పుట:Ammanudi july 2018.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు లిపి - సంస్కరణావశ్యకత

రంగనాయకమ్మగారు నా వ్యాసంపై స్పందిస్తూ “ఈయన 'ళ' కి బదులు 'ల' నే వాడుకోవచ్చు అన్నారు. ఈ వాక్యం నా వ్యాసంలో లేదు. నేను పొరపాటున గూడ ఇలా అనను. ఇంకెవరైనా అమ్మనుడిలో రాశారేమో వెదకండి.

1. తెలుగు వ్యవహారంలో అ ఇ ల మధ్యస్థంగా వినబడే ధ్వని ఒకటి ఉంది. అవగాహనకోసం ఒక ఉదాహరణ. 1. ఆయన ఇంటిలో పెద్ద మేక + ఉంది. 2. ఆయన ఇంటిలో పెద్ద మేకు + ఉంది. వ్యవహారంలో ఇలా విడదీసి మాట్లాడరు. ఉచ్చారణ త్వరణం వల్ల సంధి జరుగుతుంది. మొదటి వాక్యాన్ని మనస్సులో అనుకొని గట్టిగా పలకండి. అలాఏ రెండవ వాక్యాన్ని మనస్సులో అనుకొని గట్టిగా పలకండి. భేదం మీకే తెలుస్తుంది. గ్రహించలేకపోతే రికార్డు చేసుకొని వినండి. ధ్వనిభేదం వున్నా మేకు + ఉంది. = మేకుంది, మేక + ఉంది. = మేకుంది అనే రాస్తున్నాం. ఈ ధ్వని భేదాన్ని గిడుగు రామమూర్తిగారు 102 సంవత్సరాల క్రితమే గుర్తించి డేనియల్‌ జోన్స్‌తో చర్చించారు. ఈ ధ్వని ఇంగ్లీషులోని man, cat, map, bank వంటి పదాలలో వినిపిస్తున్న అచ్చు ధ్వని. కొన్ని ఇంగ్లీషు మాటలు తెలుగులోకి ప్రవేశించడంవల్ల ఈ ధ్వనికి అక్షర సంకేతం ఇవ్వవలసిన అవసరం వుంది. 'మేపు', 'మాపు', మా'పు (map))” ఈ 3 పదాలకీ అర్ధాలు వేరు.

'ఐ', 'ఔలు అచ్చులు కావు. వీటిని డిప్తాంగ్స్‌ అంటారు. తెలుగులో సంధ్యచ్చులు అని అంటున్నారు.

'ఋ' ఉచ్చారణ గురించి చాలా వివరంగా రాశాను.

'క్‌ + ఋ =కృ' 'క్‌ +ర్‌ + ఉ = క్రు. వీటిలో ఏది సంయుక్తమో ఏది ద్విత్త్వమో నాకు తెలీదు.

- అల్లంశెట్టి చంద్రశేఖర రావు 99496 05141

'తెలుగుభాష అక్షరాల/లిపి మార్పు'

'అమ్మనుడి'లో తెలుగుభాష అక్షరాల/ లిపి మార్పు' చర్చ కొంత కాలం నుంచి సాగుతున్నది. మంచిదే కాని - పాండిత్య ప్రదర్శన ఎక్కువై ప్రయోజనం తక్కువ అన్నట్లుంది. ఇప్పుడు మనం నిర్ణయాలు చేసినా, ప్రభుత్వం, అకాడమీలు, పత్రికలు అంగీకరించవు - ఆచరణకు నోచుకోవు. వెయ్యేండ్లుగా వచ్చిన లక్షల (కోట్ల?) తెలుగు గ్రంథాల గతేమిటి? అనేది మరో పెద్ద ప్రశ్న

ఈ పత్రికలో వచ్చిన ఒక నుడికారం 'పత్తిత్తు' వివరణ చూపుతున్న ఆమె పత్తిత్తా? అంటే, పతివ్రతనా? అనే అర్ధంలో వాడుక ఉంది. ఆ లేఖకుడు దీని వివరణ సరిగా ఇవ్వలేదు. దాని వివరణ ఇది - ఏ కాయనైనా పగల్చి విత్తనాల సులభంగా తాకవచ్చు. - వేరు చేయవచ్చు. కాని, ప్రత్తిగింజ అట్లా కాదు. దాని చుట్టూ దట్టంగా దూది పీచు ఆవరించి ఉంటది. ఏదీ దాన్ని సులభంగా తాకజాలదు. అంతటి భద్రత మధ్య ఉంటది ప్రత్తి విత్తనం. అందుకే పత్తిత్తు మాట వ్యాప్తికి వచ్చింది.

మరొక్క మాట - ఈ మధ్య ఒక టివి ఛానల్లో 'మన భాషలో గొప్ప ఫీల్‌ ఉంది' అని వస్తున్నది. అది చూసి ఎవరూ ఫీల్‌ కాలేదు. నేను మాత్రం చాలా ఫీల్‌ అయిన. ఫీల్‌కు తెలుగు పదమే లేదా, దొరకలేదా అని.

