పుట:Ammanudi july 2018.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కట్టెలు ఇచ్చారు. మా ఇంట్లో అయిదు లీటర్ల కిరసనాయిల్‌ ఉంది. తెచ్చి వారికి ఇచ్చాను. మొత్తం చందా సొమ్ము అయిదువేల రూపాయలు పోగయ్యాయి. మొత్తం సొమ్ము వాళ్ళకే ఇచ్చాను.

అన్ని సమకూరాయి. అయితే శవం మోయటానికి ఒక్కరూ రాలేదు.

చివరికి అక్కడ ఉన్నది నేను, ఆ స్రీ భర్త, అతడి అన్న, అంతే !

ఏం చేయాలో తోచలేదు. నా బండిలోనే వెళ్ళి ఒక పూలదండ తెచ్చి శవానికి వేశాం. ఊరి నుంచి ఊరికి తీసుకునిపోవటానికి ఒక పాత ఆటో వారి దగ్గర ఉంది. ఆటోలో శవాన్ని వేసుకుని ముగ్గురం శ్శశానికి వెళ్ళాం. మేమే కట్టెలు పేర్చి శవాన్ని దాన్ని మీద పడుకోబెట్టి నిప్పుపెట్టాం. శవం కాలిన తరువాత ఇంటివైపు వచ్చాం.

ఆ సంఘటన నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది.

మా సంచారుల నుమారు 300 కుటుంబాలు కంప్లిలో ప్రస్తుతం నివాస మున్నాయి.

అయితే ఒక వ్యక్తి కూడా శవానికి భజం ఇవ్వడానికి రాలేదు.

మేము సంచారులం. కొంచెం మారినామని అనుకున్నాను.

ఈ ఘటన జరిగిన తరువాత మేము ఇంకా మా తండ్రి కాలంలో ఉన్న స్థితిలోనే ఇప్పటికీ ఉన్నామని నాకు అనిపించింది.

మా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుందో చెప్పండి?

యముడిని గెలిచినవారు :

కూతురు పుట్టినపుడే పిల్లలు కాకుండా ఆపరేషన్‌ చేయించాలని అనుకున్నాను.

అయితే పెద్దభార్య ఇంటికి ఒక్క మగబిడ్డయినా ఉండాలని గొడవ పెట్టింది. ఆమె కోరిక ఎందుకు కాదనాలని ఆపరేషన్‌ చేయించలేదు. మొదటి కూతురు పుట్టిన మూడేళ్ళకు నా రెండవ భార్య మళ్ళీ గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తరువాత గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఎనిమిది నెలలు నిండుతుండగా ఆ ఆస్పత్రిలోని డాక్టర్‌ మా దగ్గర లేడీ డాక్టర్‌ లేదు. అనుకూలమైన మరో మంచి డాక్టర్‌ దగ్గరికి పిలుచుకునిపోయి స్మానింగ్‌ చేయించు అన్నారు. వారి మాట ప్రకారం గంగావతిలోని డాక్టర్‌ దగ్గరికి పిల్చుకునిపోయాం.

డాక్టర్‌ స్కానింగ్‌ చేసి “కవల పిల్లలు” అన్నారు.

ఒక వైపు సంతోషం, ఒక వైపు దుఃఖం.

ఏమి చేయాల్రా దేవుడా అని అనుకుంటుండగా డాక్టర్‌ “ముందు మీరు అడ్మిట్‌ అవ్వండి. రోజులు నిండే వరకు నిర్లక్ష్యం చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం. తొందరగా ఆపరేషన్‌ చేద్దాం. దేవుడు అంతా మంచే చేస్తాడు” అని చెప్పారు.

రోజులు నిండటానికి ముందే బిడ్డ బయటికి వస్తే ఎలా అనే చింత పెద్ద భార్యకి. డాక్టర్‌ ఏమీ కాదని, ధైర్యంగా ఉండమనీ చెప్పిన తరువాత ఆపరేషన్‌ చేయడానికి అంగీకరించాం. డాక్టర్‌ ఆపరేషన్‌ చేసి బిడ్డలను బయటికి తీశారు. ఇద్దరూ మగపిల్లలు. నా భార్యల సంబరానికి హద్దే లేకుండా పోయింది. అయితే ఎంత బరువు ఉండాలో పిల్లలు అంత బరువు లేరు. చిన్నబిడ్డ అయితే ఒక కేజి నూటాయాబై గ్రాములు ఉన్నాడేమో, ఇలాంటి పిల్లలు బతకడం కష్టమని మనసుకు అనిపించింది. ఈరనాగమ్మ మీద భారం వేసి మౌనంగా కూర్చున్నాను. డాక్టర్‌ పిలిచి “పిల్లలు ఇంకా కోలుకోవాలి. పిల్లల డాక్టర్‌ దగ్గరికి పిల్చుకునిపోండి' అని చెప్పారు. నా దగ్గరేమో డబ్బులు లేవు. వడ్డీకి అప్పు తీసుకుని రావాలన్నా వెంటనే డబ్బు ఎవరు ఇస్తారు? నా పెద్దభార్య తన దగ్గర ఉన్న బంగారమంతా ఇచ్చేసింది. దాన్ని అమ్మాను. కొంచెం డబ్బు దొరికింది. మిత్రుడు హక్కిపిక్కి శికారి రాము తాను ఇతరుల దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి పెట్టుకున్న పదివేల రూపాయలు నాకు ఇచ్చేశాడు. ఇలా ఎవరెవరి నుంచో డబ్బు సమకూర్చుకుని పిల్లలకు, భార్యకు, ఆస్పత్రి ఖర్చులకు వెచ్చించాను. పిల్లలు కాస్త దూదితో వేస్తున్న పాలకు నోరు చప్పరించసాగారు. డాక్టర్లు ఇంకా ఆస్పత్రిలోనే ఉండాలన్నారు. అయితే నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఇంకా ఆస్పత్రిలోనే ఉంటే ఖర్చులకు డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడి మీద భారం వేసి భార్యాపిల్లల్ని ఇంటికి తీసుకుని వచ్చాం.

