పుట:Ammanudi-June-2019.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక నేటి దాకా జరిగిన పరిశోధనలను పరిశీలిస్తే జానపద భాషని గురించి చాలామంది జానపద విద్వాంసులు తమ పరిశోధన గ్రంథాలలో చెప్పారు. రామరాజు గారు జానపద భాషలోని విశేషాంశాలను చెప్పారు. నాయని కృష్ణకుమారిగారు తర్వాత రఘుమారెడ్డిగారు కూడా జానపద భాషని వర్ణించి విశేషాంశాలను చెప్పారు. ఆ తర్వాత కూడా మరికొందరు జానపద భాషని గురించి రాశారు కాని ఇక్కడ వారు చేసిన భాషాపరిశీలన అంతా కూడా వారు సేకరించిన జానపద సాహిత్యాన్ని గేయాలను ఆధారంగా చేసుకొని చేసిన పరిశీలనమే. మామూలుగా మాట్లాడిన భాషను వివిధ సందర్భాలలో సేకరించి చేసిన పరిశీలన కాదు ఇది. అంటే వారు సేకరించిన మౌఖిక సాహిత్యంలోని భాషకు జానపదులు నిత్య జీవనంలో మాట్లాడే భాషకు తేడా ఉంటుందా అని పరిశీలిస్తే వారు మాట్లాడే భాషలోనే సాహిత్యాన్ని సృష్టించి ఉండవచ్చు. కాని అది మాత్రమే జానపద భాష కాదు అది ఒక భాగం మాత్రమే అవుతుంది. కాని దైనందిన జీవితంలో ప్రతిరోజూ మాట్లాడే విస్తృత పదసంచయం, భాష మౌఖిక సాహిత్యం కన్నా విస్తృతంగా ఉంటుంది. దీన్ని కూడా సేకరించి ఆ భాషని విశ్లేషించే ప్రయత్నం తర్వాత జరిగింది.

భద్రిరాజు కృష్ణమూర్తిగారు ఈ పనిచేశారు. వీరు మాండలిక భాషని విశ్లేషించి తెలుగు మాండలిక భాషలు ఎన్ని ఉన్నాయి వాటి లక్షణాలు ఏమిటి వ్యాకరణం ఏమిటి అనే చర్చ చేశారు. వారు సంపాదకత్వం వహించి తయారు చేసిన గ్రంథం తెలుగు భాషాచరిత్ర లో వారే ఒక వ్యాసం మాండలిక భాషలపైన రాశారు. అదే వ్యాసంలో ఆయన జానపద భాషని గురించి చర్చించారు. అయితే ఇక్కడి భాషా చర్చ జానపద సాహిత్యం ఆధారంగా జరగలేదు. ఇది వారు మాండలిక వృత్తిపదకోశాల కోసం సేకరించిన భాష ఆధారంగా చేసిన భాషాపరిశీలన. వివిధ వృత్తులు చేసుకునే వారు వారి వృత్తికి సంబంధించి దైనందిన జీవితంలో, వృత్తి వినియోగంలో వాడిన మాట్లాడిన భాషను పరిశీలించారు. కృష్ణమూర్తిగారు తెలుగు మాండలిక భాషలని నాలుగు మండలాలుగా విభజించారు. 1. పూర్వమండలం, 2 దక్షిణ మండలం, 3. ఉత్తర మండలం, 4 మధ్యమండలం అని నాలుగు మండలాలుగా మన మాండలిక భాషలని విభజించి మాండలిక భాషకున్న లక్షణాలు వర్ణించారు. ఇక వీటి వివరాలు ఇక్కడ అవసరం లేదు కాని ఆయన చేసిన మరొక పరిశీలనను ఇక్కడ ప్రస్తావించాలి. ఇదే సందర్భంలో భాష వ్యక్తీకరణలను రెండుగా విభజించి చెప్పారు 1. శిష్టభాష 2. జానపద భాష. ఇక్కడ మొదటిది చదువుకున్న వారి భాష రెండోది చదువుకోని వారి భాష లేదా పామర భాష ఇక్కడ పామరులు అంటే కించపరిచే అర్థం లేదు.

జానపద భాషకి శిష్టభాషకి ఉన్న భేదాలను చెబుతూ ఎనిమిది ప్రధానమైన లక్షణాలను ఆయన సూచించారు. జానపద భాషని పరిశీలించడానికి ఆ విభజన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి జానపద భాషలో పడిన ప్రభావాలను పరిశీలించి వస్తున్న పరిణామాలను గ్రహించడానికి ఆయన చేసిన విభజన ఇక్కడ తప్పక పరిశీలించవలసి ఉంటుంది. ఆయన చెప్పిన ఎనిమిది లక్షణాలను ఇక్కడ చెబుతాను.

