పుట:Ammanudi july 2018.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బట్టి, ఇంటిపేరు వ్యక్తపరుపవలసి వస్తుంది గనుక. స్త్రీ విషయంలో పై కారణాల ప్రమేయం లేదు గనుక, అది వ్యక్తీకరింపబడే అవకాశముత్పన్నం కాదు. ఉత్పన్నమైన వేళ, ఆమె ఫలానా వారి భార్య అని చెప్పబడుతుంది. ఆ వ్యవహారాలతో ప్రమేయమేర్పడే నాటికి వివాహితురాలు కాకపోతే ఫలానా వారి కుమార్తె అని వ్యవహరింపబడుతుంది. అప్పుడైనా, (ఫలానా వారి కుమార్తె అన్నపుడు) తండ్రి ఇంటి పేరు ఉట్టంకింపబడడం లేదా - అంటే, (వివాహిత అయితే భర్త ఇంటిపేరుతో) ఉట్టంకింపబడవచ్చును . అది లేఖరి విన్యాసమే తప్ప, ఉట్టంకించకపోయినా, చట్టపరమైన ఇబ్బందిలేదు. పురుషుని విషయమైనా (ఫలానా వారి కుమారుడు అని చెప్పేటప్పుడు) అంతే...

అంటే విద్యాసంబంధమైన వ్యవహారాలు, యోగ్యతా పత్రాలపై నమోదు విషయంలో మాత్రమే, ఇంటిపేరు ప్రసక్తి వస్తోందనేది స్పష్టము. ఇది వివాహత్పూర్వం, యువతీ యువకుల విషయంలో సామాన్యం. పై విధమైన వ్యవహారం లేనిచోట్ల ఈ మార్పు అనే ప్రసక్తికి ఆస్కారం లేదు అనే విషయం జ్ఞాపముంచుకోవాలి. అదే సమయంలో చట్టపరమైన ఆంక్షలు కూడ లేవని కూడా గుర్తుంచుకోవాలి. వివాహ కార్యక్రమంలో గూడ గోత్రనామానికే తప్ప, ఇంటి పేరు ప్రసక్తి లేదు సరికదా, ఒకే ఇంటి పేరున్నా (వధూవరులకు) గోత్రభేదమున్నపుడు సంబంధ బంధుత్వానికి అడ్డులేదు. మూడు తరాల నుండి, వధూవరుల కుటుంబాల మధ్య ఏవిధమైన బంధుత్వం లేనపుడు, వారు ఏకగోత్రజు లైనప్పటికి వివాహాలు గావింపవచ్చునని కూడా వెసులుబాటు వుంది. కాబట్టి ప్రాధాన్యం వహిస్తోంది. గోత్ర గృహనామాలు కాదని, జన్యు సంబంధమైన కారణాలేనని బోధపడుతోంది.

అయితే వివాహం తరువాత పురుషుడు, తన తండ్రి ఇంటి పేరుతో అంటే తనదైన 'కుటుంబనామం' తోనే వ్యవహరింపబడుతున్నాడు. కాని స్త్రీల విషయంలో అలా గాక, వివాహం తరువాత, తన తండ్రి కుటుంబనామం నుండి, భర్త కుటుంబనామంలోకి మార్చబడడం జరుగుతుంది. (అది కూడ పైన వివరించిన సమస్యల వల్లనే తప్ప సాధారణ లోక వ్యవహారంలో దాని ప్రసక్తి లేదని, అదికూడ విద్యావంతులైన స్త్రీల విషయంలో మాత్రమేనని గుర్తుంచుకోవాలి). ఇలా ఎందుకు మారాలి అనేది సమస్య. మార్చుకోవడం ఇష్టంలేని వారు, మార్పుతో అవసరం లేదనువారు (యోగ్యతాపత్రాలు మొ॥ వాటి విషయంలో) వివాహం తరువాత కూడ తమ తండ్రుల కుటుంబ నామాలతోనే లౌకిక వ్యవహారాలలో కొనసాగుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో, అలాంటి వారి విషయంలో సంఘం నుండి ఎట్టి అభ్యంతరం ఎదురుకాలేదు. నిజానికి ఈ వ్యవహారాల్లో సంఘానికి ప్రమేయమే లేదు. చట్టం కూడా దానికి ఎలాంటి ప్రాధాన్యము ఇవ్వడం లేదు. వివాహస్థితిని నిరూపించడానికి, ఇతర ఆధారాలను పరిగణనలోనికి తీసుకొంటారు తప్ప, ఇంటి పేరు మారిందా లేదా అన్న దానిని పరిగణింపరు. ఇక సమస్య అంతా భర్త నుండి, ఇతర కుటుంబసభ్యుల నుంది వత్తిడి వచ్చినపుడు, అలా మారడం ఆత్మన్యూనతగా భావింపబడుతున్నపుడు మాత్రమే ఇది ప్రసక్తమవుతోంది. ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా, ఇలా జరగవలసిందే నన్నప్రడు మాత్రమే, అలా ఎందుకు జరగాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. అందులో ఆత్మ గౌరవమనే విషయం చోటుచేసుకుంటే, అది సమస్యగా పరిణమిస్తుంది. అలా లేనపుడు ఆ సమస్యకు ఉనికియే లేదు.

