పుట:Ammanudi july 2018.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోయాను. నా సైకిల్‌ మోటర్‌ మీద ఇద్దరం వెళ్ళాం. మునిసిపాలిటి వాళ్ళను కలిసి, మాట్లాడి, మామ ఇంటికి వెళ్ళి భోజనం చేసి, తిరిగి కంప్లికి తిరిగి రావాలి. తెక్కలకోట దాటి వస్తుంటే చెరువుగట్టు మీద నా సైకిల్‌ మోటర్‌ ముందు టైరు పంక్చర్‌ ఆయ్యింది. పంక్చర్‌ వేయించుకోవడానికి ముందు ట్యూబ్‌ నెక్‌ను లోపలికి తోస్తూ మునివేళ్ళ మీద కూర్చున్నాను. నా అల్లుడు ఉచ్చపోయడానికి పక్కకు వెళ్ళాడు. అది ఏ మాయలో వచ్చాడో ఏం కథో ఒక కుర్రవాడు చాలా వేగంతో సైకిల్‌ మోటర్‌ నడుపుకుంటూ వచ్చాడు. ఇదేదో సౌండు వస్తుందని అనుకునేంతలో సైకిల్‌మోటర్‌ను నా కాలికి తగిలిస్తూ బారెడు దూరం ముందుకుపోయి సైకిల్‌ మోటర్‌ను తన ఒంటిమీద వేసుకుని పడి పోయాడు.

అప్పట్లో నాకు ఎలాంటి నొప్పి కనిపించలేదు. ఆ కుర్రవాడు బతికాడా అని చూడటానికి నా అల్లుడు వెళ్ళాడు. వాడు వెళ్ళి బండి పైకెత్తి స్టాండు వేశాడు. కుర్రవాడు స్పృహ తప్పివున్నాడు. నా బండి బ్యాగులోంచి వాటర్‌ బాటిల్‌ తీసి కుర్రవాడి ముఖం మీద నీళ్ళు చిలకరించాను. కుర్రవాడు హడావుడిగా లేచి, “నేను యాక్సిడెంట్‌ చేయలేదు... నేను యాక్సిడెంట్‌ చేయలేదు” అని అరవసాగాడు.

ఇటు నా కాలిలో నెమ్మదిగా వాపు కనిపించింది. నాకు కళ్ళు మసకబారుతున్నట్టు అనిపించింది. అలాగే బండి స్టార్ట్‌చేసి పంక్చర్‌ షావుకు వచ్చాం. కుర్రవాడిని పిల్చుకుని నా అల్లుడు వచ్చాడు. పంక్చర్‌ షాపు చేరుకునేంతలో నాకు నడవటానికి సాధ్యం కానంత నొప్పి కనిపించసాగింది. నేను వద్దన్నా కుర్రవాడి నుంచి జనం అయిదువేలు ఇప్పించారు.

ఎలాగో కంప్లి చేరాను. కంప్లి చేరగానే నేరుగా ఎముకల డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాను.

దాక్టర్‌ ఎక్స్‌రే తీసి “కాలు విరిగింది కట్టు కట్టాలి” అన్నారు.

నా దగ్గరున్న డబ్బులో మూడున్నర వేలు డాక్టర్‌కు ఇచ్చాను.

కాలుకు కట్టు వేశారు. కట్టు వేయించుకుని ఇంటికి వచ్చాను. ఇద్దరు భార్యలూ కంగారు పడ్డారు. మా వీధి వాళ్ళంతా వచ్చి చూసి పోయారు. కొందరు ఈ విధంగా కట్టువేస్తే కాలు సరిగ్గా అతుక్కోదు, పుత్తూరు డాక్టర్‌ దగ్గర కట్టు వేయిస్తే మంచిదని చెప్పారు. ఆరోజు ఉదయమే గంగావతిలోని పుత్తూరు డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాం. ఆ మహానుభావుడు కంప్లి డాక్టర్‌ వేసిన కట్టును తీసి కొత్త కట్టు వేశాడు. నాకు భరించరానంత హింస. అతను ఎనిమిది వేలు లాక్కున్నాడు. ఏదో విధంగా డబ్బు సమకూర్చి ఇచ్చాను.

ఇది జరిగిన రెండవ రోజున శికారి రాము, కుమార్‌సార్‌లు నన్ను పలకరించడానికి వచ్చారు. శికారి రాము తమ కళాతండకు సభ్యులకు పంచడానికి దాచిపెట్టిన పదివేల రూపాయలు నాకు ఇచ్చాడు. కుమార్‌ సార్‌ అయిదువేలు ఇచ్చారు. ఏదో విధంగా మూడు నెలలు వనవాసం అనుభవించాను. అయినా కాలు కుదురుకోలేదు. ఒక రోజు కుమార్‌సార్‌ తమ డాక్టర్‌ అల్లుడి దగ్గరికి పిల్చుకునిపోయారు. ఆయన ఎక్స్‌రే తీయించి నాకు వేరే మందులు, మాత్రలు ఇచ్చారు. అవి తీసుకున్న తరువాత కొంత కోలుకున్నాను. కుమార్‌సార్‌కు చాలా రోజుల తరువాత డబ్బు తిరిగి ఇచ్చాను. రామణ్ణకు ఇంకా పూర్తిగా డబ్బు తిరిగి ఇవ్వడానికి సాధ్యం కాలేదు. ఇంకా కొంత ఇవ్వాలి. వారి సహాయం ఎలా మరవగలను?

