పుట:Aliya Rama Rayalu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రామము చెన్నూరుసీమలోని తిరువేంగళనాధుని యుత్సవ కైంకర్యములకై సమర్పింపబడినది. శ్రీవిల్లిపుత్తూరులోని యమ్మవారికి రామనాథమండలములో పులియంగుల మనుగ్రామము నొసంగెను. కోడూరుగ్రామములో దుర్గాదేవి పూజా కైంకర్యమునకై సంవత్సరోత్సవమునాడు తిరునాళ్లకు వచ్చు ప్రజలనుండి సుంకములను గైకొనుటకై యనుమతి యిచ్చెను. మఱియు సిద్ధేశ్వరభోజేశ్వరస్వాములకు గడగిరేలను గ్రామము నొసంగుటయెగాక వారిమహోత్సవములకై కొంతధనసహాయము చేయుటకు నేర్పాటు గావించెను. ఉదయగిరిదుర్గసీమలో నుండుగ్రామములనుండి తేబడుచిల్లరవస్తువులనుండి వసూలు చేయబడు సుంకముల మూలమున శ్రీరంగనాథస్వామివారికి మంచిరాబడిని కలుగజేయుటయె గాక సూర్యగ్రహణకాలమున సువర్ణదానమునుగూడ జేసియుండెను. 'యధారాజాతథాప్రజా' యన్నట్లు సామ్రాజ్యప్రభువులమార్గమును వారిసామంతులును, ప్రజలుగూడ నవలంబించిరి. సదాశివదేవరాయల చక్రవర్తిగా నున్నకాలమున ననేకనూతన దేవాలయములు నిర్మింపబడినవి. శిధిలములయినవి విశాలపఱుపబడుటయెగాక నూతనాలంకారములతోను చిత్రములతోను చిత్రింపబడినవి. మహామండలేశ్వర జిళ్లేళ్లరంగపతిరాజయ్య దేవమహారాజుగారి కార్యకర్తయగు అమరినాయనివేంగళ నారాయనింగారు రాయచోటి గ్రామములోని వీరేశ్వరస్వామివారి ప్రాకారములోపల నడుమ