పిల్లలకు పాలు తాగడానికి రావడం లేదు. అప్పుడే పుట్టిన కుక్క పిల్లల్లా ఉన్నారు. ఇంటివాళ్ళంతా రాత్రీపగలూ ఒకరి తరువాత ఒకరు కాపలా కాసి పిల్లలను చూసుకున్నాం. అయినా చిన్న కొడుకు బతుకుతాడన్న నమ్మకం లేకపోయింది. అయితే చివరికి ఆ బిడ్డలు చనుపాలు తాగగలిగారు. కొంచెం ధైర్యం వచ్చింది.

ఇలా మూడునాలుగు నెలలు గడిచేలోగా పెద్దకొడుకును మరొక సమస్య ఇబ్బంది పెట్టసాగింది. బిడ్డ ఏడిస్తే చాలు గజ్జెల్లో బెలూన్‌లా ఉబ్బినట్టు కనిపించేది. అలా ఉబ్బుతుండగా బిడ్డ స్పృహ తప్పిపోవటంతో ఏడ్పు ఆగిపోయేది. బిడ్డ చనిపోయినట్టులేదు. బతికినట్టు లేదు. కొడుకు పరిస్థితి చూడటానికి నాకు చేతనయ్యేది కాదు. డాక్టర్‌ దగ్గరికి పిల్చుకునిపోతే బళ్ళారిలోని పెద్దాసుపత్రికి పిల్చుకునిపోండని సలహా ఇచ్చారు. అది మరింత కష్టమైన పననీ డాక్టర్‌కు చెబితే హొసపేటలోని పిల్లల డాక్టర్‌ దగ్గరికైనా వెళ్ళండని అన్నారు. డబ్బులు సమకూర్చుకుని హొసపేటలోని పిల్లల డాక్టర్‌ దగ్గరికి పిల్చుకుని వెళ్ళాం. డాక్టర్‌ చూశాడు. ఏమీ అడగలేదు. వెంటనే ఆపరేషన్‌ చేసి కాలిబుడగను తీసేశారు. అటు తరువాత మూడురోజులు తమ ఆస్పత్రిలో పెట్టుకుని డబ్బులు ఇప్పించుకుని పంపేశాడు.

ఇప్పుడిప్పుడు పిల్లలు సరైన తూకానికి వస్తున్నారు. పిల్లలకు పేర్లు పెట్టాలని భార్యలు చెప్పారు. సరే అన్నాను. మా వీధిలో ఆటో బాడుగకు నడిపే కుర్రవాడు ఉన్నాడు. ఒక శుక్రవారం అతడి ఆటోలో పిల్లలిద్దర్ని తీసుకుని దేవులాపుర మారెమ్మ గుడికి పోయాను. మారెమ్మ ఒడిలో పిల్లలిద్దరిని వేసి, 'తల్లీ, నా బిడ్డల్ని నువ్వే కాపాడాలమ్మా, నీ పేర్లే పిల్లలకు పెడ్తాను” అని చెప్పి "పెద్ద మారెప్పు, 'సణ్ణ మారెప్ప' అని పేర్లు పిలిచాను.

నా పెద్దభార్య యముడిని గెలిచిన పిల్లలు అనేది.

అయితే ఈ మధ్యన నా పెద్దకొడుకు చనిపోయాడు.

చిన్నవాడు బాగున్నాడు !

కాలు విరగటం :

సిరుగుప్ప తాలుకా తెక్కలకోటలో మా వాళ్ళవి సుమారు ముప్పయి, నలభై ఇళ్ళున్నాయి. వీటిలో కేవలం 23 కుటుంబాలకు మాత్రమే 'ఆశ్రయ ఇండ్లు' దొరికాయి. మిగిలినవారికి ఇండ్లే ఇవ్వలేదు. దాని విషయమై నేను తెక్కలకోట వెళ్ళాను. ఆ రోజు నా వెంబడి నా భార్య తమ్ముడు హులుగప్పన్నను పిల్చుకుని

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

29