పుట:Aliya Rama Rayalu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాశ్వికదళముతో ఇభాన్‌ఖానుని, ఆఱువందలఫిరంగులతో ఏశియామైనారు యూరోపదేశములలో బ్రఖ్యాతిగాంచిన 'చలబీరుమీఖా' ననువానిని హుస్సేనునిజాముషా తనముందుంచుకొనియె నట ! ఈయుద్ధము ప్రారంభ మగుటకు బూర్వమె తిరుమలరాయలును, వేంకటాద్రియు దమయన్నను సమీపించి 'మీరువయోవృద్ధులరు' ఈభయంకరయుద్ధమున మీరునిలుచుట ప్రమాదకరమని మేము భావించుచున్నాము. సైన్యాధిపత్యమును మాకు విడిచిపెట్టుడని ప్రార్థించినను రామరాయలు వినక ముప్పదేండ్లయువకునివలె లేచి మాఱుమాటాడక మీమీమునుములను గాపాడుకొనుడని యాజ్ఞాపించెనట. అంతటితో దనివిచెందక జయము సంపాదింప దృడమనస్కులరై సుస్థిరముగా నిలిచి తురకలతో బోరాడవలసిన దనితనసైనికులను హెచ్చరింపుచు, ఎనుబదేండ్లునిండియు జీవితాంత్యకాలమున బిఱికిదనముతో దనబ్రదుకును నవమానపఱచుకొనజాల ననియు, ఎవరైనను సరే యుద్ధరంగమున నిలుచుటకు భయపడిరేని వారు తత్క్షణమె తొలగిపోయి తమప్రాణములను రక్షించుకొనుటకు స్వేచ్ఛ నొసగుచున్నానని బిగ్గరగా బలికెనట. వానిసోదరులును ముప్పదివేల యాశ్వికులును తాముమరణము పొందునంతవఱకు బోరాడుచుందుమని ప్రతిజ్ఞ బూనినట్లుగా 'బురహాన్ - ఈ - మాసీర్‌' అనుగ్రంథమున జరిత్రకారుడొకడు వ్రాసియున్నాడు.