పుట:Ammanudi-June-2019.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నంద్యాలగాడిని అయిన నేను, ఇదీ మా ఇస్మూలు జట్టు. మా పనులూ పుట్టులూ సూసి ఈ అడ్డ పేర్లను మేమే పెట్టుకొనింది. “నారాయణరెడ్డి అనే పేరుతోనే ముగ్గురము ఉండాము. ఒకనీకేమో రవంత బిక్కిలి (నత్తి), వానిని పేరడిగితే “నా...నాట్టి” అనేవాడు. దానీకే వానీపేరు “నానాటి” అయిసోయె. “తొణ్జెకత్తలను తరిమి సంపేసి, పూడ్చిపెట్టేసి, తిరగా ఐదునాళ్లకు తోడితే కాసులు సిక్కుతాయంట్రా. దోవలా పడిపోయిన కాసుల్నంతా మింగి కడుపులో పెట్టుకోనుంటాయంట అవి” అని రాముడు మా కందరికీ సెప్పి నమ్మించె. ఒకరికొకరికి తెలీకుండానే మేమందరమూ ఆడాడా తొణ్జెకత్తల్ని సంపి పూడ్చి పెడితిమి. నాలుగైదునాళ్లు అయినంక ఆశగా తోడిసూస్తే, కాసుల కత పత్మన పెట్టండి, గబ్బుకు మా ముక్కులు పగిలిపోయి. అపుటి నింకా రాముడి పేరు తొణ్జెకత్తల రాముడు అయిపోయె. పుట్టారెడ్డిగాడు పుట్టోడు అయితే, మా జట్టులో పెద్దోడుగా ఉండి, మా మీద పెత్తనం చేస్తా, మేస్టరు దగ్గిర 'మానిటర్‌” అని పిలిపించుకోనే పుట్టిగాడు మేవేట్రు పుట్టిగాడు అయిసోయె.

దినమూ పొద్దున్నే సద్దులు తిని మైలు దూరంలోని ఇస్మోలుకు పోయేది, మద్దేనము ఊరికి పారొచ్చి (పరుగెత్తి వచ్చి), అన్నము తిని గంట కొట్టే లోగా పారిపారి చేరుకొనేది అంతా ఒక ఆట మాకు. మాపుసరి (సాయంత్రం) ఇంటికి పోయేటపుడు ఎన్నెన్నో ఆటలు మావి. మానులెక్కి ఆడే కోతికొమ్మాటలు, చెండాటలు (బంతాట గుడుగునాటలు (కబడిి), పారే పంద్యాలు...ఇట్ల ఆటలే ఆటలు.

మాపుసరి ఇంటికి పొయ్యేనపుడు రెండు జట్లుగా చీలి పోతాము. దోవలో ఒక ఛిన్న గుట్ట ఉంటుంది. ఆ గుట్టమీద ఛిన్న చిన్న కాలవల మాదిరి తొగి (త్రవ్వి) పెట్టుకోనుంటాము. కాలవ పై కొసన ఉచ్చపోస్తే, అది కొనకంటా పారి, అక్కడ మేము నాటి పెట్టిండే మామిడి మొలకల బుడాలకు చేరాల. అట్ల చేరేనట్ల సోసినోళ్లు పాండవులు, చేరకుంటే వాళ్లు కౌరవులు. అందరమూ పాండవులు కావాలని చెంబులు చెంబులు నీళ్లు తాగేదే పని.

బేదిబెల్లం ప్రసాదం

పుట్టోడు, రామచంద్రుడు, తొ.రాముడు, కొా.కా. కొండడు దినాము మేస్టరు తావ బాగా బెత్తమేట్లు తింటా ఉండిరి. ఏలంటే వీళ్లు శానా మడ్డినాయాళ్లు. శుచీ శుద్దమే ఎరగనోళ్లు, ఎనుము పెరుగు కలిపిన సద్దిని తినొచ్చి ఎపుడూ తూగడదిచ్చేదే(కునికేడే) పని. మేస్టరు వాళ్లబ్బోళ్లని పిలిపించి “ఇట్లా బోజనము పొద్దున్నే పెట్టి పంపద్దండ” అంటేనూ “మాకు ఇంటితావ ఉండేది అదే, మీరు వాళ్లని బాగా బిగిచ్చండ (కొట్టండి) మేస్టరు” అనేసి సోయిరి. ఒకనాడు వీళ్లు సదవకుండా తూగడిస్తా ఉండారు. మేస్టరుకు రేగి పోయింది. అంతే నలుగురినీ గోడకుర్చీ వెయిపించి, అరచేతలను తిప్పమని బెత్తంతో గణుపుల మీద బాగా పులుసు పెట్టీసినాడు.

