పుట:Ammanudi july 2018.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ధారావాహిక

మౌనంలోని మాటలు

9

సంచారి రావోళ్ళు నాగప్ప ఆత్మకథ

కన్నడ మూలం:

తెలుగు అనువాదం:

డా.ఆర్.వి.బి.కుమార్

రంగనాథ రామచంద్రరావు

9059779289

కూతురు పుట్టుక

నేను రెండవ పెళ్ళి చేసుకున్నాను. పెళ్ళి చేసుకున్న సంవత్సరానికి సరిగ్గా కూతురు పుట్టింది. మా సముదాయానికి చెందిన ఆడపిల్లలు సామాన్యంగా గర్భవతులు అవుతే డాక్టర్ దగ్గరకు వెళ్లటం అరుదు. వాళ్ళు తమకు తెలిసిన నాటుమందులు తయారు చేసుకుంటారు. అయితే నా రెండవ భార్య గర్భవతి అయినప్పుడు నా కన్నా ఎక్కువగా సంతోషపడింది నా మొదటి భార్య. ఆమె డాక్టర్ దగ్గరకి నా రెండవ భార్యను తీసుకుని పొమ్మని పోరు పెట్టింది. మొదటి భార్య పోరుపెట్టడంతో గర్భవతి అయిన రెండవ భార్యను డాక్టర్ దగ్గరకి పిల్చుకుని పోయాను. డాక్టర్ అంటే ఊరికేనా? ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని డబ్బు పీక్కోవటమే కదా!

కాన్పు రోజు దగ్గర పడినపుడు గంగావతికి పిల్చుకునిపోయాను. డాక్టర్ అడ్మిట్ చేసుకున్నాడు. అడ్మిట్ చేసుకున్న రెండు రోజులకు తల్లి కడుపు కోసి బిడ్డను బయటికి తీయాలన్నాడు. నాకు ప్రాణాలే పోయినట్టయ్యాయి. ఆపరేషన్ అంటే నాకేమో భయం! మేము ఎంతైనా బిచ్చం అడగటానికి చెయ్యి కోసుకుని రక్తంకార్చి బిచ్చం అడిగేవాళ్ళం. చెయ్యి కోసుకోవటం మాకు సాధారణమైన విషయం. కోసుకున్న చేతికి ఇంటికి వచ్చిన తరువాత గుంటగలగరాకు రసం పిండుకుని, వాటి ఆకులు కట్టుకుంటే రక్తం నిలిచిపోయి నెమ్మదిగా గాయం మానిపోయేది. మరుసటి రోజు బిచ్చం అడిగే సమయానికి మరో చోట చెయ్యి కోసుకునేవాళ్ళం. అయితే కడుపు కోయటం మాకు కొత్త. ఏ పిల్లలు వద్దు. ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం.

ఆ సమయంలో నాలో ధైర్యం నింపింది నా మొదటి భార్య. "ఏమీ కాదు ఊరుకో, డాక్టర్ ఉన్నాడు! ఆయనే అంతా చూసుకుంటాడు" అని చెప్పింది.

మనస్సుకు కొంచెం నెమ్మది కలిగింది.

అందులో ఆపరేషన్ అంటే ఊరికేనా? మాలాంటి పేదవాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు సమకూర్చుకోవాలి? భయం వేసింది. చివరికి నా పెళ్ళికి దండన కట్టడానికి డబ్బు ఇచ్చిన ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళి వడ్డీకి డబ్బు ఇప్పించుకుని వచ్చాను. ఆపరేషన్ జరిగింది. కూతురు పుట్టింది. భార్య ఆరోగ్యవంతురాలైంది.

కూతురు పుట్టి నా పురుషత్వాన్ని రుజువు చేసింది!

నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు!!!

టీ తాగిన కథ

మొన్న 2013లో మునిసిపల్ ఎలక్షన్‌లో జరిగిన సంఘటన ఇది!

ఆరోజు పొద్దున్నే ఓటు వేయడం కోసం వరుసలో నిలబడ్డాను. ఎవడో ఒకడు టీ ఇచ్చే కుర్రవాడు అటుగా వచ్చాడు. లోపల రాసు కోవడానికి కూర్చున్న వాళ్ళకంతా టీ ఇచ్చాడు. వరుసలో నేను నిలబడివున్నాను. ఎందుకో టీ పిల్లవాడు నాకూ టీ ఇచ్చాడు. అతను నాకు టీ ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. ఓటు వేయడానికి నా వంతు కోసం నిలబడిన నాకు అప్పటికే తలనొప్పెడుతూ ఉంది. టీ ఇస్తుండగా ఎందుకు? ఏమిటి అని అడగకుండా టీ తీసుకుని తాగసాగాను.

అదే సమయంలో ఎవరో సబ్ ఇన్‌స్పెక్టర్ వచ్చాడు.

అతని పేరు ఆనందో ఏమో? నాకు తెలియదు.

రాగానే టీ తాగుతున్న నన్ను చూసి, "ఏనా కొడుకు టీ ఇచ్చాడ్రా లమ్డికే" అని తిట్టాడు.

నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను అడగకపోయినా ఆ కుర్రవాడే టీ ఇచ్చాడు. నేను తాగాను ఇందులో నా తప్పేముంది?

నేను ఆ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉన్నంత ఎత్తు ఉన్నాను. ఒకవేళ అలా ఉండడం కారణమా?

లేదా నేను చదువుకోకపోవటం కారణమా?

ఇప్పటికీ నాకు అర్థం కాలేదు.

ఆ మనిషి నన్ను తిట్టడానికి కారణం ఏమైవుండొచ్చని ఎంత ఆలోచించినా ఇప్పటికీ కారణం తెలియలేదు.

చదువులేని వాళ్ళకు మానం-మర్యాద ఉండవా?

అదీ అర్థం కాలేదు!

సంచారి శవసంస్కారం

గతంలో మా నాన్న నా భార్య అమ్మమ్మను

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

27