1. శిష్టోచ్చారణలో ఒత్తులు నిలుస్తాయి (భాగవతం, ధర్మం), జానపదోచ్చారణలో ఒత్తులు పోతాయి (బాగవతం దర్మం).

2. శి.ఉ లో అద్విరుక్త చకారం అంతటా నిలుస్తుంది. (చవుడు, చుక్క పలచన) జా.ఉ లో చకారం సకారం అవుతుంది (సవుడు, సుక్క పలసన)

3. శి.ఉ లో పదాది వకారం నిలుస్తుంది (ఇ,ఈ,ఎ,ఏ లముందు విల్లు, వీధి, వెండి, వేడి) జా-ఉ లో వకారం పోతుంది యిల్లు, యూది, యెండి, యేడి.

4. శి. ఉ లో సంయుక్త హల్లులు నిలుస్తాయి (భక్తి చేస్తాడు, కలెక్టర్‌) జా.ఉ లో హల్లులు సమీకరణం పొందుతాయి (బత్తి, సేత్తాడు, స్వరభక్తి కూడా రావచ్చు. కలకటేరు)

5. శి. ఉ లో శ, శ్హ, స ల భేదం ఉంటుంది. (శాస్త్రి, భాష, కాసు) జా. ఉ లొ శ, ష, స లు లు సకారంగా మారతాయి సేత్రి, బాస, కాసు)

6. శి.ఉ లో మూర్ధన్య దంతమూలీయ ఖేదం నిలుస్తుంది (పల్లం, పళ్ళెం, వాణ్ణి) జా. ఉ లో మూర్థన్యాలు దంతమూలీయా లౌతాయి (పల్లం, పల్లెం, దాన్ని, వాన్ని.

7. శి. ఉ లో f, ఫ వేరు వేరుగా ఉంటాయి (ఆఫీసు, కాఫీ, తోపు) జు.ఉ లో f, ప గా మారుతుంది (ఆఫీసు కాపీ తోపు)

8. శి. ఉ లో పదాది గకారం దేశ్య శబ్దాలలో నిలుస్తుంది (గట్టు, గడ్డ, గండి) జా. ఉ లో గ , గె మారుతుంది. (గెట్టు, గెడ్డ, గెండి).

జానపద భాషలో ఉన్న ఎనిమిది ప్రధాన లక్షణాలు పైన చేసిన పరిశీలనలో చూడవచ్చు. రోజూ మాట్లాడే భాషని పరిశీలిస్తే ఇంకా కొన్ని విధానాలు కూడా మనకు జానపద భాషలో కనీపిస్తాయి. అయితే పైన చెప్పిన ఎనిమిది భాషావిశేషాలు నేటికీ మనకు జానపద భాషలో కనిపిస్తాయి. అంతే కాదు పైన చెప్పిన జానపద భాష లక్షణాలు ఆయా మండలాలలో నివసించే విద్యావంతుల భాషలో కూడా మనకు కనిపించే తీరు ఇక్కడ మనం గమనించవచ్చు. తెలంగాణ మాండలికంలోని భాషారూపాలు ఇక్కడి విద్యావంతులు యాచ్చచ్చికంగా మాట్లాడే భాషలో కూడా చూడవచ్చు.

ఉదాహరణకి తెలంగాణ మాండలికంలో పైన చెప్పిన పదాది వకారం లోపించి వచ్చిండు బదులు అచ్చిండు, అచ్చింది అని పలకడం, మళ్లీ బదులు మల్లీ అనడం, వాళ్ళు బదులు వాల్లు అనడం, విద్యావంతులలో కూడ ఉంది. అంతే కాదు ఇక్కడి మాండలికానికి వేరే వ్యాకరణం రాసే ప్రయత్నమే ఉంది కాబట్టి ఇక్కడ దీనిపైన విస్తృత చర్చ అవసరం లేదు. ఇంతే కాదు కృష్ణ మూర్తిగారు చూపిన ఇంకా ఇతర మూడు మండలాలలోని భాషలలో ఉన్న విద్యావంతుల భాషలో కూడా ఇలాంటి మాండలిక పద వినియోగం మనం చూడవచ్చు.

ఇక నేటి జానపద భాషపైన ఏఏ ప్రభావాలు విస్తృతంగా పడ్డాయో మనం నేటి సందర్భంలో పరిశీలించి నేడున్న జానపద భాష వ్యక్తీకరణాలు ఎలా ఉన్నాయో చెప్పవచ్చు.

రామరాజుగారు జానపద భాషకి ఒక నిర్వచనం లాంటి

14

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూన్- 2019