పుట:Ammanudi-June-2019.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విధంగా ఆధునీకరణం అni కూడా అనవచ్చు. కొన్ని ఉదాహరణలు చూడవచ్చు. ఇంతకుముందు కాలంలో గ్రామంలో పెండ్లి అయితే తాటాకు పందిళ్ళు వేసేవారు. అది ఆ సంవత్సరం అంతా ఉండేది. ఇక పెద్దపెద్ద పాత్రలు ఉన్న వారి ఇండ్ల నుండి అరువుకు తెచ్చుకునేవారు శుభకార్యం అంటే వారు కూడా కాదనకుండా ఇచ్చేవారు. అంటే దాదాపుగా గ్రామంలో ఉండే వస్తువులే పెండ్లి కార్యక్రమాలు అన్నింటిలో ఉండేవి ఉపయోగపడేవి. మేళతాళాలు వాద్యగాళ్ళు మాత్రం అన్ని గ్రామాలలో ఉండేవారు కారు పక్క ఊరు నుండి రావలసి వచ్చేది. కాని నేటి కాలంలో టెంట్‌ హౌస్‌ లు చాలా పెద్దగ్రామాలలో వచ్చాయి. ఒక గ్రామంలో లేకపోయినా పక్క గ్రామాలనుండి తెప్పించుకుంటున్నారు. సామాను టెంటులు టేబుళ్ళు కుర్చీలు, క్రాకరీ మ్యూజికి బ్యాండ్‌ విత్‌ వెహికిల్‌ యూనిఫామ్‌ లు అన్నీ పల్లెకి వచ్చాయి. ప్లెక్సీ బానర్లు, వాటర్‌ బాటిళ్ళు, వీడియోలు డిజిటల్‌ ఫోటోలు, మానీటర్లో చూడడాలు, సిడి ఆల్బమ్‌ లు ఇన్ని వచ్చాయి. పాత ఆచారాలకు చెందిన పదాలు అన్నీ పోయి ఇక్కడ చెప్పుకునే కొత్త పదాలు అన్నీ వచ్చాయి. ఎన్నో ఇంగ్లీషు పదాలు జానపదుల వ్యవహారంలోనికి వచ్చాయి.

కరెంటు లేని ఇల్లు కనిపించదు. ఈ కరెంటుతో పాటు చాలా ఇంగ్లీషు పదాలు వ్యవహారంలోనికి వచ్చాయి. బల్బు, ఫాను, ఎసి, స్విచ్చులు, లైట్లు, బోర్జులు, మిక్సీలు, గ్రైండర్లు వాషింగ్‌ మెషిన్లు, ఇలా చాలా గృహోపకరణాలు సంప్రదాయమైనవి పోయి కొత్తవి వచ్చాయి. వాటితో పాటు తెలుగు మాటలు పోయి ఇంగ్లీషు పదాలు వ్యవహారంలోనికి వచ్చాయి.

కొత్త కొత్త ఆహారాలు, వాటి పేర్లు నిత్యవ్యవహారంలోనికి వచ్చాయి. వైట్‌ రైస్‌, సాంబార్‌ రైస్‌, ఫ్రైద్‌ రైస్‌, ఘీ, కోకోనట్‌ రైస్‌, కర్ట్‌ రైస్‌, బటర్‌ మిల్మ్‌ పాల పాకెట్లు, క్రైట్లు కాన్సు ఛాట్, పానీ పూరీ, పావ్‌ బాజీ, బిర్యానీ, యగ్‌ బిర్యానీ వెజ్‌ బిర్యాని, మటన్‌, చికెన్‌ బిర్యానీలు, ఇలా చాలా పదాలు నిత్య వ్యవహారంలోనికి వచ్చాయి. టీవీ ఛానళ్ళలో వంటల కార్యక్రమంలో చూపించి మాట్లాడే మాటలన్నీ ఇంగ్లీషులో లేదా హిందీలో ఉంటాయి. దాదాపు ఆ పదాలు అన్నీ జానపద భాషలో నిత్యవ్యవహారంలోనికి వచ్చాయి. చదువుకోని వారుకూడా తాలింపు వేశావా బదులు ఫ్రైచేశావా అని డీప్‌ ఫ్రై చేయి అని చెప్పుకుంటున్నారు. చివరికి గోరింటాకు కూడా పోయి మెహాందీ వచ్చింది. మెహందీ పాకెట్లు ఊరి కిరాణా దుకాణంలో అమ్ముతున్నారు. పల్లెల్లోకి బ్రైడ్‌ మేకప్‌ వచ్చింది. బ్రైడల్‌ సారీలు, బ్రైడల్‌ ఫినిషింగ్‌లు వచ్చాయి. దగ్గరిలోని పట్టణంనుండి నాగరికత అంతా అతి సునాయాసంగా ఊర్లోనికి అడుగు పెడుతూ ఉంది. దీనితో వచ్చే పదసంపద అంతే దేశ్య పదజాలాన్ని అంటే జానపద వ్యవహారాన్ని తోసి రాజని నిలబడుతూ ఉంది.

