పుట:Ammanudi-June-2019.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'అయ్యయ్యో మేస్టరు ఏమయిపోయెనో' అనుకొంటా ఆ మబ్బు (చీకటి) లోనే పడతా లేస్తా మేస్టరోళ్ల ఊరికి పోయిండాడు. పొయి సూస్తే ఏ ముండాది, ఇరవైసార్లకు పైన్నే బేదికొట్టి సుస్తయిపొయిండాడు మేస్టరు. ఇదేమో కాయిల (జబ్బు) అనుకొని, అంత పొద్దులో పేటలోని ఆసుపత్రికి పోలేక, గచ్చాకు పుచ్చాకు వైదిగం పేసుకొంటా ఉండాడు.

“ఎవరో సిన్నోళ్లు నీకు బేదిమందును ఇచ్చేసిండారు మేస్టరు. సడే పోనీ, నీ కడుపులో ఉండిన కచడా అంతా పొయి, శుద్దమాయె. దీనికి మందు మజ్జిగన్నమే” అని సెప్పి, మజ్జిగన్నాన్ని తినిపించి, మేస్టరు కడుపును సల్లసేసి వచ్చెనంట ఆయప్ప.

ఇంత జరిగినా మా మేస్టరు బుద్ది మారలేదు. సిన్నోళ్లని దంచేదాన్లో మొనగాడు మా మేస్టరు.

అకాశవేణే ఏడిసె

మేస్టరు సుస్తుపడి లేసి రెండునాళ్లు కూడా కాలేదు. ఎప్పుడట్లానే మేము ఇస్కొలుకు పోయి మాపుసరి ఇండ్లకు తిరుక్కొంటిమి. ఫొద్దప్ప (సూర్యుడు) పడమరమ్మతో ఇంకా అరట్లు (బాతాకానీ) కొడతానే ఉండాడు. నల్లని మొయిలు ఒకటి పడమరకు వాలింది. ఊరినంతా గబ్బుమబ్బు తబ్బు (కౌగిలించు) కొనింది. పేటకు పోయిండిన మా పెద్దోళ్లు గోడుగోడుమంటా ఇండ్లకు వచ్చిరి.

“గాంధీ మహాత్మున్ని తుపాకితో కాలిసి సంపేసిరంట. పెపంచమంతా శానా వెతపడతా ఉండాదంట. పెద్దపెద్ద నాయకులే కాదు, మనదేశ ప్రదానమంత్రి నెహ్రూ కూడా ఏడిసేసెనంట. ఓసూర్లో ఆకాశవేణే (రేడియో) ఏడుస్తా ఉండాదప్పా” అంటా వాళ్లూ ఏడిసేసిరి.

“రేయ్‌, మన మేస్టరు ఎట్లుండాడో సూసి వస్తాము పదండ్రా” అని ఎవరో అంటే, పెద్దోళ్లూ సినోళ్లూ అందరమూ కలిసి ఒక పది పదైదుమంది బయలుదేరితిమి.

మా మేస్టరు వాళ్లింటి జగిలిమీద నెత్తిన బట్టేసుకాని కూకోనుండాడు. మమ్మల్నంతా సూసి, “పరంగోళ్లట్ల చత్రవర్తులనే మన దేశం నింకా తరిమేసి సొతంత్రం తెచ్చేనే, అట్లా మహాత్మున్నే సంపేసిరే. ఇంక ఈ నేల ఉంటుందా, న్యాయమునూ సత్యమునే సంపేసినంక ఈ కాలము నిలుస్తుందా, ఊహూ, ఇంక సత్యానికి కాలము లేదప్పా” అంటా అంగలార్సినాడు.

మరుసనాడు మా ఇస్మోలు సిన్నోళ్లని కొందరిని, ఓసూరు పేటకు పిలుసుకొని పొయినాడు మా మేస్టరు. తాలూకాపీసు తావ (దగ్గర), బెంగుళూరు రేడియో నిలయానికి మైకు పెట్టిండారు. మైకులో పెద్ద సద్దుతో ఏడుపురాగాలు వస్తా ఉండాయి. నడుమ నడుమ రకరకాల బాసల్లో గాంధీతాత కతల్ని సెస్తా ఉండారు. ఆ రాగాలను వినే మా పల్లెల్లో అంతా ఆకాశవేణి ఏడస్తా ఉంది అనుకొనిరి.