శునక పురాణం :

ధర్మరాజుకు, శునకానికీ బంధుత్వం ఏ విధమైందో; అదే విధంగా సంచారులకు, కుక్కలకూ విడదీయలేని బంధుత్వం ఉంది. మాకు పశువులు లేకున్నా జీవితం సాగిపోతుంది. అయితే కుక్కలు లేకుండా మా జీవితాలు సాగవు. భిక్షం పుట్టని కాలంలో మాకు పొట్టలు నింపేవి కుక్కలే ! ఎక్కడా భిక్ష దొరకనపుడు కుక్కలను వెంటబెట్టుకుని వేటకు వెళతాం. చిన్నచిన్న జంతువులను తాము తిని కడుపు నింపుకుంటే నక్క కుందేలు, ఉడుము మొదలైన జంతువుల జాడలను పసిగట్టి వాటిని సులభంగా వేటాడటానికి మాకు సహాయం చేసేవి ఈ కుక్కలే?

అందువల్ల మాకూ కుక్కలకూ విడదీయలేని సంబంధం ఉంది.

ఒకసారి ప్రేమతో ఒక ఆడకుక్కను పెంచాను. చాలా చక్కగా, చురుగ్గా వేటాడేది. దానికి ఏదో రోగం తగిలింది. ఆ రోగంతో చాలా బాధపడేది. దాని కష్టాన్ని చూడలేక పోయేవాడిని. బాధతో విలవిల్లాడేది. ఆ కుక్కను ఎక్కడ చూపించాలో తెలియదు. మాకు తెలిసిన మందులు, మూలికలు మొదలైనవి వాడి సేవలు చేశాను. అయితే కుక్కకు నయం కాలేదు. ఎవరో ఒకరు పశువుల డాక్టర్‌కు చూపించమని సలహా ఇచ్చారు. కుక్కను డాక్టర్‌ దగ్గరికి తీసుకునిపోయాను. ఆయన దాన్ని చూసి దానికి ఏదో రోగం వచ్చిందని సూది మందు వేయాలని అన్నారు. సరే వేయండన్నాను. ఆయన సూది వేసి మందులు ఇచ్చారు. సూదివేసి మందులు ఇచ్చినందుకు మూడువేలు తీసుకున్నాడు. ఏం చేయగలను? అలాంటి వేటకుక్కను పోగొట్టుకోవడానికి మనసొప్పలేదు. డాక్టర్‌ అడిగినంత డబ్బు ఇచ్చాను.

అయినా కుక్క ఎక్కువ రోజులు బతక లేదు

కుక్కచనిపోయిన రోజు ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు.

నా జీవితంలో ఎన్నో కుక్కలను పెంచాను.

అయితే అలాంటి కుక్క మళ్ళీ దొరక లేదు!

బాలింత రోగంతో కుక్క చనిపోవటం :

ఆ కుక్కచనిపోయిన తరువాత మరొక ఆడకుక్కను తెచ్చాను. వేటకు ఆ కుక్కనే వెంటబెట్టుకుని పోయేవాళ్ళం. మేము వేటకు వెళితే ఎనిమిది, పదిమంది కలిసి వెళ్ళేవాళ్ళం. వేటలో దొరికిన జంతు మాంసాన్ని తలాకింత అని భాగాలు వేసుకునేవాళ్ళం. అప్పుడు వలకు ఒక భాగం, కుక్కకూ ఒక భాగం అని పక్కకు తీసిపెడతాం. అటు తరువాత ఆ కుక్క ఒక సంవత్సరానికి ఎదకు వచ్చింది. ఊర కుక్కల పీడ ఎక్కువైంది. ఇది కూడు తినితిని బాగా బలిసింది. మగకుక్కలను వెదుక్కుంటూ తిరిగేది. ఇలా మగవాటి వెనుక తిరిగి గర్భం దాల్చింది. నాలుగు పిల్లలను ఈనింది.

అయితే అది పిల్లలను ఈనిన కొద్ది రోజులకే దాని వెనుక కాళ్ళల్లో వాపు వచ్చింది. ఇతరులకు చూపిస్తే అది బాలింత రోగం అన్నారు. ఎంత చాకిరి చేసినా కుక్క మాకు దక్కలేదు. తల్లి తల్లితోపాటు దాని పిల్లలు చనిపోయాయి.

మరొక కుక్కను కూడా సాకాను. అది కూడా ఆడకుక్కనే. అయితే ఆ కుక్క ఒక్క పిల్లను ఈనలేదు. దాని వెనుక భాగమంతా ఉబ్బి పోయివుంది. డాక్టర్‌కు చూపిస్తే దానికి కాన్సర్‌

30

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018