్టి ఈ సమస్య పట్ల వివాహిత స్త్రీలలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తుంది. (పై ప్రశ్నలకు ఆ వ్యాస రచయిత్రి సమాధానం ఇవ్వలేదు).

ఇక అసలు విషయానికి వద్దాము. మారడం అనేది ఆచారం. ఈ ఆచారం ఎందుకు ఏర్పడింది అనేది ప్రశ్న. నిజానికి మారడం అనేది లేదు. అంటే వివాహత్పూర్వం స్త్రీకి కుటుంబనామం లేదు. వివాహం తరువాతనే ఆమె ఇంటిపేరు స్థిరీకరింపబడుతోంది. అది భర్త ఇంటి పేరుతో! అయితే వివాహత్పూర్వం పురుషునికి కూడ కుటుంబనామం లేదు. మొదలు వివాహ విషయంలో దీని ప్రసక్తిలేదు. వివాహం తరువాత, వెంటనే కాక పోయినా, కుటుంబాలు విడిపోతున్నాయి. అలా విడిపోయినపుడు, వ్యవహార సరళి నిమిత్తం, వివాహితుడైన వానికి అతని కుటుంబ నామం సంక్రమిస్తోంది. తత్పూర్వం, రికార్డులతో పని ఏర్పడినప్పుడు తప్ప, ఇతరత్రా అతడు ఫలానా వారి కుమారుడు అని, ఆమె ఫలానా వారి కుమార్తె అని మాత్రమే వాస్తవమైన వ్యవహార సరళి అని ముందు చెప్పడం జరిగింది. వివాహానంతరం వురుషుడు కుటుంబీకుడు అవుతున్నాడు. అతని భార్య కుటుంబిని అవుతోంది. ఇరువురు, వారి సంతతి అంతా కుటుంబ మవుతోంది. అలా ఆ కుటుంబాని కంతకు కుటుంబనామం స్థిరీకరింప బడుతోంది. ఈ స్థిరీకరణంలో పురుషుని కుటుంబనామం అలాగే వుండగా, స్త్రీకి అప్పటికి గల - అంటే ఆమె తండ్రి కుటుంబనామం, మారుతోంది గదా అనబోతారు. ఇదే గదా అసలు సమస్య! పై వాక్యాల్లో దీనికి సమాధానం వుంది. అయినా మరి కొంత వివరంగా చూద్దాము. వివాహితకు తన కుటుంబం ఏది! తండ్రి కుటుంబమా! లేక తాను, తన భర్త, తన సంతానంతో కూడిన కుటుంబమా! మారడం దోషమైతే, తండ్రి కుటుంబ నామంతో కొనసాగడం మరింత దోషం కాదా! మరి ఆమె సోదరుల కుటుంబనామాలు ఎలా ఉండాలి. ఆమెది, ఆమె సోదరులది ఒకటే కుటుంబనామమైతే, సమమైన గుర్తింపు కొరకు ఏర్పడిన వివక్షకు స్థితి ఏమిటి. ఆమె వల్లనే గదా పురుషుడు కుటుంబీకుడు అవుతోంది. ఆమె కుటుంబిని అవుతోంది. కనుక దీనిలో ఇంటిపేరు మారడం అనే సాధారణ వ్యవహారం గాక, సమాజ మనుగడ అందులోని కుటుంబ వ్యవస్థ అనే అంశాలు ఇమిడి ఉన్నాయి. కనుక అది కేవలం ఇంటిపేరు గాదు. కుటుంబ నామం. ఇది పైకి కనుపించేటంత సాధారణ వ్యవహారం గాదు. కనుకనే ఇది విశ్వవ్యాప్తమైన ఆచారం.

ఇప్పుడు ఈ ఆచారానికి మూలమేమిటో చూద్దాము. పెళ్లివలన గదా, ఈ సమస్య ఉత్పన్నమైనది! అది లేకపోతే ఈ సమస్యే వుండదు. కాని అపుడు సంతతిని ఎలా గుర్తించాలో తెలియదు. అది అలా వుంచినా, పెళ్లి లేని సమాజం స్వీడన్లో అమల్లోనికి వచ్చిందని, అది విఫలమయిందని ఎవరో చెప్పగా తెలిసింది. అయినా ఇప్పుడు దానితో పనిలేదు. మన సమస్య ఇంకా అంతవరకు ఎదగలేదు. పెళ్ళి అంటే వివాహమని అర్థం - అని అనుకుంటారు. నిజానికి కాదు. పెళ్లి అంటే వధువు అని మాత్రమే. మనం పెళ్ళికూతురని ఎవరిని సంభావిస్తున్నామో ఆమె పెళ్లి. అంతే! వివరాలు కావలసినవారు, దీనిని పరిశీలించండి. బాలిక, కన్య, వధువు, భార్య - ఇవి సంస్కృత పదాలు. వీటికి సమమైన పదాలు ఆడపిల్ల, పడచు, పెళ్లి, మగువ (మగనాలునే మగువ అనాలి) అంటే వధువు అనే సంస్కృత పదానికి సమానమైన తెలుగుపదం పెళ్లి, ఈ భాషాచర్చ ఇలా వదలి, వధువు అని ఎప్పుడు అంటున్నామో తెలుసుకుందాము. వివాహం నిశ్చయమైనపుడు, కన్య, వధువు అవుతుంది. అంటే ఏమిటి. ఫలానా వరునికి ఈమె వధువు అని నిశ్చయింపబడిందన్న మాట. దీనికి ఒక కార్యక్రమం వుంది. అది లగ్నాలు పెట్టుకోవడం. అప్పుడు జరుగుతోందేమిటి.

బ్రాహ్మణుల్లోనయితే గోత్రచ్ఛేదనం. ఇతరుల్లో నయితే వరుని ఇంటివారు, ఉద్దిష్ట కన్యను, తమ అమ్మాయి అనిపించుకోవడం. పసుపు కుంకుమలు ఇచ్చి, తాము తెచ్చిన చీరను ఆమెతో ధరింపజేయడం. గోత్రచ్ఛేదనం ఎవరి గోత్రం నుండి. ఆమె తండ్రి గోత్రం నుండి. మారడం,

...తరువాయి 48 పుటలో

తెలుగు మాధ్యమాన్ని తీసివేస్తే తెలుగు వర్ధిల్లదు

40

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018