-డా॥ మలయశ్రీ 98665 46220


“మీరూ పిడుగులు కావాలి”

'అమ్మనుడి' జూన్‌ 2018 సంచికలో “మీరూ పిడుగులు కావాలి” అన్నది డా॥ వేదగిరి రాంబాబుగారి రచన. అందులో 'గిడుగు' వారి గురించి చిన్నపిల్లలకు చెప్పే కథగా రాసారు. చాలా సంతోషించదగిన విషయం. అయితే ఇందులో గిడుగువారి గురించి ఒక విషయం తప్పుగా చెప్పడం జరిగింది - “కాని గిడుగు రామ్మూర్తిగారు ఆంధ్రాయూనివర్సిటీ బి.ఎ.లో విశ్వవిద్యాలయ స్థాయిలో ద్వితీయశ్రేణిలో పాసయ్యారు” అని అన్నారు. ఇది సరికాదు.

గిడుగువారు బి.ఎ. పాసయ్యేసరికి ఆంధ్రాయూనివర్సిటీ ఏర్పడలేదు. అప్పుడు మనది మద్రాసు రాష్ట్రం. రాష్ర్రానికంతటికీ మద్రాసు యూనివర్సిటీ ఒక్కటే ఉంది. అటు దక్షిణాన కన్యాకుమారి నుండి ఇటు ఉత్తరాన గంజాం జిల్లా కలుపుకొని. దారుణమేమంటే వారు బి.ఎ. ద్వితీయ శ్రేణిలో పాసయ్యారని అనడం వారు మొదటి శ్రేణిలో పాసై రాష్ట్రానికంతటికి రెండవ రేంకు సాధించారు.

ఇంకొక చిన్నపొరపాటు ఏమంటే, గిడుగువారు చేపట్టిన ఉద్యమం వలన కేవలం వంద గ్రామాలు కాదు, దాదాపు నాలుగు వందల గ్రామాలు ఆంధ్రలో కలిసి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం తాలూకా అయింది.

మన తెలుగు అకాడమీ వారు 'గిడుగువారి రచనా సర్వస్వం' అనే ఒక గ్రంథం అచ్చువేస్తే దాని రెండవ భాగంగా, వేదగిరివారు 'గిడుగువారి రచనా సర్వస్వం - సవరభాషా సంబంధి' అనే బృహత్‌ గ్రంథాన్ని ప్రచురించి గిడుగువారికి ఎంతో సేవ చేసారు. వారే ఇలాంటి పొరపాట్లు చేస్తే...నాబోటి గిడుగువారి అభిమానులు ఎవరికి మొఱపెట్టుకోవాలి. ఇలా రాసినందుకు మన్నించాలి.

- కణుగుల వేంకటరావు 8830949562

అనువాదంలో తప్పు...

అమ్మనుడి, మే నెల సంచికలో... .'అక్షరాస్యత...' వ్యాసంలో ఈ కింది తప్పును సరిదిద్దటం అవసరం.

ఈ వివరాలన్నీ మన నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఈ వాక్యం చివరి పదం 'చేయాలి' అని ఉంటే బావుంటుంది.

2. పేరొందిన రచయిత్రి ముగింపు -లిపిసంస్కరణపై వచ్చిన చర్చలు చాలావాటిపై స్పందిస్తూ తార్కిక పరమైన ఆలోచనా విధానంతో చేసినవి. ఆధునిక అవసరాలకు తగినట్లుగా ఉంది. అయితే వీటన్నిటిపై సమగ్రంగా సింహావలోకనం చేస్తూ ఒక సమీక్షా వ్యాసం రావటం అవసరం.

3. ఆచార్య కె.వెంకటేశ్వర్లుగారి రచన (1912లో ప్రచురణ) 'కలోనియలిజం, ఓరియంటలిజం అండ్‌ ద ద్రవీడియన్‌ ల్యాంగ్వేజస్‌' పై ఆచార్య కె. పద్దయ్యగారి సమీక్షా వ్యాసాన్ని డా. కొంపల్లి సుందర్‌ అనువాదం చేసినది. అసలు సమీక్ష అవసరానికంటే ఎక్కువ నిడివితో బావున్నా అనువాదంలో ఒకటి రెండు తప్పులు దొర్లినట్లు నాకు కనబడినవి. ఉదా. ఆ నాటి మద్రాసు ప్రెసిడెన్సీ సెయింట్‌ ఫోర్ట్‌ జార్జి కళాశాలలో బౌద్ధిక మాంద్యం (intellectual Ferment), బౌద్ధిక మాంద్యం. బౌద్ధిక మాంద్యం అని రెండు సార్లూ తప్పుగా వాడారు.

దీనికి సరైన అనువాదం బౌద్ధిక ఉద్దీపనం అనివుండాలి. అనువాదంలో పూర్తిగా అర్థం తారుమారైంది. ఆనాడు మద్రాసులో బ్రిటిషు అధికారులు, తదితర ఆంగ్లేయ రచయితలతో మన పండితులు భుజాలు కలిపి తిరిగి చర్చలలో పాల్గొనడం వల్ల వచ్చినదే.

4 చెన్నూరి సుదర్శన్‌గారి భాషోద్యమ కథానిక 'మాతృభాష' చాలా బావుంది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

41