పుట:Ammanudi-May-2019.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞులానందించారు. అయితే దీక్క్షితులుగారి ఆశయ రూప కల్పనలకు, నూతనాకాంక్షల కార్యక్రమాలకు తగిన బడ్జెట్టు కేటాయింపులు, మంజూరులు లేకపోవడం వల్ల ఆయన చేతులు, చేతలు కట్టేసినట్లయింది.

ఉషశ్రీగారు చనిపోయాక నేను ప్రభ కార్యాలయానికి వెళ్ళి ఉషశ్రీగారు ఎవరికీ చెప్పనివి నాకు మాత్రమే చెప్పినవీ, దీక్షితులు గారికి చెప్పామా (వీనిని వివరంగా ఆంధ్రభూమిలో రాశాను) చెప్పి, రైలెక్కి రాజమంద్రం వెళ్లిపోయాను. కొన్ని రోజులకి ఆ ఉషశ్రీ సంబంధిత అపూర్వ అంశాలు చెప్పడానికి దీక్షితులుగారి ప్రేరణపై విశ్వనాథ సత్యనారాయణగారింట్లో పావనిశాస్రిగారు సమావేశం ఏర్పాటు చేశారు. ఏకైక వక్తను నేను. విశ్వనాథ జయంతి, ఉషశ్రీ పై ప్రసంగం. నలుగురైదుగురే శ్రొతలు. వారు స్వాతి సంపాదకులు బలరాంగారు, పావనిశాప్రిగారు, పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు, బాలజ్యోతి సంపాదకులు శశికాంత్‌ శాతకర్ణిగారు. ఇలా నలుగురైదుగురు వేత్తలకి జ్ఞానానందాల్ని పంచాలనుకునే సంస్కారం దీక్షితులు గారిది. స్వీయానందాలకే కాక సామాజికానందానికీ ప్రాధాన్యమిచ్చేవారు చాలా అవసరం.

ప్రసార మాధ్యమాల్లో చర్చల సందర్భాలలో ఆయన మొగ్గులు ఆయనకున్నా - చౌకబారు వ్యాఖ్యానాల్ని, ఎదుటివారి, తన స్థాయిల్ని తగ్గించే దిగువ తలంపులుండేవికావు. అమ్మనుడికి ఈ తీపి గుర్తుల ప్రమేయం రాసే సందర్భంలో పొత్తూరి వారికి ఫోను చేసి, దీక్షితుల గారి గురంచి, ప్రామాణికులైన మీ నుండి రెండు వాక్యాలు వినాలని వుంది అని అభ్యర్థిస్తే, వెంటనే ఆరంగా - దీక్షితులుగారు చాలా మంచి వ్యక్తి. పరిశుభ్రమైన భాషలో రాసేవారు. ఆంధ్రప్రభకు వెనుకటి చరిత్ర నుండి అనూచానంగా వస్తున్న వారసత్వ సత్సంప్రదాయాల్ని రక్షిస్తూ వచ్చిన వారిలో ఆయన ఒకరు. క్రమశిక్షణ గల బాధ్యతాయుత రచయిత. ఫలానా చోటుకి బదిలీ చెయ్యబడ్డారంటే, వెంటనే వెళ్ళి, విధుల్లో హాజరయ్యే మంచి నైజం ఆయనది” అన్నారు.

విజయవాడ గాంధినగర్‌లో ఒక బ్యాంకుకు ప్రక్కనే ఉండే సౌజన్య నిధి దీక్షితులుగారు.

పోతన్న మహాకవి ప్రహ్లాదుని సుగుణాలు చెబుతూ 'స్నేహ మోహన భాషణ శ్రీలతోడ' ప్రహ్లాద డున్నా డన్నారు. స్నేహమోహన భాషణలు సంపద లన్నారు.

ఎప్పుడూ అందంగా తాజా నవ్వులు చిందిస్తూ ఆనందం, ఆప్యాయతలు వెలిగే కళ్ళతో చూపుతోనే హాయిగా ఆహ్వానించే దీక్షితులుగారు - ఆతిధ్యానందాల సందడుల మధ్య ఆంధ్రపురాణం వంటి కావ్యగానాల మధ్య - ఓహ్‌, ఆహాలతో కాలాన్ని అమృతం చేసుకున్న దీక్షితులుగారు లేరనే వాస్తవం జీర్ణించుకోవడమే కష్టంగా వుంటుంది.

