Jump to content

పుట:Ammanudi April-July 2020.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంటింటా వెలిసినాయి. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం, రూపాయి తొంబై పైసలకే కిలో బియ్యం ఇస్తా ఉంది. “అన్న పాలన వస్తే కిలోకు పదిపైసాలు జాస్తి అయితుందంటమ్మో" అని ఎవరైనా ఆడవాళ్లతో అంటే 'పది పైసాలు కాదు ఏబై పైసాలు కానీ, అన్న వస్తే అదే చాలు” అనేస్తా ఉండారు.

అభిమాన సంఘాలలోని చానామంది యువకులు, తెలుగు కార్యకర్తలుగా, అనెంక నాయకులుగా ఎదిగిరి. ఆంధ్ర సాంస్కృతిక సంఘాలవారు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని ఏటేటా చేసేకి ఆరంఖించిరి. బోసుబజారు మిత్రబ్బందంవారు ఉగాది వేడుకల్ని ఘంటసాల పాటలపోటీని నడపతా ఉండారు. జనప పేట, గొల్లపేట, నేసేపేటల్లో ఉగాది వేడుకలు సురువయినాయి. ఎన్టీఆర్‌ కళాపీఠం సామాజిక సేవా కార్యక్రమాలను ఆరంభించింది. తెలుగు సాహిత్య పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభమయినాయి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ అభిమాన సంఘాలూ, వాటికి కొనసాగింపుగా చిరంజీవి, బాలకృష్ణ అభిమాన సంఘాలూ గ్రామగ్రామాన ఏర్పాటయినాయి. తెలుగువాళ్లే ఎమ్మెల్లేలుగా ఎన్నికయితా ఉండారు. యువకులంతా కలిసి పెద్దల, రాజకీయనాయకుల అండదండతో గొడవలకు దిగి బస్టాండులో బస్సుల మీదా తెలుగు అక్షరాలను రాయించిరి. తెలుగు భాషోద్యమ సమాఖ్య శాఖ ఏర్పడి ముప్పైకి పైచిలుకు ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు బోర్టులను పెట్టించింది. శాసనసభ్యుడి అండదండతో బిడ్డలను తెలుగుబడిలో చేర్చండని పల్లెపల్లెనా “తెలుగు దండోరా” సురువయింది. “నడుస్తున్న చరిత్ర 'అనే నెలపత్రిక మాతావుకు వచ్చి, హోసూరు తెలుగును బయటి ప్రపంచానికి చాటి చెప్పింది. కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం (కృష్ణరసం) ఏర్పడి ఎంతోమంది రచయితలను తయారు చేసింది. బస్తీ యువకబ్బందం వారు ఉగాది వేడుకలను పెద్దయెత్తున మొదలుపెట్టేసిరి. “తేట తేట తెలుగులా .....” “తెలుగువీర లేవరా......” పాటలు మైకుల్లో హోరెత్తిస్తుంటే తమిళులు దిగులు పడిరి. 'తెలుగుజాతి మనది, నిందుగ వెలుగుజుతి మనది” పాటలో 'తెలంగాణా నాది, రాయలసీమ నాది, సర్మారునాది, నెల్లూరునాది అని ఉంటే నెల్లూరుకు బదులుగా “హోసూరు'ను చేర్చి పాడుకుంటూ ఉండారు జనం.

ఆ తెలుగు వెలుగు ఇరవై ఏండ్లకు పైగా కొనసాగింది. హోసూరు తావున ఆ కాలంలోనే రెండు పెను విషాదాలను కూడా చవిచూసితిమి. 1) అందరమూ చేతలుడిగి ఉండిపోయినపుడు, ఒంటరిగా అరవ దొరతనాన్ని ఎదిరించి, బతికినంత కాలమూ హోసూరును ఆంధ్రలో కలపాలని తపనపడిన కోదండరామయ్యగారు, 1984లో కనుమరు గయిపోయిరి. 2) ఏ పేరును తలచుకొని రొమ్ము విరుచుకొని నడచి తిమో, ఏ పేరును చెప్పుకొని తలెత్తుకొని నిలబడితిమో, ఆ ఎన్టీరామారావు గారు కనుమూసిరి.

ఈ కతకు సంతోషపు ముగింపును ఇయ్యాలనే ఉందినాకు. కానీ ఇది కతకాదు, ఒక తావు బతుకు కదా!

