పుట:Ammanudi-June-2019.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కోలాటలు, కేళికలు, పండరి బజనలు, తోలుబొమ్మలాటలు, కాయ్యబొమ్మలాటలు, యచ్చగానాలు; పండగలో ఎద్దులకు కుచ్చులు పెరికేది వరసతడుకు పందగనాడు వసంతాలు చల్లుకొనేదీ అడుగడుక్కీ తెలుగుపాటే, పలుకుపలుకూ తెలుగుమాటే. అట్లుండిన మా వూరికి పొయ్యేసొద్దాం పదండి.

బడులు పోయి ఇస్కొళ్లొచ్చె

“ఒరే పుట్టిగా, ఏమిరా సేస్తా ఉండావు? దినమూ పొద్దున్నే పొయి అందరు సిన్నోళ్లనీ తోడుకొనిరారా అని ఎన్నాళ్లు సెప్పేది నీకి?” అని గదర్తా ఉండాడు అనుమంతప్ప అయ్యవారు. సిన్నోళ్లకి రవంచ సదువు సెప్పీమని పక్కూరినింకా ఈయప్పని తోడుకొని వచ్చిండిరి మా నల్తూరు అగ్రారము ఊరి పెద్దోళ్లు.

సొతంత్రపోరాటము జరగతా ఉండిన కాలమది. ఈ అయ్య వారు ఊరికే ఉండకుండా ఒకనాడు 'గాంధీజీకి జై ' అనెనంట. అంత మాత్రానికే కుంపిణి సర్మారోడు ఈయప్పని తడుకుతా (వెళుకుతా) ఉంటే, గుట్టుగా తలదాపుకొన్నట్లుంటుంది, సిన్నోళ్లకి సదువు నేర్చినట్లుంటుంది అని మావూరికొచ్చి టికాణేసిండాడు.

మా అయ్యావారట్లా వాళ్లని తడికేకి, సర్మారు కోలుగార్లు (పోలీసులు) ఊరూరికి వస్తా ఉండిరి. “రేయ్‌ బద్రంరా, అయ్యవారు మనూర్లా ఉండాదని ఎవరికీ 'సెప్పద్దండ్రా” అని మా పెద్దోళ్లు మాకు ఎచ్చరిక సేస్తా ఉండిరి.

సదివే సిన్నోళ్ల అబ్బోళ్లు, ఏడాదికింత దవసము (ధాన్యం) కూరాకులూ కాయాకరుసులూ ఈ అయ్యవారికి ఇచ్చేనట్ల మాట్లాడి పెట్టించారు. ఊరినడుమన కరేదారుని (మునసబు) జగిలి (అరుగు) ఇసిరం (విశాలం) గా ఉండె. ఆడ మా తొలి సదువు సురువయింది.

42

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ - 2019