Jump to content

పుట:Ammanudi-May-2019.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెద్దొరి తీపిగురుతులు

సన్నిధానం నరసింహశర్మ 92920 55531

నౌజన్యధన్యుడు, సాహిత్య సంపన్నుడు

విఠాల వాసుదేవ దీక్షితులు

ఆంధ్రప్రభ సంపాదకునిగా, ప్రసార మాధ్యమాల్లో సమకాలీన రాజకీయ విశ్లేషకునిగా ప్రసిద్ధి పొందిన దీక్షితులుగారు అప్పుడే మృతి చెందడం విచారకరం; విషాదకరం.

సాహితీవేత్తలు పత్రికా సంపాదకులుగా ఉండడం వల్ల, శైలీ సౌందర్యాలు, బాస తీయందనాలు ఎక్కడో అక్కడ గుబాళిస్తుంటాయి. సమాచారాన్నోో విజ్ఞానాంశాన్నో రచనలుగా మలచడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది పెన్నుతో పండించే పంటగానూ ఉంటుంది.

ఆరుద్ర మాటల బలిమిపై నీలంరాజు వేంకట శేషయ్యగారు అజంతాకు ఆంధ్రప్రభలో ఉద్యోగమిచ్చారు. కొన్ని ముఖ్య పత్రికలకులాగే ఆంధ్రప్రభకు కొన్ని సంప్రదాయాలు విలువలు ఉండేవి. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు, ఆంధ్రప్రభ సంపాదక ప్రతిష్టాపీఠంపై తన తరువాత దీక్షితులుగారు వచ్చిన ముచ్చట చూసిన పొత్తూరి వేంకటేశ్వరరావుగారు పత్రికా రంగ రచనలో నాకు అక్షరాభ్యాసం చేసినది ఒకప్పటి ఆంధ్రప్రభ సంపాదకులు కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యంగారేనని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇందులో ఆయన వైయుక్తిక సుగుణమే కాక, ఆంధ్రప్రభ అందించిన వారసత్వ సుగుణత్వ శోభ కూడా లేకపోలేదు. అదిగో ఆ ప్రతిభా వైభవం చవిచూసిన, చవిచూపిన సంపాదకుడు వాసుదేవ దీక్షితుల గారు. మహాకవి మదునాపంతుల సత్యనారాయణ శాస్త్రి కీర్తిశేషులైనప్పుడు సంపాదకీయం రాసిన ఏకైక సంపాదకులు దీక్షితులుగారే. అది ఆయన సాహిత్య సంపన్నత వల్ల జరిగిన మేలుపని.

నా గ్రంథాలయ గురువు పాతూరి వారికి పొట్టి శ్రీరాములు గారు రాసిన లేఖల్ని ఓ వ్యాసంగా రాసి, ఓ నవంబరు.! ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సంచికకు పంపాను. సత్వర సంస్పందనలో దీక్షితులుగారు “మహా ప్రసాదం అందింది. కళ్ళకు అద్దుకుని మరీ వేస్తున్నాను ఆ వ్యాసాన్ని సంపాదకీయపు పుటలో. అన్నారు, వేశారు. రోశయ్యగారి వంటి పెద్దలు సైతం ఆనందించారు. ఆనందాన్ని నొక్కేసుకోకుండా తెలిపారు.

ఆంధ్రప్రభ సంపాదకునిగా ఆయన మానేశాక కూడా ఎందరో అభిమాన ప్రేమలకు పాత్రుడయ్యారంటే ఆయన సౌజన్యధన్యతవల్లనే కదా! తెలుగు విశ్వవిద్యాలయం హైద్రాబాదు ప్రాంగణంలో ఆచార్య జయధీర్‌ తిరుమలరావు సన్నిధానంలో ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్‌. శాస్త్రిగారు 'దీక్షితులుగారూ! మీ అనుభవాల్ని మా ఆంధ్రభూమిలో ధారావాహికగా రాయండి” అని కోరారు. అలా రాసి వుంటే విశేషాంశాలెన్నో విశేష సంఘటనలతో వెలికి వచ్చేవి, తెలిసి వచ్చేది. అది జరగలేదు.

తెలుగు వచన కవిత్వంలో అపురూప కవి అజంతా అన్నా, ఆయన కైతలన్నా దీక్షితులుగారికి ప్రాణం. అజంతాగారూ దీక్షితులుగారు నా ప్రాణం అనేవారు.

ఆంధ్రప్రభలో దీక్షితులుగారు, ఎం.వి.ఆర్‌. శాస్త్రిగారు, పురాణపండ రంగనాథ్‌గారు - వీరందరి కలుపుగోలు తనాలు దళ కార్యానుసంధానాలంటే ఏమిటో ఆంధ్రప్రభ ద్వారా తెలిపేవారు.

తరువాత పొత్తూరి వారైనా, దీక్షితులుగారైనా తాము సంపాదక స్థానాల్లో ఉన్నా అజంతా వంటివారిని తమ వద్దకు పిలిపించుకోకుండా తామే వారి వద్దకు వెళ్ళి, అవసర సంప్రదింపులు చేసేవారు.

ఒక ముఖ్యమంత్రి ప్రభ సంపాదకునిగా దీక్షితులుగారికి తాముగా ఫోనుచేసి ఓసారి కలుద్ధామా అంటే దీక్షితులుగారు సవినయంగా హుందాగా రావడానికి అభ్యంతరం లేదు కాని, ఆంధ్రప్రభ కార్యాలయాన్ని ముఖ్యమంత్రులు దర్శించడం కూడా వుంది అన్నారు. ఇది ప్రస్తుత ముఖ్యమంత్రికి సంబంధించి కాదు.

తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజింపబడినాక ఆం.ప్ర. దొరతనం దీక్షితులుగారికి ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ పదవినైతే ఇచ్చింది.

46

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019