ఇస్కొల్లో మేస్టరు కొట్టిన దెబ్బల్నీ తొడగిల్లుడుల్నీ వాళ్ల అబ్బొళ్లకి చూపించి దూరు (ఫిర్యాదు) చెప్పిరి ఆ నలుగురూ. “ఇంకా బాగ పడాల మీకు, యేట్లు తింటేనే బుద్దొచ్చేది, పోండ్రా నా కొడకల్లారా” అనేసిరి వాళ్లబ్బొళ్లు. ఇస్కొలుకి పోతే మేస్టరు చేతిలో తన్నులు, ఇంట్లోనే ఉంటే అబ్బొళ్ల చేతిలో పెట్లు, ఏమి సెయ్యాలనేది యోసన సేసి సేసి, ఒక ముడువు (నిర్ణయం) కు వచ్చిరి. మా మేనేట్రు పుట్టి గానికి పిప్పరమెంట్లు లంచమిచ్చి, ఇండ్లల్లో సెప్పద్దని సత్తెం సేపించుకొని, ఇస్కొలుకు నామం పెట్టి, తోటల్లో చేనుల్లోనే ఉండిపోయి, సరిగ్దా ఇస్కొలు విడిసే పొద్దుకు ఇండ్లకు పోతా ఉండిరి. ఎట్లనో కుక్కమూతిగాడు కూడా వీళ్లకి జతయిపోయినాడు. తవళి (అబద్దం) ఎన్నాళ్లు దాగుతుంది! నాలుగునాళ్లకు మేస్టరుకు అంతా తెలిసిపోయింది. ఇంక సూసుకోండప్పా, తోలూడేట్ల కొడతా ఉంటే, వాళ్ల నడుముదారాలకి (మొలతాళ్లకి) సిక్కుకొన్న సడ్డీలు ఊడి పడిపోయె. కుక్కమూతిగానికీ బాగనే పడిండాయి.వాడు మేస్టరు మీద కంటు కట్టుకొనె.

అవేవో జాపాళము విత్తులంట, కుక్క్మమూతిగాని అబ్బ, వాటిని సెబ్బిగా (పక్కంగా) వండి, పుటము పెట్టి, బెల్లంపాకంలో కలిపి ఉంటలు సేసి, బేదిమందుగా అమ్ముతుంటాడు. మా సుట్టుపక్కల ఇరవై ముప్పై ఊర్లలో ఈ మందుకు శానా పేరు. కడుపుల్లో పేగుల్లో శానా ఏండ్లుగా కచ్చకట్టి నిలిసిపోయిండే కసమండాలన్నంతా తీసి శుద్దం చేసేసే మందు అది. పెద్దోళ్లకయితే నాలుగణాలు, సిన్నోళ్ల కయితే రెండణాలు తీసుకొని, నిండు ఉంటనో అర్దముంటనో ఇస్తుం టాడు. ఎట్ల దొంగిలించెనో, వాళ్లబ్బ లేనపుడు, ఈ బేదిబెల్లం మందును, ఒక ఉంటను దొంగిలించి పెట్టుకోనుండాడు కుక్మమూతి గాడు.

కొత్తగా సిన్నోళ్లని సేరిపించేవాళ్లో, తోటల్లో పండించిన వాళ్లో, పేటకు పోయి కొని తెచ్చుకొన్నవాళ్లో, దినమూ ఎవరో ఒకరు అంటి పండ్లను ఇస్మోలికి తెచ్చిస్తుంటారు. వాటి జతకు సెనగపప్పు, బెల్లము, బురుగులు (మరమరాలు) ఉండనే ఉంటాయి. అన్నిటినీ కలిపి ప్రసాదంగా మాకందరికి పంచుతాడు మేస్టరు. అర్జానికి పైగా ఆయనే తినేస్తాడు, మిగిలిండేది మా కందరికీ తలా కొంచెము.

ఒకనాడు కుక్మమూతిగాడు బేదిటెల్లం మందును ప్రసాదంలో కలిపేసినాడు. మాకందరికీ ముందుగానే సెప్పిండాడు కాబట్టి మేము ఉషారు అయిపోతిమి. మేస్టరుకు ఏమి రుసి సిక్కిపోయెనో, ఆపొద్దు ప్రసాదం పంగ పట్టేసినాడు. ఇస్కొలు ముగిసినంక మాపుసరి అందరమూ మావూరి దోవ పడితిమి. ఒకరిద్దరు మా జతగాళ్ళు (స్నేహితులు) తెలియకుండా ప్రసాదాన్ని తినేసిండారు. వాళ్ల కతను సెప్పేదొద్దు, పదిపది అడుగులకు ఒకసారి సడ్డీలను విప్పుకొనేదీ సెట్ల మరుగుకు పారిపోయేది.

“రేయ్ దిగులు పడద్దండ్రా, మీ కడుపులు శుద్దమయిపోతాయి, ఇంటికి పోయినంక మజ్జిగన్నం తింటిరంటే బేది నిలిసిఫోతుంది, అదే దీనికి మందు” అని వాళ్లకి బద్రం సెప్పె కుక్మమూతిగాడు. అక్కడ మేస్టరు గతి ఏమాయెనో!

రెయ్యి సంగటిపొద్దుకు (సుమారు 7 గంటలు) లోపల్నే ఈ సమాచారము కుక్కమూతిగాని వాళ్లబ్బకు తెలిసిపోయింది.

44

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019