పుట:Ammanudi-June-2019.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా జగిలి బడిలో పది పదైదుమంది సిన్నోళ్లము సేరింటిమి. మిగిలిన సిన్నోళ్లని వాళ్ల పెద్దోళ్లు బడికి అంపలేదు. ఇంట్లో పసిబిడ్డల్ని సుదారించేకీ, ఆవుల్నీ గొర్రెల్నీ మేపేకీ పెట్టుకొనేసిరి. మా బడిలో పుట్టిగాడు అనేవాడు, ఒకేడాదో రెండేండ్లో మాకందరికంటే పెద్దోడు. బడి జగిలికి ఇసక తెచ్చేది, ఇల్లిల్లు తిరిగి సిన్నోళ్లని ఈడ్సుకొని వచ్చేది వాని పని. అయ్యవారు లేనబుడు వీడే సిన్న అయ్యవారు. మా అందరి ముందర దోసెడు దోసెడు ఇసకను పోసి నెరిపేదీ వీని పనే.

మొట్టమొదలునాడు మా పెద్దోళ్లంతా ఒకొక సేరు బియ్యమూ, కడ్డీ కర్పూరమూ, పసుపూ కుంకుమా, పువ్వలూ అంటి పండ్లూ తెచ్చిండిరి. అయ్యవారే అందరి ముందూ సేరు పేరు బియ్యాన్ని పోసి, పసుపు కుంకుమ పూలు పెట్టి, కడ్డీ కర్పూరము అంటించి పూజ చేసి, అంటిపండ్లకు సామ్రాణికడ్లను కుచ్చినాడు. గమ్మనే గముల నడుమ సరస్వతి, విగ్నేశ్వరుల పద్యాలను పలికించినాడు. ఆమీట (తరువాత) మా వేలుని పట్టుకొని మా ముందరుండిన బియ్యములో ఓం” అని రాపించినాడు. అందరి చేతా రాపించినంక, వచ్చిండే వాళ్లకందరికీ ఒకొక అంటిపండుని ఇచ్చి, కండ్లకు అద్దుకొని తినమ న్నాడు. మా పెద్దోళ్లంతా మా చేత గోవిందా గోవిందా” అని గోవిం దలు పెట్టించి, ఇండ్లకు పోయిరి.

అనెంక, ఆ బియ్యాన్నంతా ఎత్తి సంచికి నింపి, ఇంటికి సేరిపించినాడు అయ్యవారు. పుట్టిగాని సేత మా ముందు దోసెడు దోసెడు ఇసకను పోపించి, ఇసకలో మా సేత 'ఓం 'రాపించినాడు. ఇట్ల ఒక పదిదినాల్లో అందరమూ 'ఓం” రాసేది బాగా నేరిస్తిమి. అనెంక, ఇంకొక అచ్చరము 'న ' పది దినాలు అటెంకటెంక (తరువాత్తరువాత) పదిపది దినాల్లో 'మః, శి, వా, యః, సి, ద్ధం, న, మళ అచ్చరాలని నేరిసేస్తిమి. ఇంకొన్నాళ్లకు ఇసకను వెలుపుగా సోపించి, అన్ని అచ్చరాలనూ కలగలిపి రాసేది నేర్పించినాడు అయ్యవారు.

ఇట్ల ఒక ఆరునెలలకు అందరమూ ఓనమాలను నేర్చుకొనేస్తిమి. మా పెద్దోళ్లకంతా బలే కుసీ (సంతోషం) అయిపోయె. “మా సిన్నోడు ఓనమాలు నేర్చీసెనప్పో” అని సెప్పుకొంటా ఉండిరి. కొందరి అబ్బోళ్లు అయితే “ఇంకేమి, మా సిన్నోడు ఓనమాలు నేర్చింది ఆయె కదా” అని గొరైలు మేకల్ని మేపేదానికి వేసుకొనేసిరి. “ఇంతే కాదస్పో, ఇంకా శానా నేర్పాల, సిన్నోళ్లని అంపియ్యండి” అని అయ్యవారు నోరు కొట్టుకొంటేనూ విన్లేదు. కొందరు పోయినా, కొత్తగా ఇంకొందరు చేరేసిరి. అయ్యవారి గాసానికి కుందకం (లోటు) కాలేదు.

ఇట్లా సమయములోనే, ఒకనాడు ఓసూరు సంతకు ఫోయిండిన మాయబ్బోళ్లు, ఏలనో రాత్రికంటా (వరకూ) రానేలేదు. ఎబుడు సంతకు పొయినా మట్టమద్దేనముకే వచ్చేస్తా ఉండిరి. వచ్చి, ఎవర్నీ దగ్గరకు రానీకుండా పొడిసే ఎద్దులకూ గూళికుర్రలకు (గిత్తలకు) నీళ్లూ మేపులూ సూస్తా ఉండిరి. “ఏల ఈపొద్దు వీళ్లు ఇంకా రాలేదే 'అని ఆడోళ్లూ, బోండాల ఆశతో సిన్నోళ్లూ దోవలు సూసిసూసి సాలాయె. పొద్దుగువ్వ పడమటి గూట్లో ముడుక్కోని శానా పొద్దాయె. రెయ్యి సంగటి పొద్దుకు అంతా వచ్చి ఇండ్లు చేరిరి.

