పుట:Ammanudi july 2018.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భుజం మీద మోసుకుని పోయి శవసంస్కారం చేసిన కథ చెప్పాను.

అలాంటిదే మరొక ఘటన మొన్ననే జరిగింది. దాన్ని చెబుతాను. వినండి.

నాకు ఇప్పుడు ఒక ఏడాది వయస్సున్న చిన్న కూతురుంది. నాకొక అంగడి కూడా ఉంది. అందులో మా జనాలకు అవసరమైన కాయగూరలు, పచారీ సమాన్లు, బీడీలు, ఆకులు, వక్కలు, టీ మొదలైనవి అమ్ముతాం. మా వీధిలో మాలాంటి సంచారులు హెయిర్ పిన్నులు, పిల్లల ఆటవస్తువులైన పీపీ, బెలూన్, ఈలలు మొదలైనవాటిని అమ్మటానికి వస్తారు. ఈ విధంగా పీ పీ, పిన్నులు మొదలైనవి అమ్మటానికి ఈ మధ్యన కడుపుతో ఉన్న ఒక స్త్రీ వచ్చేది. ఒక్కొక్కసారి ఆమెతోపాటు ఆమె భర్త కూడా వచ్చేవాడు. ఇలా వచ్చినపుడు మా అంగడిలోనే ఇద్దరూకూర్చుని టీ తాగి, నా కూతురుకు పీపీ ఇచ్చి అమ్మాయిని కాస్సేపు ముద్దుచేసి వెళ్ళేవారు. మేము సంచారులం అన్నది వాళ్ళకూ తెలుసు. వాళ్ళు కంప్లికి వచ్చి ఎక్కడ ఉంటున్నారో అనే విషయాలను నేను విచారించలేదు.

మొన్న శుక్రవారం అంటే 17-5-2003న మా ఊర్లో సోమప్ప జాతర ఉంది.

ఆరోజు మధ్యాహ్నం నేను అంగడికి కావలసిన సామాన్లు తీసుకుని రావటానికి అయిదు వందల రూపాయలు జేబులో పెట్టుకుని బజారుకు వచ్చాను. అదే సమయానికి ఆ గర్భిణి స్త్రీ భర్త బజారులో కనిపించాడు. నన్ను చూడగానే -

"దండాలు అన్నా" అన్నాడు.

"దండాలు, ఏమిటి సమాచారం? వ్యాపారానికి పోలేదా?" అని అడిగాను.

"లేదన్నా, నా ఆడది సచ్చిపోయిందన్నా. ఏం చేయాలో తెలియటం లేదు. సంస్కారం చేయడానికి లేదు. ఏమీ అర్థం కావటం లేదన్నా" అన్నాడు దీనంగా.

"ఎక్కడ ఉన్నారు?"

"సోమప్ప గుడి దగ్గర" అన్నాడు.

సోమప్ప గుడి కోనేరు పక్కన చాలా మంది చిన్నదాసరులు, శికారివాళ్ళు మొదలైన సంచారులే నివసిస్తున్నారు.

"అన్నా, పీనుగుని తొందరగా తీసుకునిపొండి. ఇప్పుడు తేరును లాగుతారు. పీనుగుని పక్కన పెట్టుకుని తేరును లాగడానికి కుదరదని గుడి కమిటీవాళ్ళు తొందర పెడుతుండారు. నా దగ్గర డబ్బులు లేవు. ఆడది బాలింత కావటంవల్ల పూడ్చకూడదంట. దహనం చేయాల్నంట. కట్టెలమండి దగ్గరకి వెళితే కట్టెలకు నాలుగువేలు అడుగుతుండారు. ఇలాంటి సమయంలో నువ్వు దేవుడు కనిపించినట్టు కనిపించినావన్నా. ఏదైనా సహాయం చెయ్" అని అడిగాడు.

"రా, బండి వెనుక కూర్చో" అన్నాను.

నా సైకిల్‌మోటార్ ఎక్కి కూర్చున్నాడు.‌

నేరుగా సోమప్పగుడి దగ్గరికి పోయాం . తేరుగది ఇంటి వెనుక భాగంలో గుడిసె వేసుకున్నారు. గుడిసెలో శవాన్ని పడుకోబెట్టారు. అందులో ఉన్నవాళ్ళంతా బయట ఉన్నారు. ఆ కుటుంబంలో కేవలం భార్యాభర్తలు, భర్త అన్న ఉన్నారట. ఇప్పుడు ఆ స్త్రీ మగబిడ్డను కని చనిపోయింది.

మొన్న ఆమె చావటానికి నాలుగు రోజుల ముందు ఆ స్త్రీకి నొప్పులు మొదలయ్యాయట. మరోదారి కనిపించక ఆస్పత్రికి పిల్చుకునిపోతే డాక్టర్ బళ్ళారిలోని పెద్దాసుపత్రికి పిల్చుకుని పొమ్మని చెప్పారట. అయితే వారి దగ్గర డబ్బు లేనందువల్ల - 'దేవుడు పెట్టినట్టు కానీ' అని తిరిగి గుడిసెకు పిల్చుకుని వచ్చారట. ఇంట్లోనే కాన్పు జరిగి మగబిడ్డను కన్నదట. కాన్పులో చాలా రక్తం పొయిందట. ఇదీ జరిగిన మూడు రోజుల వరకూ బాగానే ఉందట. నాలుగవ రోజున సుమారు పన్నెండు గంటలకు బాలింతరాలు భర్త అన్న దగ్గరకి వచ్చి బీడి అడిగిందట. ఆమె అంతకు ముందు ఎప్పుడూ బీడీ తాగలేదట. ఆమె బీడీ అడగటంతో ఒక బీడీ ఇచ్చాడట. అతని దగ్గరే అగ్గిపెట్టె ఇప్పించుకుని బీడి వెలిగించి కాల్చిందట. అది పూర్తవుతుండగా మరొక బీడి ఇప్పించుకుని తాగిందట. ఇలా మూడు బీడీలి కాల్చిన ఆమె మూడవ బీడీ తాగిన తరువాత "నేను ఇంగ పోతాను మావా" అని అందట. ఎందుకిలా అన్నదో అర్థం కాలేదట. నిల్చున్నపాటున నేల మీద పడి ప్రాణాలు వొదిలిందట.

నేను వెళ్ళి చూసే సమయానికి గుడిసె ముందు కొంత మంది జనం నిలబడి ఉన్నారు. అందులో కొందరు ఆడపిల్లలు శవసంస్కారం కోసం చందా ఎత్తుతున్నారు. అదంతా చూసి అంగడి కోసం సామాన్లు తీసుకుని రావటానికి తెచ్చిన అయిదువందలు ఆమె భర్తకు ఇచ్చేశాను.

"ఈ దుడ్లు చాలదన్నా! ఎట్లా చెయ్యాలి?" అన్నాడు.

ఆ వ్యక్తిని బండి వెనుక కూర్చోబెట్టుకుని మా వీధికి వెళ్ళి చందా అడిగాను. ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర పరిస్థితి వివరించి చందా అడిగాను. హక్కిపిక్కి కాంత్‌ను అడిగితే అయిదువందల రూపాయల విలువైన కట్టెలు సామిల్లులో ఇప్పించాడు. మరో రెండు సా మిల్లులకు వెళ్ళి పరిస్థితి వివరిస్తే వాళ్ళు కూడా

28

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018