పుట:Ammanudi-June-2019.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు చదువులు

నూర్‌బాషా రహంతుల్లా 6301493266

ఇకపై తెలుగు మాధ్యమంలో చదువులుంటాయా?

తెలుగు మాధ్యమంలో చదువుకు, ఉపాధికి ఏ పార్టీ అయినా హామీ ఇచ్చిందా? తెలుగుదేశం, వైసిపి పార్టీలు రెండూ కూడా ప్రాధమిక విద్యను ఇంగ్లీషు మీడియానికి మార్చుతామని, తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంచుతామని తమ మ్యానిఫెస్టొలలో ప్రకటించాయి. కానీ ప్రాధమిక విద్యను తెలుగు మాధ్యమంలో ఉంచి ఇంగ్లీషును ఒక సబ్జెక్టుగా మాత్రమే నేర్పాలని తెలుగు భాషాభిమానులు కోరుతున్నారు. మన రాష్ట్రంలో పోయిన సంవత్సరం 9వేల ప్రాధమిక పాఠశాలల్ని ఇంగ్లీష్‌ మీడియంలోకి మార్చారు. ఈ సంవత్సరం మిగిలిన 40వేల ఫైచిలుకు ప్రాధమిక పాఠశాలల్ని ఆంగ్లమీడియంలోకి మార్చబోతున్నారు. ఇకమీదట అన్ని ఆంగ్లమాధ్యమ పాఠశాలలే ఉంటాయి. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంపై మక్కువ చూపుతున్నారట. ఈ ఒక్క కారణం చూపుతూ ఇప్పటిదాకా కొనసాగిన తెలుగు మాధ్యమాన్ని మూల దశలోనే లేకుండా తీసిపారేస్తున్నారు. బ్రతుకుతెరువుకు పనికివచ్చే వృత్తి విషయాలను తెలుగులో బోధించకుండా కవిత్వాలు పద్యాలు కథలు ఉండే తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే బోధిస్తారట. విద్యార్థులకు అటు తమ భాషను రానివ్వకుండా, ఇటు స్వేచ్చగా అనుమానాలు నివృత్తి చేసుకోనివ్వకుండా ఇదేమి చదువు ? ఇది పిల్లల మాతృభాషను మార్చటం కాదా ? మరో భాషలోకి వలస తీసికెళ్ళటం కాదా?

సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలకు సన్మానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆదేశించారు. ఇది మంచి సంప్రదాయమే. కానీ తెలుగులోనే డిగ్రీ దాకా చదివి, తెలుగు మాధ్యమం లోనే సివిల్స్‌ పాసైన అభ్యర్థులకు ఘనసన్నానం చెయ్యాలి. తెలుగు మాధ్యమం ద్వారా పరీక్షల్లో నెగ్గి పద్ధతుల్లో నైపుణ్యశిక్షణ ఇప్పించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రోత్సాహకాలు, రిజర్వేషన్లు ఇవ్వాలి.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇంకా దేశభాషలకు స్వాతంత్య్రం రాలేదు. మాతృభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది అన్నారట గాంధీజీ. భాషా చాతుర్యం ఉంటే ఎంతటి క్లిష్టమైన వ్యవహారాలనైనా అవలీలగా పరిష్మరించుకోవచ్చు. చెప్పాలనుకున్న విషయాలు సాఫీగా చెబుతూ నదీ ప్రవాహంలా ముందుకు సాగేది మాతృభాషే, ప్రపంచ భాషలను శాసిస్తున్న ఆంగ్లం కూడా ఎన్నెన్నో పరభాషా పదాలను తనలో ఇముడ్చుకొని నేడీ రూపం తీసుకొంది. ఇంగ్లీషు ఎప్పటికప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇముడ్చు కోవటమేకాక విశ్వవ్యాప్తంగా విద్యాలయాలను సమకూర్చుకొని విద్యార్జులకు నేర్పుతూ ప్రపంచ భాషగా ఎదిగింది. నాలుగు మాటలు ఇంగ్లీషు కలవకుండా తెలుగులో మాట్లాడుతున్న పరిస్థితి నేడు మనకు లేదు.

మన పిల్లలు పై స్థాయిలోకి వెళ్లదానీకి, బాగా చదవడానికి ఇంగ్లీషు మీడియం చదువులే మంచివన్న అభిప్రాయానికి తల్లిదండ్రులు, ప్రభుత్వాలు వచ్చేశాయి. ఇక్కడి భాషతో ఇక్కడే బతకవచ్చన్న భరోసా ఎవ్పుడు ఏర్పడుతుంది? మాతృభాష బువ్వ పెడుతుందన్న నమ్మకం ఎలా కుదురుతుంది?

ఇంట్లో తెలుగు - బడిలో ఇంగ్లీషు

మనిషి మాతృభాషలో ఆలోచిస్తాడు. మన ఊహకూ, కాల్పనిక శక్తికీ, నూతన సృజనకూ మూలం మాతృభాషే, మాతృభాషగా తెలుగు మన ఇళ్ళల్లో ఇంకా బ్రతికే ఉంది. “ఇంట్లో తెలుగు -బడిలో ఇంగ్లీషు” లా ఉంది మన జీవితం. మన పిల్లలకు నేర్చే చదువు కూడా తెలుగు మాధ్యమంలోనే ఉండాలని కొందరు అడుగుతున్నారు.

మాతృభాషను విస్మరించి పరభాషకు పట్టం ఎందుకు కడుతున్నారు అంటే ఉద్యోగాలు పరభాష లోనే దొరుకుతున్నాయి కాబట్టి. మన పిల్లలకు మాతృభాషలో కనీసం ప్రాధమిక విద్య లేకపోవడంవల్ల పిల్లల్లో సృజన పోయింది. అందుకే చాలామంది ఇంగ్లీషు మీడియంలో చదివిన యువకులు, నాయకుల పిల్లలు తెలుగులో తప్పులు మాట్లాడుతున్నారు. మన దేశంలో నేడు 60 శాతం విద్యార్థులు ఆంగ్గ మాధ్యమంలో చదువుకుంటున్నారు. ఎన్నో ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు ఆంగ్లంలోకి మారాయి. ప్రజలు కూడా ఈ మార్పును కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగు మాధ్య మానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు. ఆంగ్లమాధ్యమం వల్ల కొందరు విద్యార్థులకు విదేశాలల్లొ ఉద్యోగాలు దొరకవచ్చేమో కానీ, రాష్ట్రప్రజల భాషా సాహిత్యాల భవిష్యత్తును అది నాశనం చేస్తుంది. విద్యార్థులు కూడా పరభాషా మాధ్యమం వలన తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. న్యాయం, వైద్యం, ఇంజినీరింగ్‌, భౌతిక రసాయన శాస్త్రాలన్నీ తెలుగులో నేర్చగలగాలంటే మాతృభాషలోనే ఆ సాంకేతిక సమాచారమంతా లభించేలా పదసంపద ఎప్పటికప్పుడు పెరగాలి. ఇందుకుగాను తేలికగా అర్ధమయ్యే ఇంగ్లీషు పదాలను కూడా తెలుగు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

7