“ఈపొద్దే మన దేశానికి సొాతంత్రం వచ్చీసెనంట. ఓ సూరంతా, సంతపేటంతా, వీదుల్లో అంతా బలేబలే వినోదాలూ విసిత్రాలూ నడస్తా ఉండె. రోకలాటలు, కోలాటలు, కీలుగుర్రాలు, డికాంబరాటలు, పలకలాటలు, నెమిలాటలు, ఎద్దాటలు, నయ్యాండి కుణుసులు (విందులు) సిక్కినోళ్ల నోట్లో అంతా తీపులు కుక్కేది, పానకాలూ పెసర బేడలూ (వడపప్పు) పంచేది జరగతా ఉంటే తినుకోనీ సూసుకోనీ ఉండిపోతిమి. దానికే ఇంత పొద్దాయె” అని సెప్పిరి పెద్దోళ్లు ఆ రెయ్యీ మరుసనాడూ ఇంకోనాడూ, మూనాళ్లూ అన్ని ఊర్లల్లానూ సందడే సందడి. సిన్నోళ్లూ పెద్దోళ్లూ అందురూ 'గాంధీజీకీ జై, భారతమాతకూ జై” అని కుశాలుగా కూతలు పెట్టిందే పెట్టింది. మా అయ్యవారిని అయితే మా వూర్లో వాళ్లూర్లో పక్ళూర్లల్లో అంతా ఫొగిడిందే పొగిడింది.

ఓనమాలు అయినంక అ ఆ ఇ ఈ లు నేర్చేకి సురువు సేసిరి అయ్యవారు. ఇంకో ఆర్నెల్లకు ఒక పదైదుమంది సిన్నోళ్లం గుణిం తాల్లోకి వస్తిమి. 'క, క కు దీర్గమిస్తే కా క కు గుడిస్తే కి, గుడి దీర్జమిస్తే కీ క కు కొమ్మిస్తే కు, కొమ్ము దీర్లమిస్తే కూ ' అని రాగాలు తీసితీసి రాసి రాసి వాటినీ ఆరునెలల్లో నేరేస్తిమి.

అనెంక ఒకనాడు అయ్యవారు మా పెద్దోళ్లని పిలిపించుకొని “సూడండప్పా మీ సిన్నోళ్లంతా వాచకాలకు వచ్చీసిరి. ఒకటో తరగతి వాచకాలు మదరాసునింకా ఓసూరికి తెప్పించి పెట్టింటారు. మీరంతా నాలుగునాలుగణాలు ఎత్తుకోనిఫొయి, వీళ్లందరికీ వెంకట్రామా అండ్ కో వాచకాలను ఈపొద్దే కొనిక్కోని వస్తే, రేపు శుశ్రారంనాడు సరస్వతి పూజ పెట్టి, ఆరంబము సేసీస్తాను ' అని పురమాయించె. మాయబ్బోళ్ల కుసీని సెప్పేకి కాదు, “ఇంకేల, మా సిన్నోడు వాచకము సదివే వాడాయెనప్పో” అని సిక్కినోళ్ల దగ్గరంతా సెప్పుకొనేదే.

ఇంతలో సర్మారోళ్లు పంచాయితిలోని పెద్ద ఊరికి ఒక బడిని పెట్టిరి మా అయ్యవారట్ల అయ్యవార్లనే శానా బడులకు మేస్టర్లుగా చేసిరి. మా అయ్యవారు కూడా మేస్టరైపోయి, ఆయప్ప సొంతూరులో ఏరుపాటు అయిన ఇస్మోలుకే మేస్టరు అయినాడు. బడి అనే పేరు ఇస్మోలుగా, అయ్యవారు అనే పేరు మేస్టరుగా మారిపోయె. మా వూరి సిన్నోళ్లమంతా ఒక మైలు దూరంలోని ఆ పెద్దూరి ఇస్మోలుకే సేరిపోతిమి.

పుట్టోడు, రామచంద్రుడు, నానాటిగాడు, మేనేట్రు పుట్టిగాడు, నేత (లేత) రెడ్డి, టీనారెడ్డి (టి. నారాయణరెడ్డి), కుక్మమూతి (కృష్ణమూర్తి), కొక్కిరి (దొడ్డి) కాళ్ల కొండడు, తొణ్జెకత్తల (తొండల) రాముడు, ఒకే ఒక ఆడబిడ్డ మల్లమ్మ,

పరభాషా దేషం, పరభాషా దాస్యం - రెండూ తప్పులే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019

43