మారి తీరాలి అంటున్నవారు కూడ, అది ఆచారం గనుక, అలా మారకపోతే, తమకు, తమ కుటుంబ ప్రతిపత్తికి, గౌరవానికి ఏదో భంగం కలుగుతుందనే అపోహతోనే తప్ప, ఎందుకు మారాలో స్పష్టమైన అవగాహన లేదు. ('ఎందుకు మారాలో' అనే మాట వలన, ఈ రచయితకు అలా మారితీరాలి అనే అభిప్రాయం వుందని భావింపవలదు. విషయ వివరణ కొరకు మాత్రమే ఆ పదం ఉపయోగింప వలసి వచ్చింది). అలాగే, పురుషుని విషయంలో మార్పులేనపుడు స్త్రీ విషయంలో మాత్రమే ఈ మార్పు ఎందుకుండాలి అనే వారిలో కూడ, పంతమే కనిపిస్తుంది తప్ప, ఆచారమే అయినా, అది ఎందుకు అలా ఏర్పడిందోననే దానిపై స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కనుపింవదు. ఇలా అనడానికి కారణాలున్నాయి. అవేమిటో ముందు చూసి, తరువాత ప్రధాన విషయానికి వద్దాము.

విద్యావంతురాండ్రు కొందరైనా, తమపేరు తరువాత, భర్తల ఇంటి పేర్లు చేర్చుకుంటున్న వారు గలరనేది నిర్వివాదం. ఇలాంటి వారిలో ఇంటి పేరు ఎందుకు మారాలి అనేవారు కూడా ఉండి ఉండవచ్చు. అలాగే మార్చుకున్నవారు కూడా ఉండి వుండవచ్చు. వారు పై రెంటిలో ఏ వర్గానికి చెందినా, కావలసిన విషయం, వివాహితులు తమ భర్తల పేర్లు, తమ పేర్లకు ఎందుకు జోడిస్తున్నారనేది. మీదు మిక్కిలి అది నాగరకతగాను, సంస్కారానికి ప్రతీకగాను భావింపబడుతోంది. (అందరి విషయంగాదు. అలా భావించే వారి విషయం మాట) ఇది మన తెలుగు సమాజంలో స్థూలంగా స్వాతంత్ర్యానంతరం ప్రారంభమైంది! అక్షరాస్యత పెరగడం, ఇతర ప్రాంతాలతో, అక్కడి ఆచార వ్యవహారాలతో సంసర్గం ఏర్పడడం కారణంగా ఇది ప్రారంభమైంది. ముఖ్యంగా రచయిత్రులు దీనిని పాటిస్తున్నట్లు కనుపిస్తుంది. పై కారణాలు దీనికి మూలం. కాగా ఇది కేవలం అవగాహనా లోపం వలన జనించిన అనుకరణ మీది మోజుతో చోటు చేసుకుంది. దీనికి గల కారణాలు. పాశ్చాత్య ప్రపంచం లోను, ఉత్తర భారతదేశంలోను, దక్షిణాదిలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోను, మన అనుసరణకు భిన్నంగా, కుటుంబనామాలు వ్యక్తుల పేర్ల చివర వుంటాయి. ఉదా : విలియం వర్డ్స్‌ వర్త్‌, జాన్‌ ఫిట్జరాల్డ్‌ కెనడి, మొరార్జీదేశాయి, వల్లభభాయిపటేల్, సుబ్రహ్మణ్యం పిళ్ళ, శంకరన్‌ నంబూద్రి, వీనిలో వర్డ్స్‌ వర్త్‌, కెనడి, దేశాయి, పటేల్‌, పిళ్ళ, నంబూద్రి అనేవి ఆయా వ్యక్తుల కుటుంబ నామాలు. కాని వాటిని వ్యక్తి నామాల్లోని భాగంగా పరిగణించి, ఇక్కడ తమ భర్తల పేర్లు చేర్చుకోవడం జరిగింది. అన్ని సందర్భాల్లోను ఇలాగే జరగకపోయినా, ఈ భావనే అలా చేయడానికి ప్రోత్సహించింది. అలా తమ భర్తలపేర్లను తమ పేర్ల చివర చేర్చుకున్న స్రీలు, తమ ఇంటిపేర్లను అలాగే ఉంచుకున్నారంటే దీనిని అవగాహనాలోపంగా తప్ప ఎలా పరిగణించాలి! వాదానికి అలా కాదని చెప్పవచ్చు. కాని సమమైన ఆలోచనలతో విచారిస్తే సత్యం బోధపడకపోదు.

ఇది ఇలాంటిదైతే, కొందరు, భర్తల ఇంటి పేరు లోనికి ఎందుకు మారాలి అన్నవారు, ఒకటి రెండు సూచనలు గావించారు. అది 1) తమ వివాహత్పూర్వపు ఇంటి పేర్లతోనే - అంటే, పుట్టింటి కుటుంబనామం

వినియోగించే కొద్దీ భాష వికసిస్తుంది

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

39