పుట:Ammanudi july 2018.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నారు. కాన్సర్‌కు ఏం చేయాలని అడిగితే సూదిమందు వేయాలన్నారు. అయితే అది ఎక్కువ రోజులు బతికే లక్షణాలు లేవని అన్నాడు. అది ఇప్పటిదాకా మా కోసం కష్టపడింది. దాన్ని అలాగే వదిలి వేయడానికి మనసొప్పలేదు. చనిపోయే వరకూ మాతోనే ఉండనీ అని దాని బాగోగులు చూసుకుంటూ వచ్చాం.

బెంగళూరు నుంచి జాతికుక్కను తీసుకుని రావటం :

ఒకసారి సంచారుల సమావేశానికి బెంగళూరుకు శికారి రాముతోపాటు వెళ్ళాను. అదేదో స్థలంలో మీటింగ్‌ పెట్టారు. ఆ స్థలం ఎక్కడో గుర్తులేదు. భాస్కరదాసు, బాల గురుమూర్తి, మేత్రి అందరూ మీటింగ్‌లో ఉన్నారు. వాళ్ళంతా ఏమేమో మాట్లాడుతున్నారు. నాకు ఒక్కటీ అర్ధం కాలేదు. మధ్యాహ్నమైనా మీటింగ్‌ ముగియలేదు. నాకు విసుగు వస్తూ వుంది. ఏం చేయాల్రా నాయనా అని మీటింగ్‌ బయటికి వచ్చాను. అటు ఇటు తిరుగసాగాను. అయినా పొద్దుపోవడం లేదు. అలా తిరుగుతూ ఒక చోట నిలబడ్డాను.

అక్కడే ఒక పాత డొక్కు జీపు తన ఒక చక్రంలో గాలి పోగొట్టుకుని పడుకునివుంది. జీపు ప్రాణం పోగొట్టుకుందని అనుకుంటూ నిలబడ్డాను. అయితే ఆ ప్రాణం పోగొట్టుకున్న జీపులోంచి కుంయ్‌ కుంయ్‌మంటూ శబ్దం రాసాగింది. ఏమిటా అని చూస్తే నాలుగైదు కుక్కపిల్లలు. ఇంకా కళ్ళు సైతం తెరవలేదు. వాటి తల్లి ఎక్కడికి పోయిందో తెలియదు. ఆ కుక్కలను చూస్తూ చాలాసేపు నిలబడ్డాను.

అంతలో ఎవరో ఒక సూటుబూటు వేసుకున్న వ్యక్తి వచ్చాడు. “ఏం చేస్తున్నావు?” అని అడిగాడు.

“కుక్కపిల్లలను చూస్తున్నాను” అన్నాను.

“కుక్కలంటే నీకు ఇష్టమా?” అని అన్నాడు.

నేను చిన్నపిల్లవాడిలా “అవునయ్యా” అన్నాను.

అప్పుడు ఆ మనిషి “నీకు ఎన్ని పిల్లలు కావాలో అన్ని తీసుకునిపో" అన్నాడు.

సిటి జనం కుక్కలను అమ్ముతారని తెలుసు. ఆ కారణంగా, “అయ్యా, నా దగ్గర డబ్బులు లేవు” అన్నాను.

ఆ మనిషి నవ్వి “డబ్బులు వద్దు, నీకు ఇష్టమైన కుక్కపిల్లల్ని తీసుకునివెళ్ళు” అన్నాడు.

నాకు కావాల్సింది అంతే. అక్కడే దగ్గర్లో ఉన్న మెడికల్‌ షాపుకు వెళ్ళి ఒక ఖాళీ అట్టపెట్టె తెచ్చాను. అక్కడక్కడ దానికి చిల్లులు వేసి ఒక ఆడకుక్కపిల్లను, ఒక మగకుక్క పిల్లను పెట్టెలో జాగ్రత్త పరిచాను. సాయంకాలం రాము వెంబడి నేరుగా ఊరికి వచ్చాను. “ఎందుకన్నా మన ఊళ్ళో కుక్క దొరకదా? ఇక్కడి నుంచి కుక్క పిల్లల్ని తీసుకుని పోతున్నావు?” అని రాము తమాషా చేశాడు. అవి పాలు తాగలేదు. చివరికి దూదితో పాలు పట్టాను. ఇప్పుడు బాగా ఎత్తుగా పెరిగి చురుగ్గా తయారయ్యాయి. వేటకు పోయినప్పుడంతా పిల్చుకునిపోయి వేటాడటం అలవాటు చేశాను.

ఆ రెండు కుక్కలకు ముసలప్ప, ముసలమ్మ అని పేరు పెట్టాను !

(ఇంకా వుంది)

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు

“మా ఇంటికి ఎదురుగా దక్షిణోత్తరంగా సాగిపోయే రాచబాటను ది గ్రాండ్‌ నార్తరన్‌ ట్రంక్‌ రోడ్‌ అనేవారు. మా ఇంటికి కుడివైపున (ఉత్తరం) ఉండే దివానుగార్ల బంగళాలలో మొదటిదానిలో రఘుపతి వేంకటరత్నం నాయుడు గారుండేవారు. ఆయన వీరేశలింగంగారితో పాటు, సంఘ సంస్కరణలోను, హరిజనోద్ధరణ కోసమూ పాటుపడిన ఆధునికాంధ్ర నిర్మాతలలో ఒకరు. బ్రహ్మసమాజానికీ, మహరాజా వారి కుమారులకూ, కుమార్తెలకూ గురువుగాను, కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాల ప్రిన్సిపాలుగాను, ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయంలో కులపతిగానూ పనిచేసి, కృతకృత్యులై. నిరంతర దైవధ్యాన నిరతులై దీనజనోద్ధరణకు దీక్షాదక్షులై బ్రహ్మర్షి అనిపించుకున్న మహనీయుడు!

హేమచంద్ర సర్కారు వంటి రాష్ట్రేతర అతిథులు మహారాజావారి ఆహ్వానంపై పిఠాపురం వచ్చినపుడు, నాయుడుగారితో బస చేసి, మా ఇంటి ముందు నుంచి పోయే గుర్రపు సార్టులో కనపడేవారు.

- కీ.శే. బాలాంత్రపు రజనీకాంతారావు

5, ఆగస్టు 07, ఆదివారం 'ఆంధ్రప్రభ' - 'రజనీ భావతరంగాలు' నుండి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

31