పుట:Ammanudi july 2018.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుండాలన్న మంచి ఉద్దేశంతో “విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి"ని 1906లో హైదరాబాద్‌లో స్థాపించారు. మునగాలరాజువారి ఇంట్లో లక్ష్మణరావు, హరి సర్వోత్తమరావు, రావిచెట్ల రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైనవారు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సంపాదకుడుగా లక్ష్మణరావుగారు, కార్యదర్శిగా హరిసర్వోత్తమరావుగారు నియమితులయ్యారు. హైదరాబాద్‌ రెసిడెన్సీ బజార్లో ఈ మండలి కార్యాలయం వుండేది. మంచి లక్ష్యాలతో, ఆశయాలతో ఈ మండలి ప్రారంభమైంది. ప్రజల్ని చైతన్యవంతం చేయడం, స్వాతంత్రోద్యమం వైపు ప్రజల్ని నడిపించడం, అస్పృశ్యతా నివారణ, హరిజనాభివృద్ధి, స్త్రీవిద్య, స్త్రీ స్వాతంత్ర్యం, విజ్ఞాన విస్తరణ లాంటి ముఖ్యమైన లక్ష్యాలతో ఈ మండలి ముందుకు వెళ్ళాలని నిర్ణయించారు. అసలు విషయం ఏమంటే ఈ మండలి అభివృద్ధికి ఎవరూ ప్రతిఫలం ఆశించకూడదని ముక్తకంఠంతో అందరూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మండలి మొదటి గ్రంథంగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన “అబ్రహం లింకన్‌ చరిత్ర"ను ముద్రించింది. తర్వాత లక్ష్మణ రావుగారి “హిందూ మహాయుగం” ప్రచురించారు. డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతి-జీవశాస్త్రం, వేలాల సుబ్బారావు-రాణీ సంయుక్త, కొమర్రాజువారి-మహమ్మదీయ మహాయుగం, మంత్రిప్రగడ సాంబశివ రావు-పదార్ధవిజ్ఞానశాస్త్రం, విశ్వనాథశర్మ-రసాయన శాస్త్రం, చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర, భోగరాజు నారాయణమూర్తి-విమలాదేవి ఇలా అనేక గ్రంథాలు ఈ మండలి ద్వారా ప్రచురించ బడ్డాయి. తర్వాత ప్రకృతి శాస్త్రగ్రంథాలు వెలువడ్డాయి. ఉత్తను గ్రంథాల్ని మండలి ప్రచురించి, తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసింది.

లక్ష్మణరావుగారు 1910లో "విజ్ఞానచంద్రికాపరిషత్‌"ను స్థాపించారు. రచనలపోటీ పెట్టారు. ఆ పోటీలో నెగ్గినవారి గ్రంథాల్ని గ్రంథమండలి ప్రచురించింది. 1912 నుండి మండలి ప్రచురణలే పాఠ్య పఠనీయ గ్రంథాలుగా పరీక్షలు నిర్వహించటం ప్రారంభించారు. మొదటి బహుమతి పొందిన వారికి 116/- రూపాయలు మరియు బంగారుపతకం. రెండో స్థానం పొందిన వారికి యోగ్యతాపత్రం ఇచ్చారు. నాడు బహుమతి పొందినవారు కాంచనపల్లి కనకాంబ, పెంద్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆదుర్తి భాస్కరమ్మ, నిడుదవోలు వేంకటరావుగార్లు.

ఆంగ్లంలోని బ్రిటీష్‌ ఎన్సైక్లోపీడియా పద్ధతిలో ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం నిర్మాణం చేపట్టాలని రావుగారు సంకల్పించారు. 1915లో తెలుగు విజ్ఞాన సర్వస్వం రాయాలని పూనుకున్నారు. మూడు సంపుటాలు వెలువరించారు. వీరు ఈ మూడు సంపుటాల్లో విలువైన వ్యాసాల్ని రాశారు. భాషవిషయాల వ్యాసాలు 11, గణిత శాస్త్ర విషయాలు 2, ధర్మశాస్త్ర విషయాలు 9, జ్యోతిశ్శాస్త్ర విషయం 1, చరిత్రకు సంబంధించిన వ్యాసాలు 7, ప్రకృతి శాస్త్ర విషయాలు 2, కళా విషయం 1, రాజకీయ విషయం 11, తర్మశాస్త్ర విషయం 1, మొదలైన వ్యాసాలు ఆయా సంపుటాల్లో చోటు చేసుకున్నాయి. కొమర్రాజువారి ప్రతిభకు ప్రతిబింబం “విజ్ఞాన సర్వస్వం”.

ఇవి కాక రావుగారు అద్వైతం, అష్టాదశ పురాణాలు, పాణిని అష్టాధ్యాయి, అలంకారాలు, శృంగారం-పూర్వ లాక్షణికులు, అభిజ్ఞాన శాకుంతలం, అచ్చతెలుగు, అధర్వణవేదం మొదలగు వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాల్ని “లక్ష్మణ రాయ వ్యాసావళి” అనే పేరుతో రెండు భాగాలుగా వెలువడ్డాయి. మొదటి భాగంలో 17, రెండో భాగంలో 5 వ్యాసాలు వున్నాయి. ఇందులోని కొన్ని వ్యాసాలు విజ్ఞాన సర్వస్వంలో కూడా వచ్చాయి.