పెద్దబాలశిక్షే భగవద్గీత

“ఎన్ని వాచకాలు సదివినా పెద్దబాలశిక్ష ముందు తక్కువే” అంటా ఉంటాడు మా మేస్టరు. మాయబ్బోళ్తకు సెప్పి, ఓసూరునింకా పెద్దబాలశిక్ష నరసింహశతకము, అమరకోశము అనే మూడు పుస్తకాలను తెప్పించినాడు మేస్టరు. ఈ మూడు పుస్తకాలనూ సదివి తెలుసుకొంటే పెపంచములో ఎక్కడైనా బతకొచ్చునంట. ఇరవైమంది సిన్నోళ్లము ఈ పుస్తకాలమీద పడితిమి. సదవతుండే మాకంటే నేరిపిస్తుండే మా మేస్టరే ఎక్కువ కష్టపడతా ఉండాడు. పెద్ద బాలశిక్ష, నరసింహశతకము పరవాలేదు, మా మూళ (బుర్ర) కు ఎక్కిపోయె. కానీ అమరం ఉందే మమ్మల్ని ఉతికి పిండేసె. నేనూ ఇంకొక ఇద్దరు ముగ్గురు తప్పితే, మిగతావాళ్లు అమరం పేరు వింటేనే నిక్కర్లు నానిపేస్తా ఉండారు. “యస్యజ్ఞానాదయాసింధోరగాదస్యానగాగుణః అనే మొదటి శ్లోకము వచ్చేతలికి మేస్టరుకే జెరము వచ్చేసె. దాంతో అమరాన్ని పక్కకు పెట్టేస్తిమి. నిజముగానే పెద్దబాలశిక్ష మాకు శానా నేరిపించె. దినాల పేర్లు నెలలపేర్లు, ఏడాదులపేర్తు, అంకెలు, ఒక్కట్లు (ఎక్కాలు), ఒకటి కాదు రెండు కాదు, పెద్దబాలశిక్షను సదివి ఎన్నో నేరిస్తిమి.

వేమన - రామదాసు

ఒకనాడు మా మేస్టరు “ఈ పొద్దు మీకు కొత్త పాటము సెప్తా ఉండాన్రా. బాగా వినుకోని అర్తము సేసుకోండి” అనె. మేమంతా ఈ కొత్త పాటము ఎట్లుంటుందా అని రవంచ ముందరకి వంగితిమి. అమరములోని శ్లోకాలను సదివేకి నోరు తిరగక దెబ్బలు తినిన సిన్నోళ్లకయితే, ఇదేమి పాటమో ఎట్లుంటుందో అని సెమట్లు పట్టె.

“ఉప్పుకప్పురంబు నొక్కపొలికనుండు / చూడజూడ రుచుల జాడవేరు / పురుషులందు పుణ్యపురుషులు వేరయా / విశ్వదాభిరామ వినురవేమ: దీనిని: వేమన పద్యం అంటారు...” అంటా. మేస్టరు ఇంకా ఏమో సెప్తా ఉండాడు. మాకందరికీ నగవు వచ్చేసె. లేకపోతే ఇది పొయి పాటమా!

మేము ఇంతగా ఆశ్చర్యపొయిందానికి కారణం ఉంది. మా తావున అన్ని పల్లెల్లోనూ వేమన పద్దెము తెలియని మనిషే ఉండడు. పెండ్లి అయినంక, పెండ్లి జంటను ఊరంతా మెరవణి (ఊరేగింపు) చేస్తారు. అట్లే ఊరుపండగలపుడు ఊరుదేవతల్ని మెరవణి చేస్తారు. మెరవణి నడిసేనపుడు ముందు డొలు కొలువు (సన్నాయి) తో మంగలోళ్లు పోతా ఉంటారు. నాలుగయిదు ఇండ్లకు ఒక తావ మెరవణి నిలుస్తుంది. అప్పుడు ఆ ఇండ్లలో వాళ్లు బయటికి వచ్చి, మంగలోళ్లకి కాలణా అర్జణా ఇచ్చి ఫొగడమంటారు. మంగలోళ్లు కొలువును నిలిపి, “ఉప్పుకప్పురము ఒక్క పోలికనుండు...వినరా వేమా అన్నట్టు, ఎవరయ్యా అంటే నందేల రామరెడ్డిగారు పెండ్లిజంట బాగుండాలని, అర్దణా ఇచ్చి బోగొప్పగా బోయశస్సుగా పొగిడించి రహో” అని పొగడతారు. ఇట్ల మెరవణి ముగిసేలోగా నూరు వేమన పద్దేలన్నా 'సెప్తారు. మంచి కార్యాలపుడే కాదు, ఎవరన్నా తీరిపోయినపుడు, పీనిగ ముందు పలకకొట్టే వాళ్లు కూడా వేమన పద్దేలు సెప్పి పొగడతారు. ఆవులు మేపే సిన్నోళ్లయినా, మడకదున్నే మైనీర్లయినా, బండ్లు తోలే పెద్దోళ్లయినా, ఇంటి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి *జూన్‌ - 2019

45