పుట:Ammanudi-June-2019.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాఠ్యాంశానికి/బొధనాంశానికి తగ్గట్టుగా తయారవ్వాలి.

ఇందుకు కావాల్సిన సాంకేతికత అందుబాటులో ఉన్నా తెలుగులో ఇంకా మొదలవ్వలేదు.

ఇది ఒక గొప్ప అవకాశం. తెలుగు వార్తాసంస్థలు ప్రస్తుతం ఈ ఖాళీలో ఇమడాలని చూస్తున్నాయి కానీ వారికది తలకు మించిన పని అవటం వలన నాణ్యమైన సమాచారం తయారవ్వటం లేదు.

“ఈ సందర్భంలో ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడకూడదు, ప్రవర్తించరాదు” అని బోధ చేసే విషయాలు కానీ, సైకిల్‌. స్కూటర్‌, కార్‌. బట్టలుతికే మషీను లాంటి ఉపకరణాలను శుభ్రం చేసుకునే విషయాలను చెప్పే వీడియోలు లేదా కోర్సులు గానీ, వంటలను నేర్పే మార్గదర్శక వీడియోలూ కానీ, ఇలా రోజువారీ ప్రతి మనిషికి అవసరమయ్యే విషయాలపై తయారు చేసే సమాచారానికి మన దేశంలో కోట్లలో వీక్షకులున్నారు.

గూగుల్‌-కెపిఎంజి నివేదిక ప్రకారం మన దేశంలో 23 కోట్ల జనాభా భారతీయ భాషల్లో ఇంటర్నెట్‌ ను వాడుతోంది. ఆంగ్లంలో ఈ సంఖ్య 17.5 కోట్లు మాత్రమే. 2021 నాటికి 75 శాతం భారత ఇంటర్నెట్‌ వాడుకరులు తమ మాతృభాషల్లోనే ఇంటర్నెట్‌ వాడతారని అంచనా. ఆ రాబోయే జనాభాకు తగిన సమాచారాన్ని రూపొందించుకున్న సంస్థలు, వ్యక్తులు, మాత్రమే భవిష్యత్తు లో నిలదొక్కుకోగలరు.

ప్రతి ఒక్కరికీ, చవకగా, సులువుగా ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం, మన ప్రమేయం లేకుండానే బ్యాంకింగ్‌ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగంతో మనం చేసే సంభాషణలు ఇంటర్నెట్‌ వాహికగా జరగటం వలన మనకు తెలీకుండానే మనం ఇంటర్నెట్‌ వాడుకరులము అయిపోయాం. ఆ విధంగా ఇంగ్లిష్‌ లో మాత్రమే అందుబాటులో ఉన్న సేవలు భారతీయ భాషలకు మారటం అనివార్యమయింది. 68 శాతం భారతీ యులు ఆంగ్లంలో కన్నా తమ సొంత భాషల్లో ఉన్న సమాచారాన్నే వినియోగిస్తున్నారు.

సరిగ్గా ఇక్కడే నేను చెప్పదలచిన విషయాన్ని ప్రస్తావిం చాలి. ఇంత ఎక్కువ స్థాయిలో భారతీయ భాషల్లో నాణ్యమైన సమాచారానికి మార్కెట్లో డిమాండ్‌ ఉన్నప్పటికీ, ఆ డిమాండ్‌ కి సరిపోయే సమాచారం అందుబాటులో లేదు. పేమెంట్‌ గేట్‌వేలు కావచ్చు, సమాచార పత్రికలు కావొచ్చు, చాటింగ్‌ చేసే అనువర్తనాలు కావచ్చు. వీటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది.

60% భారతీయుల ప్రకారం మన భాషల్లో ఆయా సేవలు లేకపోవడం వలన సింహభాగం వాడుకరులు ఆ సేవ లను వాడేందుకు ముందుకు రావటం లేదు. పైన చెప్పిన గూగుల్‌ - కెపిఎంజి నివేదిక కోనం జరిపిన సర్వేలో 88% మంది భారతీయులకు ఆంగ్ల వాణిజ్య ప్రకటనల కన్నా భారతీయ భాషల వాణిజ్య ప్రకటనలు ఎక్కువగా ఆకర్షించాయట.

రాబోయే. 5 ఏళ్ళలో ఇంటర్నెట్‌ వాడుకరులుగా రాబోయే వారిలో 90 శాతం భారతీయ భాషలవారే ఉంటారని అంచనా.

దీనికి తోడు భారత ప్రభుత్వం డిజిటల్‌ లిటరసీ పేరుతో 2021 నాటికి కనీసం 60 వేల గ్రామీణ కుటుంబాలు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్‌ వాడే దిశగా ప్రాణాళికలు రూపొందించింది. ఆహ్లాదం కోసం, వార్తల కోసం, ఆన్‌లైన్‌లో షాపింగ్‌, బ్యాంకింగ్‌ సేవలు, ఇలా అన్ని రంగాలలో భారతీయ భాషల్లో వాడకం బీభత్సంగా పెరిగిపోయింది. మరింత ఎక్కువగా రాబోయే రోజుల్లో పెరగనుంది. ఇలాంటి సందర్భంలో భారతీయ భాషల్లో, మన సందర్భంలో తెలుగులో విషయ సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చే వ్యక్తులకు చేకూరే లాభం చాలా ఎక్కువ. ఆయా రంగాలలో ఇప్పటికే విజయాన్ని సాధించిన సంస్థలకు భారతీయ భాషల్లో నాణ్యమైన విషయ సమాచారం అందించే ఉద్యోగుల అవనరం రానుంది.

8

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019