లక్ష్మణరావుగారు, కాశీనాథుని నాగేశ్వరరావుగారు మంచి మిత్రులు. విజ్ఞాన సర్వస్వాన్ని నాగేశ్వరరావుగారే ప్రచురించారు. వారిద్దరి స్నేహానికి చిహ్నంగా విజ్ఞాన సర్వస్వం సహృదయ పాఠకుల ముందుకు వచ్చింది. విజ్ఞాన సర్వస్వం అంటే కొమర్రాజు లక్ష్మణ రావు, కొమర్రాజు లక్ష్మణరావు అంటే విజ్ఞానసర్వస్వం అనే పేరు లోకంలో స్థిరపడింది.

కొమగ్రాజువారు పరిశోధనా రంగంలో చెప్పకోదరగ్గ కృషి చేశారు. చరిత్ర, శాసనాలు, భాష, సాహిత్యం మొదలైన విషయాల్లో చాలాలోతుగా, నిశితంగా, ప్రామాణికంగా పరిశోధన చేశారు. ఇక విజ్ఞాన సర్వస్వ నిర్మాణం గూర్చి చెప్పనక్కరలేదు. రావుగారి రచనల్లో పరిశోధన దండిగా వుంది. విజ్ఞాన సర్వస్వంలోని ఆయన వ్యాసాలన్నీ పరిశోధన ఫలితాలే కానీ, అనుసరణలు, అనువాదాలు కావు. కొమర్రాజువారు పరిశోధనలో పరిపక్వం చెంది, పరాకాష్టకు చేరుకున్నారు.

నాగపూర్‌లో మెట్రిక్యులేషన్‌ చదువుతున్నపుడు ఒక ముసలి డాక్టర్‌ చిన్నపిల్లను పెళ్ళాడిన విషయాన్ని ఇతివృత్తంగా తీసుకొని “వృద్దభర్త-పడుచు భార్య” అనే ప్రహసనం రాశారు. ఈ ప్రహసనం మహారాష్ట్ర ప్రాంతంలో పెద్ద సంచలనాన్ని కలిగించింది. ఎఫ్‌.ఎ. చదువుచుండగా భార్య వియోగాన్ని గూర్చి మరాఠీ భాషలో “వియోగ గీతి” అనే పేరుతో గేయాన్ని రాశారు. అందులోని అనుభూతి సహజం గా వుండడం వల్ల చిన్నతనంలోనే భార్య వియోగం కలిగిందని కొందరు ఓదార్చడానికి ఇంటికి వచ్చారు. దీన్ని బట్టి ఆయన సృజనాత్మక సాహిత్య సృష్టి ఎలా వుంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో వేరే పేర్లతో రావుగారు కథలు రాశారు. “క” రామానుజరావు అనే పేరుతో 'ఆంధ్ర పత్రిక" మొదటి ఉగాది సంచికలో “ఏబదివేల బేరము” అనే కథ అచ్చు అయింది. 'సావిత్రి' పత్రికలో “పుల్చాన్‌ బేగం”అనే కథ వెలువడింది.

రావుగారి గ్రంథాల్లోనూ, వ్యాసాల్లోనూ చాలా స్పష్టంగా పరిపూర్ణత, సాధికారిత, సప్రమాణత అనే మూడు లక్షణాలు కన్పిస్తాయి. రామాయణంలోని "పంచవటి” స్థల నిర్ణయం గూర్చి పండిత లోకంలో పెద్దచర్చ జరిగింది. వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయి. రావుగారు భద్రాచలం సమీపంలోని పర్ణశాలయే "వంచవటి" అని నిర్ధారించారు. అందరూ శభాష్‌ అన్నారు. వీరు రాసిన ఏకశిలా నగరము 'ఓరుగల్లే, చాళుక్యులు దాక్షిణాత్యులే, కృష్ణరాయలు నిదాన కాలము, యుద్దమల్లుని బెజవాడ శాసనం, త్రిలింగము నుండి తెలుగు పుట్టేనా లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టేనా, మొదలైన వ్యాసాలు ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్నాయి.

రావుగారు విద్యాభివృద్ధి పట్ల వితంతు పునర్వివాహాల పట్ల స్త్రీ స్వాతంత్ర్యంపట్ల ఎక్కువగా మొగ్గు చూపేవారు. తన కుమార్తెను యుక్తవయస్సు రాకముందే పెళ్ళి చేయాలన్న తన తల్లి మాటల్ని వ్యతిరేకించారు. అందుకే తల్లి కోపంతో ఇల్లువదలి కాశీ వెళ్ళిపోయింది. అయినా రావుగారు కూతురుకి చిన్నతనంలో పెళ్ళి చేయలేదు. అంతేకాదు కూతురిని విదేశాలకు చదువుకోసం పంపారు. తన రెండో మేనమామ గారిని వితంతు వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించి అంతా తానే దగ్గర వుండి పెళ్ళి చేసిన సంఘ సేవకులు లక్ష్మణరావుగారు. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి. జూలై 2018 33