సమవయస్కులు, ఎదలో పీట పరచుకుని ఉన్న వారలు చన్నవారలైనప్పుడు....ఆ వెలితి ఎదను దహించే చితి అవుతుంది. చితి - చింతల్లో కూడా తీపి గురుతులు మాత్రమే బతికిస్తుంటాయేమో! ఏమో!



స్పందన

“తెలుగువారి ఉగాదే...ప్రపంచానికి యుగాదా ...”

అనే శీర్షికతో అచ్చయిన వ్యాసం, ఏప్రిల్‌ 'అమ్మనుడి” -33వ పుట పూర్తి అవాస్తవాలతో, వక్రీకరణలతో కూడినదని, నా అభిప్రాయం.

దీనిలో ప్రామాణికమైన సమాచారం దాదాపు లేదనే చెప్పాలి. “ఈ ఉగాదినే చాలా ప్రాంతాల ప్రజలు సంవత్సరాదిగా భావిస్తారు” అనటానికి ఎటువంటి ఆధారం లేదు. తెలుగువారు జరుపుకునే ఉగాది ప్రపంచానికి యుగాదా, కాదా? అనే సంగతి అలావుంచితే, అది కనీసం భారతీయులందరూ జరుపుకునే సంవత్సరాది కూడ కాదు. ఎందుకంటే, మనం జరుపుకునే ఉగాదిని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే జరుపుకుంటారు. తమిళులు తమ సంవత్సరాదిని “పుథండు” అనే పేరుతో, ప్రతిసంవత్సరం ఏప్రిల్‌ 14న జరుపుకుంటారు. ఇదే రోజును కేరళలో “విషు”, ఉత్తరాది రాష్ట్రాల్లో “వైశాఖి”, అస్సాంలో “బోహగ్‌ బిహు” అనే పేర్లతో జరుపుకుంటారు. ఇది సూర్యమాన కాలెండర్‌ ప్రకారం రూపొందిన పండుగ. వీటన్నిటిలో “విషు” అనేది సంవత్సరానికి “ఆది” అనే అర్ధాన్ని కచ్చితంగా సూచించే పదం. ఎందుకంటే విషు అనేది రాత్రి పగలు సమంగా ఉండే రోజును (విషువత్‌ equinox) సూచిస్తుంది. కనుక దీన్ని తెలుగువారి ఆవిష్కరణగా చెప్పటానికి ఎటువంటి ఆధారం లేదు. వ్యాసరచయిత చెప్పినట్లు, విషువత్తు ఆధారంగా చాంద్రమానాన్ని రూపొందించటం “మన ప్రాచీన బుషుల అద్భుత విద్వత్తు అని అంగీకరించినా, ఆ ప్రాచీన బుషులు తెలుగువారని చెప్పటానికి కనీస సాక్ష్యాలు లేవు. ఇక తెలుగువారి యుగాది లేక శాలివాహన శకం ప్రారంభమై యిప్పటికి 1940 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. (మన వ్యాసంలో కనీసం దీని ప్రస్తావన లేదు). దీనికి చాలా కాలం ముందు నుండే రోమన్‌, జూలియన్‌, హీబ్రు తదితర కాలెండర్లు అమలులోకి వచ్చాయి.

ప్రపంచ వ్యాపితంగా, సూర్యచంద్రుల గమనాన్ని గణించిన అనేక జాతులు, ఎవరికివారు వేరువేరుగా మరియు పరస్పర సహకారంతో కాలమానాన్ని లెక్కించారు. ఈనాడు మనం ఉపయోగిస్తున్న కాలమానం, మానవజాతి ఉమ్మడిగా సాధించిన ఉత్తమ ఫలితం. ఆ మానవజాతిలో తెలుగువారు కూడ భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, నిరాధారమైన పుక్కిటి పురాణాలతో, చరిత్రను వక్రీకరించి, అందరికంటే మనమే గొప్పవారమని చెప్పు కోవటం, మనకు మేలు చెయ్యకపోగా, కీడు చేస్తుందనేది మనకు చరిత్ర నేర్చిన గుణపాఠం.

- డి.చంద్రశేఖర్‌ 92900 91232

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మే 2019

47