పుట:Ammanudi july 2018.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'విజ్ఞాన సర్వస్వం' కొమర్రాజు లక్ష్మణరావు

“లక్ష్మణరావుగారి వ్రతిభను అంచనా వేయాలంటే హిమవత్పర్వత శ్రేణుల భౌగోళిక న్వరూప నిర్ణయం చేయడం వంటిదే” - అడివి బాపిరాజు

చరిత్రకారుడుగా, పరిశోధకుడుగా, భాషా సేవకుడుగా, సాహితీవేత్తగా, సంఘసేవకుడుగా, మేధావిగా, పండితుడుగా, బహుభాషా కోవిధుడుగా, ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించిన గొప్ప సాహితీ సంపన్నులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారు (18-5-1877 - 13-7-1923). తెలుగుదేశంలో పుట్టి రెండు దశాబ్దాలు మహారాష్ట్రంలో పెరిగి, తెలుగులో అనేక ఉత్తమ సంస్థల్ని నిర్మించి, సాహిత్యానికీ, భాషకూ, సామాజాభివృద్ధికీ, కృషి చేసిన మహానుభావుడు.

కొమర్రాజువారు 1877 మే 18వ తేదిన కృష్ణా జిల్లా నందిగామ తాలూక పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు. గంగమ్మ వేంకటప్పయగార్లు వీరి తల్లిదండ్రులు. లక్ష్మణరావుగారు రెండేళ్ళ వయస్సులో వున్నపుడే తండ్రి చనిపోయారు. ఆ కారణంగా తన సవతి సోదరుడైన శంకరరావుగారి వద్ద కొంతకాలం వున్నారు. వీరు ప్రాథమికవిద్యను భువనగిరిలో పూర్తి చేశారు. వీరి సోదరి అచ్చమాంబను నాగపూర్లో ఇంజనీర్‌గా పనిచేసే, వారి మేనమామ భండారు మాధవరావుకి ఇచ్చి వివాహం చేశారు. లక్ష్మణరావుగారు నాగపూర్‌లో మేనమామ ఇంటిలో వుంటూ మాథ్యమిక విద్యను, ఉన్నత విద్యను అభ్యసించారు.

నాగపూరులోని మారిష్‌ కాలేజీలో బి.ఏ. ఆనర్స్‌ చదువుకున్నారు. ఎఫ్‌. ఎల్‌ కూడా పూర్తి చేశారు. బి. ఏ. లో పాళిభాషను అభిమానంగా తీసుకున్నారు. ఆ భాషలో ఉత్తీర్ణులయిన వారిలో ప్రథముడు మా గురువుగారే అని మల్లంపల్లివారు అన్నారు. ప్రైవేట్‌గా ఎమ్‌.ఏ. కలకత్తా విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు.

మహారాష్ట్రంలో వుండడం వల్ల ఆ రాష్ట్ర సంస్కృతి ప్రభావం తనపై పడింది. ఆయన కట్టూ బొట్టూ అన్నీ మారాయి. ఎంతగా పడిందంటే ఎప్పడూ కోటు, ఉత్తరీయం, తలపాగా, మీసాలు. ఇవన్నీ వుండేవి. వీరు సంస్కృతం, హిందీ భాషల్ని అధ్యయనం చేశారు. బెంగాలీ, గుజరాతీ, తమిళం, కన్నడభాషల్లో వీరికి పరిచయం వుంది. మహారాష్ట్రంలో వుండేటప్పుడు రావుగారు 'సమాచార్‌, వివిధ, విజ్ఞాన విస్తార' అనే పత్రికలకు సంపాదకత్వం వహించారు. 'కేసరి', 'మహారాష్ట్ర', మొదలైన పత్రికల్లో వ్యాసాలు రాశారు. తాను విద్యాభ్యాసం చేసిన మరాఠీ భాషలోనే పరిశోధనా వ్యాసంగం ప్రారంభించారు. మహారాష్ట్రంలో వున్నప్పుడే, విజ్ఞానశాస్త్రాల వ్యాప్తి ప్రాముఖ్యాన్ని రావుగారు గుర్తించారు.