ఇరవైయేంద్లకు పైగా సాగిన ఆ వెలుతురుపైకి మెల్లగా చీకటి కమ్ముకొనింది. అదే కడ్డాయ (తప్పనిసరి) తమిళ్‌ చట్టం. దీనిని తెచ్చింది డి.ఎం.కె. ప్రభుత్వం. తమిళునాడులో ఉండేవాళ్లంతా తమిళ ను ఒక పాఠంగా బడిలో తప్పనిసరిగా చదవాలనే చట్టం అది. ఈ చట్టంలో తప్పేముంది అని అనిపిస్తుంది ఎవరికైనా. పైకి అట్లే ఉంటుంది కానీ లోపలుంది అసలు లొసుగంతా. ఆంధ్ర, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలలో త్రిభాషా సూత్రం ప్రకారం చదువు ఉంటుంది. తమిళ నాడులో ద్విభాషాసూత్రం. ఇన్నాళ్లూ తెలుగు, ఆంగ్లం, రెండు భాషలు: లెక్కలు సామాన్య సాంఘికలు తెలుగులో ఉండె. కొత్త చట్టంలో తమిళు, ఆంగ్లం తప్పనిసరి. ఇతర భాషలవారు కావాలంటే వాళ్లభాషను ఒక పాఠంగా చదువుకోవచ్చు. అయితే దానికి పరీక్ష మార్కులు, సర్టిఫికేట్‌ లో చూపడము ఉండదు. అంటే పేరుకు తెలుగు ఉంటుంది కానీ, నేర్పే దిక్కుండదు.

ఉత్తరువు వస్తానే హోసూరు తావున కలకలం రేగింది. కొందరు కోర్టుకుపోతే, కొందరు ప్రభుత్వానికి విన్నపాలు పంపుతుంటే, ఎమ్మెల్లే చట్టసభలో నోరుకొట్టుకొంటే అప్పుడు ప్రభుత్వం స్పందించి మైనారిటీ భాషల జోలికి రాము అనీ ప్రకటించింది. అమ్మయ్య అని ఊపిరిపీల్చుకొంటిమి. డి.ఎం.కె. ప్రభుత్వం పోయి అన్నా డి.ఎం.కె. ప్రభుత్వం వచ్చింది. తెలుగుబడులు మామూలుగానే నడస్తా ఉండాయి. కడ్డాయ తమిళ చట్టం వెలువడి పదో ఏడాది, పరోతరగతి పరీక్షలు ఇంకొక నెలనాళ్లలో ఉండాయనంగ్నా తెలుగు బడులంతా ఒక ప్రకటన వచ్చింది. చిన్నోళ్లు పరీక్షలన్నీ తమిళంలోనే రాయాలనే ప్రకటన అది. తలమీద గుందుపడినట్లయింది. తమిళ అక్షరమే తెలియని వేలాదిమంది విద్యార్థులు అన్ని సబ్జక్టుల్ని తమిళ్లో ఎట్ల రాసేది?

కొందరు కోర్టులకు పరుగులు తీసిర, హోసూరు వీధుల్లో జోరువానలో కూడా వేలాది జనం నిరసన తెలిపిరి, విద్యార్దులు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తినాయి. బిడ్డల భవిష్యత్తు చీకటయిపోయింది. న్యాయస్థానంలో రవంత ఊపిరి దొరికింది. మూడు నాలుగేళ్ల వరకూ తెలుగులో రాయవచ్చు అనిరి. ఈ లోగా తమిళ ప్రభుత్వం, సర్మారుబడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. అరవం కంటే ఆంగ్లం మేలనీ మా తావునుండే తెలుగు బడులన్నీ మారిపోయె. ఇప్పుడు ఇక్కడ ఒక్క బడిలో కూడా తెలుగు అమ్మా ఆవూ లేవు. ఆంగ్ల మాధ్యమంలో అరవం ఒక పాఠం, అంతే.

సొతంత్రానికి ముందు తెల్లదొరల ఏలుబడిలో, జగిలి (అరుగు) బడుల్లో ఓనమాలతో ఊరూరా ఆరంభమైన తెలుగు చదువులు, 2006తో ముగిసిపోయినాయి. అన్నీ ఊళ్లల్లోనూ తెలుగు పేరెత్తితే చాలు, భీతి, భయం, దిగులుతో ఉలిక్కిపడతుండారు. అన్ని సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపుగా నిలిచిపోయినాయి. చీకటి వెలుగుల మా తెలుగుబతుకుల్లో మరలా పొద్దుపొడిచేది ఎప్పుడో!

(పూర్తి అయింది)


“బొధనా మాద్యమంగా మాత్సభాష ఉండాలనేది
నా ఖచ్చితమైన అభిప్రాయం. విద్వావ్వాన్తికి
పరిశ్రమించడమే విద్వాలయాల కర్తవ్యం.
విద్వాలయాల్లో బోధనా మాధ్వమంగా
మాతృభాషను స్వీకరిస్తే తప్ప
ఈ లక్ష్యం నెరవేరదు. ”
- డా॥ బాబాసాహెబ్‌ అంబేద్మర్‌