పుట:Ammanudi-June-2019.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాక్యాన్ని రాశారు. “దేశీయమగు సరళ మార్గమున వ్యాకరణాలంకార నియమములకు కట్టువడక అలతియలతి పదములతో అప్రయత్న ముగా సహజముగా వెలువడెడు వ్యావహారిక భాష” అని దీన్ని అన్నారు. అలాగని రామరాజు గారు జానపదభాషని వ్యాకరణ విరుద్ద భాష అని అన్నారని అర్థం చేసుకోకూడదు. శిష్టభాషకు వర్తించే వ్యాకరణానికి విరుద్దమైన భాష అని మాత్రమే వారి భావం. కారణం వారే, ఇదే అధ్యాయంలో జానపద భాషకు వేరే వ్యాకరణమే రాయాలని నిక్కచ్చిగా చెప్పి దాన్ని ప్రత్యేకంగా వర్ణించి వ్యాకరణం రాయాలి అని అన్నారు. అయితే రామరాజు గారు జానపద భాషని గురించి రాసింది 1956 ప్రాంతంలో ఇక భద్రిరాజు కృష్ణమూర్తి గారు జానపద భాష లక్షణాలను గురించి రాసింది 1973 ప్రాంతంలో. కాగా నేటికి ఈ పరిశీలన చేసి దాదాపు ఐదు దశాబ్దాలు గడిచింది. నేడున్న సామాజిక పరిస్థితిలో వచ్చిన పరిణామాలను పరిశీలిస్తే నేటి జానపద భాషలో వచ్చిన పరిణామాలను పరిశీలించవచ్చు. అందుకే నేటి సందర్భంలో భాషపైన పడిన ప్రభావాలను పరిశీలన చేద్దాం.

సామాజిక పరిమాణాల కారణంగానే అక్కడున్న కళారంగం ప్రభావితం కావడం మనం గమనిస్తూ వస్తూనే ఉన్నాము. స్వాతంత్య్రొద్యమ కాలంలో ఉద్యమానికి బాసటగా జానపద సాహిత్యం జాన పద ప్రదర్శన కళలని ఉద్యమకారులు పార్టీలు విరివిగా వాడుకొని వారి ఆలోచనలను, వాదాలను సిద్ధాంతాలను బాగా ప్రచారం చేసారు. తెలంగాణ రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో కూడా జానపద కళలను విరివిగా వినియోగించుకోవడం చరిత్ర ప్రసిద్ధం కూడా. ఇక్కడ గమనించాల్సిన విషయం సామాజికంగా జరిగే పరిణామాలు జానపద సాహిత్యం కళలపైన ఎలాంటి ప్రభావం వేసింది అని. ఇలా కాక మరో కోణంలో నమాజంలో జరిగే సాంకేతిక పరిణామాలు, సాంఘిక పరిణామాలు ఆ సమాజంలోని సాహిత్యం అంటే మౌఖిక సాహిత్యం కళపైన ఎలాంటి ప్రభావం వేస్తుంది అని పరిశీలించవలసి ఉంది. జన జీవితంలో వచ్చే తీవపరిణామాలు భాషపైన కూడా గట్టి ప్రభావం వేస్తాయని మనకు ఇటీవల అంటే గడచిన రెండు మూడు దశాబ్టాలలో తెలియవచ్చింది.

నాటక రంగం అదృశ్యం కావడానికి లేదా మరుగున పడిపోవడానికి సినిమా ఎంత బలమైన కారణమో ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. అయినా జానపద కళలు కొన్ని బతికి బట్టకట్టాయి. కారణం సినిమా థియేటర్లు గ్రామాలకు దూరంగా ఉండడం కనీసం తాలూకా కేంద్రానీకి పోయి అదీ ఏ నెలకో రెండు నెలలకో పోయి చూసే పరిస్థితి ఉండేది. వారికి ఉన్న ఖాళీ సమయంలో ఈ జానపద ప్రదర్శన కళలు పాటలు ఇతర అభివ్యక్తి ప్రక్రియలు వినోదాన్ని అందించేవి. ఇంకా రకరకాల జానపద క్రీడలు ఆచారాలు వినియోగంలో ఉండేవి. అంటే సినిమా ప్రభావం ఒక స్థాయి మేరకే ఉండేది.