మహారాష్ట్రలో వున్నప్పటికీ తెలుగు భాషా సాహిత్యాలపై వీరికి పట్టుసడలలేదు. సోదరి అచ్చమాంబ తెలుగు గ్రంథాల్ని పత్రికల్ని తెప్పించుకొని చదువుతుండేది. లక్ష్మణరావుగారుకూడా ఆ గ్రంథాల్ని పత్రికల్ని చదివేవారు. అచ్చమాంబ, లక్ష్మణరావు ఇద్దరూ రాసిన వ్యాసాలు తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాయసం వేంకట శివుడు నడిపిన 'తెలుగు జనని' వత్రికలో వీరి వ్యాసాలు వెలువడ్డాయి. ఆ పత్రికలోనే కొమర్రాజుగారి “విశ్వం యొక్క విరాట్‌ స్వరూపం”, “విశ్వం యొక్క బాల్యస్వరూపం” మొదలైన విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన వ్యాసాలు ముద్రించబడ్డాయి.

నాగపూర్‌లో వుండగానే తెలుగులో చరిత్ర గ్రంథాలు లేని లోపాన్ని పూరించడానికి “శివాజీ చరిత్ర” రాశారు. వీరు రాసిన “శివాజీ చరిత్ర” ప్రముఖుల ప్రశంసల్ని అందుకుంది. “ఆంధ్రభాష యందు చరిత్ర గ్రంథంబు లత్యల్పంబుగనున్నవి. కానచేతనైనంత వరకు మాతృభాషా సేవ చేయవలెననిన నిచ్ఛతోనే చరిత్ర గ్రంథంబు రాసినాడ, శక్తివంచనలేక ఇక ముందును నిటులనే భాషా సేవ చేయవలయునని నిచ్చగలవాడను” అని రావుగారు అన్నారు.

లక్ష్మణరావుగారు బెజవాడ తాలూకాకు చెందిన కంకిపాడు కరణం మల్లికార్జునరావు కుమార్తె కోటమాంబను పెళ్ళిచేసుకున్నారు. వీరికి అచ్చమాంబ, వినాయకరావు ఇద్దరు పిల్లలు. అచ్చమాంబ డాక్టర్‌గా, సంఘసేవకురాలుగా కీర్తి గడించారు. వినాయకరావు కొన్ని రచనలు చేశారు. కొంతకాలం ప్రెస్‌ కూడా నడిపారు.

నాగపూర్‌ నుంచి తన స్వస్థలం మునగాల చేరుకున్నారు. మునగాల రాజాతో తనకు వున్న నంబంధాల వల్ల లక్ష్మణరావుగారు మునగాలరాజాకు దివానుగా నడిగూడెంలో చేరారు. సంస్థాన వ్యవహారాలు చూసేవారు. మునగాల ఎస్టేట్‌కు సంబంధించిన కోర్టు వ్యవహారాలకోసం 1905 లో లక్ష్మణరావుగారు కుటుంబాన్ని మద్రాస్‌కు మార్చారు. మద్రాస్‌లో నివాసం వున్నప్పడే “దక్షిణ భారత సంఘ సంస్మరణ సమాజం” సభ్యులుగా చేరారు. ఈ సంఘాన్ని ఎస్‌. శ్రీనివాస అయ్యంగారు స్థాపించారు. వీరు సంస్కరణవాది. హరిజన విద్యకొరకు ఏర్పాటు చేసిన రాత్రి పాఠశాలలో లక్ష్మణరావుగారు పనిచేశారు కూడా.

విజ్ఞానశాస్త్రాలన్నీ సంస్కృతం, ఆంగ్లం భాషల్లో వుండడం వల్ల ఈ భాషలు తెలియని వారికి కూడా విజ్ఞాన శాస్తం అందుబాటులో

32

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018