ఆహారపు అలవాట్లు దుస్తులలో కూడా చాలా మార్పులు వచ్చాయి. పంచె కట్టు తగ్గింది. పాంట్లు షర్టులు వేసే వారు చాలా ఎక్కువగా ఉన్నారు. పొలం పనులు చేసేటప్పుడు కూడా పాంట్లు వేసే వారు కనిపిస్తున్నారు. నరేగా పనులు చేసే వారిలో కూడా ఆడవారు షర్టులు ధరించడం మగవారు పాంటులు థరించడం కనిపిస్తూ ఉంది. యుక్తవయస్సులో అమ్మాయిలు లంగా ఓణీ వేసుకోవడం పూర్తిగా మరిచారు. పంజాబీ సల్వార్‌ కమీజు అమ్మాయి అందరికీ సర్వసామాన్యమైన డ్రస్‌ అయింది. వీటి ప్రభావం అంటే ఆహార విహారాలలో ప్రభావం భాషమీద ఉంది. ప్రేమలు ప్రేమ వివాహాలు, కులాంతర ప్రేమలు వాటి దుష్పరిణామాలు యువతీ యువకుల మధ్య భిన్న భిన్న సంబంధాలు ఏర్పడడానికి టివీ దాని ద్వారా వ్యాపించిన సినిమా చాలా వరకు కారణం ప్రేరణం అవుతూ ఉంది. ఈ సామాజిక పరిణామం కూడా భాష మీద ప్రభావం వేస్తూ ఉంది.

వృత్తులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. మాండలిక వృత్తి పదకోశాలలో నాలుగు ఐదు దశాబ్దాల క్రితం సేకరించిన పదాలు నేడు చాలా వరకు కనిపించవు. కారణం వ్యవసాయం చాలా వరకు యాంత్రీకరణ అయింది. దానికి సంబంధించి చేసే వడ్రంగం పని చెక్కపనిముట్లు పోయినాయి. మరనాగళ్ళు ఇనప నాగళ్ళు వచ్చాయి. దీని కారణంగా వ్యవసాయ వృత్తి పదాలు పోయాయి. వడ్రంగం పనిలో పూర్తిగా యాంత్రికీకరణ వచ్చింది. సాంప్రదాయికంగా ఉన్న వృత్తి పనిముట్లు పోయాయి వాటి పదాలు కూడా పోయాయి. కోయడం దగ్గరనుండి దూగోడు పట్టడం దగ్గరనుండి పిడిశానలు, ఉలులు అన్నీ పోయి బెజ్జాలు కొట్టడం, కూసాలు చేయడం ఈ పనులన్నీ యంత్రాలు చేస్తున్నాయి. వృత్తి జానపదంలో ఈపదాలు అన్నీ అంతరించాయి. ఇలా ప్రతి వృత్తిలోను సంప్రదాయిక పనిముట్లు పనితీరు పోయింది లేదా చాలా మారింది. దానికి అనుగుణంగా భాషకూడా మారింది. స్వర్ణకార వృత్తిలో పదాలు చేనేతలో చాలా పదాలు కొత్తవి ఇంగ్లీషువి వచ్చి చేరాయి.

రెండు మూడు దశాబ్దాల క్రితం దాకా ధాన్యం కొలతలు, ద్రవం కొలతలు దూరం కొలతలు తెలుగులో ఉండేవి. ధాన్యం కొలతలు గిద్దె, సోల, తవ్వ, మానిక వంటి పదాలు పోయి కిలోలు వచ్చాయి. ద్రవం కొలతులు కూడా లీటర్లు వచ్చాయి. బరువు కూడా శేరు అర్థశేరు, వీశె, కట్టు, మణుగు వంటి సంప్రదాయక పదాలు వ్యవహార లుప్తం అయ్యాయి. అన్నీ కిలోలు, గ్రాములే జానపద వ్యవహారంలోనికి వచ్చాయి.

పైన చెప్పిన అన్ని ప్రభావాల కారణంగా జానపద భాషలో వచ్చిన పరిణామాన్ని ఒక సారి గమనించవచ్చు. పైన భద్రిరాజు కృష్ణమూర్తిగారు చెప్పిన ఎనిమిది విధాల వైవిధ్యాలు ఇప్పుడు జానపద భాషలో కనిపించడం లేదు. వారు శిష్ట భాషకి జానపద భాషకి మధ్యనున్న వైవిధ్యాలను చెప్పడానికి ఎనిమిది విధాల భిన్నత్వాలను సూచించారు. వారు చెప్పిన ఎనిమిది విధాల జానపద భాషాలక్షణాలు గమనిస్తే నేటికి ఉన్న పరిణామాన్ని చూడవచ్చు.

1. జానపద భాషలో ఒత్తులు నిలవవు అని ఉన్న సూత్రీకరణలో ఆ పరిస్థితి పూర్తిగా లేదు. ఒత్తులు నిలిపి మాట్లాడే వారి సంఖ్య బాగా పెరిగింది.

సాంత భాషను అణగద్రాక్కి సంస్కృతిని కాపాడలేరు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

17