1980 దశకం తర్వాత సమాజంలో వచ్చే పరిణామాలు చాలా వేగవంతం అయ్యాయి. సామాజిక పరిణామాలను చాలా తీవ స్థాయిలో తేవడానీకి వచ్చిన సాంకేతిక మాధ్యమ విప్లవాలు అని చెప్పదగినవి ఒకటి సాటిలైట్‌ కేబుల్‌ టివి, రెండు మొబైల్‌ ఫోన్‌. ఈ రెండు జన జీవితాన్ని అతి తీవ్రస్థాయిలో ప్రభావితం చేశాయి. దీని తర్వాత ఇలాంటి ప్రభావం ఉన్న మరొక ప్రధాన అంశం విద్యావ్యాప్తి.

మన దేశంలో అక్షరాస్యత పెరిగిన విధానాన్ని పరిశీలించినా అక్షరాస్యత లేని వారి భాష అంటే లిఖిత సాహిత్య ప్రభావం కాని ఉన్నత స్థాయి భాష ప్రభావం కాని లేని వారిధి, అక్షరాస్యులు కాని వారి కేవల మౌఖిక భాష అంటే జానపద భాష వ్యాప్తి ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి అంటే 1947 నాటికి మన దేశంలో అక్షరాస్యత 12% గా ఉండేది. కాని అదే 1940 దశకంలో ఐరోపా దేశాలలో అక్షరాస్యత 90% గా ఉండేది. దీన్నే బట్టే పరాయి పాలనలో మగ్గిన దేశంలో చదువు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు వచ్చిన ఉద్యమాలు కూడా ఆ కాలంలో వచ్చినవే. దీన్ని బట్టే అంటే అక్షరాస్యత 12 శాతంగా ఉన్న ప్రజలకు నమాచారం అందించవలనిన మాధ్యమం జానపద భాష జునపద కళలు మాత్రమే అని నాటి ఉద్యమకారులు కాని ఇతరులు కాని గుర్తించారు.

ఆంధ్రదేశంలో కేబుల్‌ ద్వారా వ్యాపించే సాటిలైట్‌ టివి 1996 నుండే ఆరంభం అయింది. ఇది ప్రతి పల్లెకు వ్యాపించడానికి ఐదు నుండి పది సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2010 నాటికే ప్రతి పల్లెకు సాటిలైట్‌ టివి డిష్‌ టివి ప్రసార మాధ్యమం వ్యాపించింది. ఇంటింటికీ టివి ఉండడం టివి లేనీ గుడిసె కూడా లేకపోయిన స్టితి ఈ కాలానికే వచ్చింది. ఇక దీనితో పాటు దీనికి సమాంతరంగా విద్యా వ్యాప్తి ఎలా ఉందో తెలుసుకోవడం ముఖ్యం. 2011 జనగణన ప్రకారం భారత దేశం మొత్తంలో అక్షరాస్యత వ్యాప్తి 74.04% గా ఉంది. కాగా 2018 సంవత్సరంలో అంటే ఇటీవలే గణించిన లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత 94. 65 శాతంగా ఉంది.

ఇక్కడ నేటిస్టితిలో అక్షరాస్యత అంటే కేవలం అక్షరాలు మాత్రమే రాయగలిగిన వారు కారు అని కనీసం పదవ తరగతివరకు చదువుకున్నవారు అని గ్రహించాలి. దీనికి కారణం ప్రతిపల్లెకు విద్యావ్వాపారం పాకి పోయింది. అంటే ఇంగ్లీషు మీడియం ప్రైవేటు పాఠశాలలు ప్రతి పల్లెకూ వ్యాపించి పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉంది. కనీసం పదవతతరగతి వరకు చదివించని కుటుంబాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ వ్వాస కర్త ప్రతీ సంవత్సరం ఒక వంద గ్రామాలకు తగ్గకుండా సందర్శిస్తూ క్షేత పరిశోధన చేస్తూ ఉన్నాడు. ఈ గ్రామాలలో గమనించిన విషయాలు భాషలో వచ్చిన మార్పులు ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి.

ప్రతీ ఇంటిలోను టివి పనిచేస్తూ ఉంది అని చెప్పుకున్నాము. నేటి లెక్కల ప్రకారం ఒక తెలుగులోనే 56 ఛానళ్ళు పనిచేస్తున్నాయి.

ప్రజల భాషలో పరిపాలించేదే ప్రజాసామ్య ప్రభుతం

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్ 2019

15